ప్రేమ అంటే అంతే..! కన్నవారిని దూరం చేస్తుంది. ఉన్న ఊరుకు దూరంగా ఎక్కడో, ఎవరికీ సంబంధం లేకుండా బతికేలా మారుస్తుంది. అంతా బాగుంటే ఓకే. లేదంటే చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ కష్టాలే కనిపిస్తాయి. బతుకంతా ముళ్లబాటే అవుతుంది. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో కూడా తెలియదు. దీంతో బతుకు మీద ఆశ కోల్పోయి చివరికది ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. ఆ యువతికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే ఆమె ప్రాణాలు తీసుకోలేదు. దాని అంచుల దాకా వెళ్లింది కానీ, చివరకు తన నిర్ణయం తప్పని తెలుసుకుని జీవితంలో ముందుకే సాగాలి కానీ వెనక్కి వెళ్లకూడదని, తనువు చాలించకూడదని తెలుసుకుని అలాగే చేస్తోంది.
అందరు యువతుల్లాగే ఆమెకు కూడా ఓ రోజు ఓ వ్యక్తిని చూడగానే మనస్సులో ఓ భావం మెదిలింది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని. తన జీవితం అతనితోనేనని అనిపించింది. వయస్సు అలాంటి కదా. అతనితో వెంటనే ప్రేమలో పడింది. చివరికది పెళ్లికి దారి తీసింది. యథావిధిగా ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఎదిరించింది. పోరాడింది. అయినా ఫలితం లేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. మొదటి కొద్ది రోజుల వరకు బాగానే నడిచింది. అనంతరం ఆమె ఊహించిన అందమైన జీవితం ముళ్ల బాటే అయింది.
ప్రాణానికి ప్రాణంగా ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భావించిన ఆమెకు ఆమె భర్త నిత్యం నరకం చూపించసాగాడు. తాగొచ్చి చిత్రహింసలు పెట్టేవాడు. వాటిని మౌనంగానే ఆమె భరించింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఓ మగ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. అనంతరం ఆమెకు మరో బిడ్డను కలగాలని అనిపించింది. ప్రెగ్నెంట్ కూడా అయింది. అందుకు భర్త ఒప్పుకోలేదు. రెండు, మూడు సార్లు ప్రెగ్నెంట్ అయినప్పటికీ బలవంతంగా అబార్షన్ చేయించాడు. అది ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించేలా చేసింది. ఓ వైపు భర్త చిత్రహింసలు, మరోవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం. రెంటినీ ఆమె తట్టుకోలేకపోయింది. అదే సమయం, సరిగ్గా అదే సందర్భం. అప్పుడే తన జీవితానికి చరమగీతం పాడాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.
సరిగ్గా ఆత్మహత్య చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటుండగా అనుకోకుండా ఆమె మనస్సులో ఏదో అలజడి. ఓ ఆలోచన. తాను చనిపోతే తన కొడుకు పరిస్థితి..? ఊహిస్తేనే భయం వేసింది. వెంటనే ఆత్మహత్య ప్రయత్నం మానుకుంది. భర్త నుంచి విడిపోవాలని అనుకుని అలాగే చేసింది. డైవోర్స్ తీసుకుంది. అప్పుడామెకు ఎక్కడికెళ్లాలో తెలియదు. కొడుకును తీసుకుని భర్త పెట్టే నరకం నుంచి శాశ్వతంగా విముక్తి అయితే చెందింది కానీ, ఎవరి దగ్గరకు వెళ్లాలో ఆలోచన రాలేదు. కొన్ని రోజులు ఎక్కడో అనామకురాలిగా గడిపింది. ఒక రోజు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను వచ్చాడు. పుట్టెడు కష్టాల్లో ఉన్న కూతుర్ని చూసి జాలి పడ్డాడు. కొడుకును తండ్రికి అప్పగించింది ఆమె. సొంతంగా తన కాళ్లపై తాను బతకాలని అనుకుంది. ఉద్యోగం సాధించింది. అనుకోకుండా ఓ రోజు మరో వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. అతను కూడా భార్య నుంచి విడాకులు తీసుకున్నవాడే. ఇద్దరికీ మనసులు కలిశాయి. ఎట్టకేలకు అతన్ని ఆమె పెళ్లి చేసుకుంది. కొత్త జీవితం గడుపుతోంది. ఇంతకు ముందులా కొత్త భర్త చిత్ర హింసలు లేవు. లాలనగా, ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఆమె ఒకప్పుడు అనుకున్న కలల జీవితం ఇప్పుడు గడుపుతోంది.
ఇదీ… ఓ యువతి యదార్థ గాథ. ప్రేమ పెళ్లి కారణంగా కన్నవారికి దూరమై, భర్త చిత్రహింసలను భరించి, మరో కొత్త వ్యక్తితో కొత్త జీవితం గడుపుతోంది ఆమె. ఆమె కొడుక్కి ఇప్పుడు 9 ఏళ్లు. అతనికి కూడా తన తల్లికి జరిగినదంతా తెలుసు. అయినా అతని మనస్సులో ఎలాంటి ద్వేషం, భావాలు లేవు. ఇప్పటి తండ్రితో సంతోషంగా ఉంటున్నాడు.
జీవితమంటే అంతే. ఇప్పుడు మనకు బాధ కలిగించే సంఘటనలు జరగవచ్చు. వాటికి ఉపశమనం త్వరలో ఉంటుందనే ఆశతోనే మనం జీవించాలి. అంతమాత్రాన కుంగిపోకూడదు. నిరాశ చెందకూడదు. సుఖం, సంతోషం ఎంత సహజమో, జీవితంలో కష్టాలు, నష్టాలు కూడా అంతే సహజం. వాటి నుంచి పారిపోకూడదు. తెలివిగా పరిష్కరించుకోవాలి..!