హాయ్ అండీ! నేను మీకు గుర్తున్నానా..? ఆ… ఎందుకు ఉండను లెండి. నిత్యం నేను మీతోనే ఉంటాగా. కాకపోతే కొద్ది సేపటి అవసరానికే నన్ను మీరు వాడుకుంటారు. అన్నట్టు నన్నెలా తయారు చేస్తారో మీకు తెలుసు కదా! ముందుగా ప్లాస్టిక్నంతా కరిగిస్తారనమాట. దాన్నుంచి ఆయిల్ తీస్తారు. దాంతో నన్ను తయారు చేస్తారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ ఆయిల్లో కేవలం 0.2 శాతం ఆయిల్తోనే నాలాంటి వారిని ఏటా 5 ట్రిలియన్ల సంఖ్యలో మీ మనుషులు తయారు చేస్తున్నారు. అంటే ఎంతో తెలుసా? అక్షరాలా 5 లక్షల కోట్లు. అవునా, అని ఆశ్చర్యపోకండి. అది నిజమే. మమ్మల్ని ఎక్కువగా ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మేం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి కాబడుతున్నాం.
మీ మనుషులు ఒక్కొక్కరు మాలాంటి వారిని ఏడాదికి 216 వరకు ఉపయోగిస్తున్నారు. కాకపోతే మేం మీ వద్ద 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేం అనుకోండి. అది వేరే విషయం. అన్నట్టు మీరు అలా 20 నిమిషాలు మాత్రమే వాడి పడేసినా మేం బతికేది ఎన్ని సంవత్సరాలో తెలుసా? 1వేయి ఏళ్లు. ఆ వేయి సంవత్సరాల కాలంలో మేం భూమిలో కలిసిపోయి మరణించకుండా అలాగే ఉంటాం. కాకపోతే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాం. అంతే! మీరు తాగే నీటిలోకి, పీల్చే గాలిలోకి విష పదార్థాలను వదిలి పెడతాం. అలా మీ ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తాం. మా గురించిన ఇంకో విషయం తెలుసా? మేం సముద్రాల్లో కూడా పెద్ద ఎత్తున చేరుతున్నాం. దాంతో వాటిలో నివసించే లెక్కలేనన్ని జీవరాశులను కూడా అంతమొందిస్తున్నాం. అలా మేం ఒక వేయి సంవత్సరాల పాటు మీకు, మీ పర్యావరణానికి చేయకూడని నష్టం చేస్తున్నాం. మమ్మల్ని కొందరు మృత్యుంజయులు (మృత్యువును జయించిన వారు) అని కూడా పిలుస్తారండోయ్! వారికి మా మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి! కొద్ది సేపట్లోనే, లేదంటే కొద్ది నిమిషాలు, గంటలు, రోజుల్లోనే మనం కలుద్దాం. ఏమంటారు? నన్ను కలిసేందుకు వస్తారు కదా? అయితే ఎక్కడికో మీకూ తెలుసు కదా? అదేనండీ సూపర్మార్కెట్లు, కిరాణా షాపులు, ఫుడ్ పాయింట్లు, ఇతర షాపులు వగైరా… వగైరా… మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడికి వచ్చి నేను కలుస్తాను. ఇంతకీ నా పేరు మీకు చెప్పనే లేదు కదూ, నేనేనండీ! మీ పాలిథీన్ కవర్ని!
చెప్పుకోవడానికి ఇంత జోక్‌గా ఉన్నా మ్యాటర్ మాత్రం సీరియస్సేనండీ బాబూ. పాలిథీన్ కవర్ల వాడకం వల్ల మన పర్యావరణానికి, తద్వారా మనకు ఏ విధమైన నష్టం కలుగుతుందో చెప్పడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం. పాలిథీన్ కవర్లను వాడడం ఎంతటి అనర్థాలు జరుగుతాయో పైన తెలుసుకున్నాం కదా, అయితే అవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. వాటి వల్ల ఇంకా మనకు ఎక్కువ నష్టాలే కలుగుతాయట. దీనిపై పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్తలు ఎంతో ఆందోళన చెందుతున్నారు కూడా. సో, ఇకనైనా మనం మేల్కొని వీలైనంత వరకు పాలిథీన్ కవర్ల వాడకాన్ని తగ్గిద్దాం. కలప, బట్టతో తయారైన సంచులను వాడుదాం. పర్యావరణానికి మేలు చేద్దాం. ఏమంటారు, మేము చెప్పింది కరెక్టే కదా!
I follow your site from few months ago.i really love your articles.keep moving to tell us about new intresting things