రైల్వే అధికారుల‌కు వినియోగ‌దారుల ఫోరం షాక్‌… ప్రయాణికుల‌కు అసౌక‌ర్యం క‌లిగేలా చేసినందుకు రూ.30వేల ఫైన్‌..!

మ‌న దేశంలో రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ బోగీల్లో ప్ర‌యాణం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కాలు అడుగు తీసి అడుగు వేయ‌డానికి వీలు లేనంత ర‌ద్దీగా ఉంటుంది. జనాలు అలా రైళ్ల‌లో కిక్కిరిసి ప్ర‌యాణిస్తారు. ఆ బాధ‌ను ప‌డ‌లేకే చాలా మంది స్లీప‌ర్‌, థ‌ర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, సెకండ్ సిట్టింగ్ రిజ‌ర్వ్‌డ్ వంటి సీట్ల‌లో టిక్కెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకుని మ‌రీ వెళ్తారు. అయితే ఆయా బోగీల్లోనూ ఒక్కోసారి ర‌ద్దీగానే ఉంటుంది. ఎందుకంటే… అది టీటీఈల వ‌ల్లే. ప్ర‌యాణికుల నుంచి డ‌బ్బులు తీసుకుని సీట్లు ఖాళీ అయితే ఇస్తామ‌ని చెబుతారు. దీంతో వారు రిజ‌ర్వ్‌డ్ బోగీల్లో ఎక్కేస్తారు. ఇలా స్లీప‌ర్ క్లాస్ బోగీల్లో ఎక్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఇలాగే ఓ రైలులో స్లీప‌ర్ క్లాస్ రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్లు కొని కూడా అందులో ఉన్న ర‌ద్దీ కార‌ణంగా ఓ కుటుంబం తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డింది. దీంతో ఆ కుటుంబ య‌జ‌మాని త‌న‌కు క‌లిగిన అసౌక‌ర్యంపై వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు అత‌నికి న్యాయం జ‌రిగింది. ఆ కుటుంబానికి రూ.30వేల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని ఫోరం రైల్వేను ఆదేశించింది.

అత‌ని పేరు దావ్ కాంత్‌. పంజాబ్ వాసి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే అత‌ను 2009లో అమృత్‌స‌ర్ నుంచి ఢిల్లీకి త‌న కుటుంబంతో ఓ రైలులో ప్ర‌యాణం అయ్యాడు. అందుకు గాను అత‌ను కుటుంబంలో ఉన్న అంద‌రికీ స్లీప‌ర్ క్లాస్‌లో రిజ‌ర్వేష‌న్ చేయించాడు. అయితే వారు ఉన్న బోగీలో స‌రైన టిక్కెట్ లేని చాలా మంది ప్ర‌యాణికులు ఎక్కారు. దీంతో దావ్ కాంత్ కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. బోగీ కిక్కిరిసి పోవ‌డం వ‌ల్ల 90 నిమిషాల పాటు వారు ఎటూ క‌ద‌ల్లేక పోయారు. దీనికి తోడు పిల్ల‌ల‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. బోగీ మొత్తం బ్లాక్ అవ‌డంతో వారు స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు.

ఈ క్ర‌మంలో దావ్ కాంత్ టీటీఈకి త‌మ స‌మ‌స్య‌ను చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ ఆ టీటీఈ ప‌ట్టించుకోలేదు. దీంతో దావ్ కాంత్ వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. కాగా ఆ ఫిర్యాదును విచారించిన ఫోరం దావ్ కాంత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ కేసు విచార‌ణ‌కు 8 ఏళ్లు ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు తాజాగా ఆ కేసులో తీర్పునిచ్చింది ఫోరం. బాధిత కుటుంబానికి రూ.30వేల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని చెప్పింది. టిక్కెట్ స‌రిగ్గా లేని ప్ర‌యాణికులను అంత స్థాయిలో అనుమ‌తించ‌డ‌మే కాకుండా, టిక్కెట్ ఉన్న ప్రయాణికుల‌కు అంత‌టి తీవ్ర‌మైన అసౌక‌ర్యం క‌లిగించినందుకు గాను రైల్వే అధికారుల‌ను ఫోరం మంద‌లించింది. వెంట‌నే స‌ద‌రు న‌ష్ట ప‌రిహారం బాధితునికి అంద‌జేయాల‌ని తీర్పునిచ్చింది. అవును మ‌రి, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్టుగా, రిజ‌ర్వ్‌డ్ క్లాస్ టిక్కెట్ కొని ఆ బోగీలో ప్ర‌శాంతంగా ప్ర‌యాణం చేద్దామ‌నుకుంటే అది కూడా జ‌న‌ర‌ల్ బోగీలా త‌యారైతే అప్పుడు ఇక ఆ ప్ర‌యాణంలో సుఖం ఏముంటుంది..? విసుగు, అసౌక‌ర్యం, చెమ‌ట త‌ప్ప‌..!

Comments

comments

Share this post

scroll to top