అప్పుడు సైనా, ఇప్పుడు సింధు….ఇద్దరి వెనుక ఒక్కడే! అతడే గోపీచంద్.

గురువు దైవంతో స‌మానం కాబ‌ట్టే ఆచార్య దేవోభ‌వ అని పెద్ద‌లు అన్నారు. విద్యార్థుల‌కు త‌మ త‌ల్లిదండ్రుల త‌రువాత గురువే ప్ర‌థ‌మంగా ఉంటాడు. విద్యాబుద్ధులు చెప్పే వారే కాదు, ఏ రంగంలోనైనా శిక్ష‌ణనిచ్చే వారిని కూడా గురువుల‌నే అంటారు. అది క‌ళ‌లు, క్రీడారంగం… ఇలా ఏదైనా కావ‌చ్చు. అయితే ఏ అంశంలోనైనా విద్యార్థి మెళ‌కువ‌లు నేర్చుకుని అందులో అంత‌ర్జాతీయ స్థాయిలో రాణిస్తేనే గురువుకు కూడా త‌గిన గుర్తింపు ఉంటుంది. ఆ గురువు కూడా ఆ అంశంలో విశేష ప్రావీణ్యుడై, విద్యార్థికి విద్య‌ను నేర్పించ‌డంలో ద్రోణాచార్యుడంత‌టి వాడై ఉన్న‌ప్పుడే విద్యార్థి స‌త్తా చాటుతాడు. మ‌న ద్రోణాచార్యుడు, జాతీయ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా స‌రిగ్గా ఇలాంటి కోచ్‌ల కోవ‌కే చెందుతాడు.

gopicand

మాజీ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ ప్ర‌కాష్ ప‌దుకునే ఆధ్వ‌ర్యంలో గోపీచంద్ బ్యాడ్మింట‌న్ శిక్ష‌ణ తీసుకున్నాడు. 1991లో త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. అయితే అప్పుడు అత‌నికి ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ క్ర‌మంలో బంధువులు, స్నేహితుల స‌హాయంతో గోపీచంద్ బ్యాడ్మింట‌న్ శిక్ష‌ణ తీసుకున్నాడు. కానీ ఆరంభంలో అత‌నికి మోకాళ్ల దెబ్బ‌లు బాగా తాకేవి. అయినా వాటికి వెర‌వ‌కుండా ముందుకు సాగాడు. అనంత‌రం 1996లో సార్క్ బ్యాడ్మింట‌న్ టోర్నీతో త‌నలో ఉన్న స‌త్తా చాటాడు. ఇక ఇప్ప‌టి నుంచి గోపీచంద్ వెన‌క్కి తిరిగి చూడలేదు. ఎన్నో విజ‌యాల‌ను కైవ‌సం చేసుకున్నాడు. 1999లో ఫ్రాన్స్‌, స్కాటిష్ టోర్న‌మెంట్‌, 1998 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో సిల్వ‌ర్ మెడ‌ల్ వంటి ఎన్నో విజ‌యాల‌ను సాధించాడు. 2001వ సంవ‌త్స‌రం వ‌ర‌కు కెరీర్‌లోనే అత్యుత్త‌మ ర్యాంక్ 5 ను సొంతం చేసుకున్నాడు. అనంత‌రం త‌న కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు.

అయితే గోపీచంద్ రిటైర్ అయినా త‌న‌లోని ప్ర‌తిభ‌తో మెరిక‌ల్లాంటి బ్యాడ్మింట‌న్ క్రీడాకారుల‌ను త‌యారు చేయాల‌నుకున్నాడు. అందులో భాగంగానే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు స్థ‌లం ఇవ్వ‌డంతో హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని ఏర్పాటు చేసేందుకు గోపీచంద్ పూనుకున్నాడు. అయితే అత‌ని వ‌ద్ద త‌గినంత డ‌బ్బు లేక‌పోవడంతో దాతల స‌హాయంతో దాని నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో ఔత్సాహికులకు శిక్ష‌ణనివ్వ‌డం మొద‌లు పెట్టాడు. ఆ శిక్ష‌ణ‌లో భాగంగానే సైనా నెహ్వాల్ (వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 5), పీవీ సింధు (వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 9), శ్రీ‌కాంత్ (వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 11) వంటి స‌త్తా గ‌ల ప్లేయ‌ర్ల‌ను త‌యారు చేశాడు. వారంతా బ్యాడ్మింట‌న్‌లో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిల్లో ఏ విధంగా రాణించారో అంద‌రికీ తెలిసిందే.

gopichand-coaching

గోపీచంద్ గొప్ప ప్లేయ‌ర్, కోచ్ మాత్ర‌మే కాదు. మంచి హృద‌యం ఉన్న మాన‌వ‌తా వాది కూడా. తాను అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్‌లు ఆడుతున్న‌ప్పుడు వ‌చ్చిన ప్రైజ్ మ‌నీ మొత్తాన్ని సామాజిక సేవ కోస‌మే ఉప‌యోగించాడు. కార్గిల్ యుద్ధంలో మ‌ర‌ణించిన అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు, గుజ‌రాత్ భూకంప బాధితుల‌కు గోపీచంద్ స‌హాయం చేశాడు. అంతేకాదు, కోలా వంటి డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల హానిక‌ర ఫ‌లితాలు ఉంటాయ‌ని తెలుసుకోవ‌డంతో స‌ద‌రు సంస్థ‌ల‌కు చెందిన యాడ్, కాంట్రాక్ట్ ఒప్పందాల‌ను కూడా అత‌ను ర‌ద్దు చేసుకోవ‌డం విశేషం. ఏది ఏమైనా, ఒలంపిక్స్‌లో మెడ‌ల్స్ సాధించగ‌ల స‌త్తా ఉన్న క్రీడాకారుల‌ను త‌యారు చేస్తున్నందుకు గాను మ‌న ద్రోణాచార్య పుల్లెల గోపీచంద్‌ను ఎంత పొగిడినా అది త‌క్కువే అవుతుంది. మీరేమంటారు..!

Comments

comments

Share this post

scroll to top