ట‌మాటాలు కేజీ రూ.1500 అమ్మే కాలం రానుందా..? పెరిగిపోతున్న ద్ర‌వ్యోల్బ‌ణం చూస్తే అలాగేన‌నిపిస్తుంది…

ఆదిత్య 369 సినిమా గుర్తుందా? అందులో హీరో, హీరోయిన్లు టైమ్ మెషీన్‌లో ముందుగా రాజుల కాలానికి, అటు త‌రువాత భ‌విష్య‌త్ కాలానికి వెళ్తారు. అక్క‌డ, ఆ కాలంలో ట‌మాటా కేజీ రూ.1500 అని ఇద్ద‌రు న‌టుల మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌లో కూరగాయ‌ల రేట్లు విని షాక్‌కు గుర‌వుతారు. అంతా గుర్తుందిగా. ఆ… అవును, అదే. ఇప్పుడు దాని గురించే మేం చెప్ప‌బోయేది. ప్ర‌స్తుతం మండిపోతున్న కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌ను చూస్తుంటే త్వ‌ర‌లో పైన చెప్పిన లాంటి భ‌విష్య‌త్ కాలం రోజులు రాబోతున్నాయేమోన‌నిపిస్తోంది. అది సినిమాయే అయినా ఇప్ప‌టి నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే రానున్నరోజుల్లో అన్ని వ‌స్తువుల‌కు దాదాపు అలాంటి ప‌రిస్థితే వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. క‌న్‌జ్యూమ‌ర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) వారు తాజాగా విడుద‌ల చేసిన ప‌లు ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు చూస్తే భ‌విష్య‌త్ పట్ల ఆందోళ‌న చెందాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ఇక‌నైనా త‌గిన జాగ్ర‌త్త తీసుకోవాల్సిందేన‌ని అర్థ‌మవుతుంది.

vegetables-pulses-rates

రిటెయిల్ రంగంలో నిత్యావ‌స‌ర వ‌స్తువులు, కూర‌గాయ‌లు త‌దిత‌రాల ద్ర‌వ్యోల్బ‌ణం మార్చిలో 5.2 గా ఉండ‌గా ఏప్రిల్‌లో అది 5.47కు, మేలో ఏకంగా 5.76కు చేరుకుంది. దీన్ని బ‌ట్టి చూస్తే చాలు ఆయా వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా పెరిగిపోతున్నాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. గ‌త రెండేళ్ల‌తో పోలిస్తే ఈ పెరుగుద‌ల 7.55 శాతంగా ఉంద‌ని ఆర్థిక నిపుణులు తెలియ‌జేస్తున్నారు. 2013 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ద్ర‌వ్యోల్బ‌ణం 11.16 శాతం పెరిగిన‌ట్టు వారు గుర్తించారు.

ప్ర‌ధాన ఆహార ద్ర‌వ్యోల్బ‌ణ‌మైతే అంతు చిక్క‌ని విధంగా పెరిగిపోతుండ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్‌లో ఈ ద్ర‌వ్యోల్బ‌ణం 10.73 గా ఉండ‌గా, మేలో అది 12.94 శాతానికి చేరుకుంది. కేవ‌లం ఒక నెల‌లోనే ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 2.21 శాతం పెర‌గ‌డం గ‌ర్హ‌నీయం. ఇక ప్ర‌త్యేకంగా ప‌ప్పు దినుసుల ద్ర‌వ్యోల్బ‌ణ‌మైతే ప్ర‌స్తుతం 31.57 శాతంగా కొన‌సాగుతుండ‌గా, కోడిగుడ్ల ద్ర‌వ్యోల్బ‌ణం 9.13 శాతంగా, మాంసం ద్ర‌వ్యోల్బ‌ణం 9.72 శాతంగా, వంట నూనెల ద్ర‌వ్యోల్బ‌ణం 4.83 శాతంగా కొన‌సాగుతోంది.

పంట ఎక్కువ‌గా చేతికి వ‌చ్చిన‌ప్పుడు దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసి ఉంచేలా స‌రైన కోల్డ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణం చేప‌ట్ట‌క‌పోవ‌డం, కొన్ని ప్రాంతాల్లో సంభ‌విస్తున్న తీవ్ర‌మైన క‌రువు, మ‌రికొన్ని ప్రాంతాల్లో ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న వ‌ర్ష‌పాతం, భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు, ద‌ళారీ వ్య‌వ‌స్థ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్లే ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం అంతలా పెరిగిపోతుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించాలంటే ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే మేల్కొనాల‌ని, లేదంటే ముందు ముందు ప‌రిస్థితి మ‌రింత తీవ్ర‌త‌ర‌మ‌వుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అంతేగా మ‌రి, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు ఆలోచించి స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే పైన చెప్పిన‌ట్టుగా కిలో ట‌మాట‌ల‌ను రూ.1500 ల‌కు కొనుగోలు చేయ‌డం ఖాయం. అంతేగా!

Comments

comments

Share this post

One Reply to “ట‌మాటాలు కేజీ రూ.1500 అమ్మే కాలం రానుందా..? పెరిగిపోతున్న ద్ర‌వ్యోల్బ‌ణం చూస్తే అలాగేన‌నిపిస్తుంది…”

  1. Dell says:

    Calnlig all cars, calling all cars, we’re ready to make a deal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top