జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ నగర రహదారులను ప్లాస్టిక్ చెత్త ద్వారా నిర్మించారు. ఆ వేస్ట్ ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి ఇలా రోడ్ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ తొందరగా నాశనం కాని పదార్థం మరియు నాన్ బయోడిగ్రేడబుల్ అని తెలిసిన విషయమే. ఆ నగరంలోని చెత్త కేంద్రాల వద్ద ప్లాస్టిక్ ను సేకరించి, మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా 2 నుండి 4 మి.మీ. లుగా వీటిని తయారుచేస్తారు. ఈ ప్లాస్టిక్ కు బిట్యుమెన్ (తారులాంటి) ఆయిల్ పదార్థాన్ని కలిపి రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
జంషెడ్ పూర్ ప్రయోజనాల మరియు సేవల సంస్థ (JUSCO) తో టాటా కంపెనీలోని అనుబంధ సంస్థ కలిసి ఇలా జంషెడ్ పూర్ లో ప్లాస్టిక్ తో కూడిన రహదారుల నిర్మాణం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకూ 48 నుండి 50 కి.మీ. ల వరకూ రహదారుల నిర్మాణం ప్లాస్టిక్ తో జరిగింది. ప్లాస్టిక్ తో పాటు కావాల్సిన బిట్యుమెన్ ను మధురైలోని తిరుప్పాంకురంలో గల త్యాగరాజర్ ఇంజినీరింగ్ కళాశాల తయారుచేస్తోంది. ఈ హక్కులన్నీ పూర్తిగా ఆ కళాశాల వారికే పరిమితం. ఇలా ప్లాస్టిక్ ను ఉపయోగించి నిర్మించిన రహదారులు ఎంతో దృడంగా ఉండడమే కాకుండా, నాణ్యతలోనూ ఏ మాత్రం లోటులేదు.

ప్రస్తుతం జంషెడ్ పూర్ లోని రహదారులన్నీ 20 నుండి 30 శాతం ఇలా వేస్ట్ ప్లాస్టిక్ ను ఉపయోగించి రహదారుల నిర్మాణం చేస్తున్నారు. కాగా ప్రతి కిలో మీటర్ కు ఇలా ఒక టన్ను బిట్యుమెన్ ను ఉపయోగించడం వలన రూ. 50, 000 వరకూ ఆదా అవుతుందట. అయితే ఇలా ప్లాస్టిక్ ను ఉపయోగించి, బిట్యుమెన్ ద్వారా రోడ్లను వేయడానికి చాలా రాష్ట్రాలు కోరగా, ఇలా కమర్షియల్ గా చేసేందుకు జంషెడ్ పూర్ ప్రయోజనాల మరియు సేవల సంస్థ నిరాకరించింది. కేవలం సమాజం కొరకు ఉపయోగపడేలా చేయడానికైతే సిద్ధమని వ్యాపారంలా చేయడానికి అయితే ఒప్పుకోమని చెప్పింది.
ఈ విధానాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని అంబికాపూర్ నగర అధికారులు ప్లాస్టిక్ ద్వారా రహదారులను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో విషయమేమిటంటే పారిశుద్ధ్య విషయంలో జంషెడ్ పూర్ నగరం ఏడవస్థానంలో నిలిచింది.