వేస్ట్ ప్లాస్టిక్ తో రోడ్లు….కేరళ సర్కార్ చొరవకు అభినందనలు.

ప్లాస్టిక్‌… నేడు ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతోంది. ఏటా కొన్ని బిలియ‌న్ ట‌న్నుల ప్లాస్టిక్ ఉత్ప‌న్న‌మ‌వుతున్న నేప‌థ్యంలో వాడి ప‌డేసిన ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను స‌ముద్రాల్లో ప‌డేస్తున్నారు. దీంతో ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతోంది. ఇక క్యారీ బ్యాగ్స్ లాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అవి తీద్దామంటే చేతికి రావు. భూమిలో అలాగే క‌లుస్తాయి. ఈ క్ర‌మంలో అవి మ‌ట్టిలో క‌లిసిపోవాలంటే కొన్ని వంద‌ల ఏళ్లు ప‌డుతుంది. ఇది మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇక‌పై ఈ ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్ట‌నుంది కేర‌ళ స‌ర్కార్‌. అదెలాగంటే..!

plastic-road
మ‌న దేశంలో రోడ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. ఏ న‌గ‌రంలో చూసినా, ప‌ట్ట‌ణం లేదా గ్రామంలో అయినా రోడ్లు గుంత‌ల‌మ‌యంతో ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఒక సారి రోడ్లు వేస్తే ఒక కాలం మారేలోపే అవి పూర్తిగా గుంత‌లు ప‌డి, ప్ర‌జ‌ల‌కు నిరుప‌యోగంగా మారుతున్నాయి. దీంతో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ స‌ద‌రు గుంత‌ల‌కు ప్యాచ్‌లు వేయాల్సి వ‌స్తోంది. అయితే ఎన్నిసార్లు ప్యాచ్‌లు వేసినా రోడ్లు వేసేందుకు ఉప‌యోగించే మెటీరియ‌ల్ స‌రిగ్గా లేక‌పోతే ఎవరైనా ఏం చేయ‌లేరు క‌దా. అందుకే స‌ద‌రు మెటీరియ‌ల్‌ను ప్లాస్టిక్‌తో భ‌ర్తీ చేస్తూ రోడ్ల‌ను వేయాల‌ని డిసైడ్ అయింది కేర‌ళ ప్ర‌భుత్వం. ఇక‌పై ఆ రాష్ట్రంలో ప్లాస్టిక్‌తో వేసిన రోడ్లే ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. ఎంత‌కాలం ఉన్నా దృఢంగా ఉండ‌డం, అంత సుల‌భంగా చెద‌ర‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న కార‌ణంగా ప్లాస్టిక్‌ను రోడ్ల కోసం ఉప‌యోగించనున్నారు. రాష్ట్రంలో ఉన్న ఇండ్ల‌లో నిత్యం ఉత్ప‌న్న‌మ‌య్యే ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రించి వాటిని అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌కు వేడి చేస్తూ, అవ‌స‌ర‌మైతే వివిధ ర‌సాయ‌నాలు క‌లుపుతూ త‌యారు చేసే ప్లాస్టిక్ మిశ్ర‌మంతో రోడ్ల‌ను వేయ‌నున్నారు. ఇవి ఎక్కువ కాలం దృఢంగా కూడా ఉంటాయ‌ట‌. ఓ ప్రైవేటు కంపెనీకి ఈ బాధ్య‌త‌ను అప్ప‌గించింది కేర‌ళ గ‌వ‌ర్న‌మెంట్‌.

అయితే ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో రోడ్ల‌ను వేయ‌డం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయంటున్నారు సైంటిస్టులు. అవేమిటంటే… ప్లాస్టిక్ రోడ్లు ఎండాకాలంలో మ‌న‌గ‌ల‌గ‌డం చాలా క‌ష్ట‌మ‌ట‌. వేస‌విలో ఉండే ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా ప్లాస్టిక్ క‌రిగితే దాంతో వాహ‌న‌దారుల‌కు చాలా ఇబ్బందులు వ‌స్తాయి. అదేవిధంగా అలా క‌రిగే ప్లాస్టిక్ నేల‌లోకి ఇంకి మ‌రిన్ని ఇబ్బందులు సృష్టించేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌ధానంగా భూగ‌ర్భ జ‌ల వ‌న‌రులు క‌లుషితం అవుతాయి. దీంతో అనేక ర‌కాల అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌. మ‌నుషుల్లో హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌లు ఏర్ప‌డుతాయ‌ట‌. కానీ అన్ని ర‌కాల ప్లాస్టిక్ వ్య‌ర్థాలతో రోడ్ల‌ను వేయ‌లేమ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పాలీప్రొపిలీన్ (పీపీ), పాలీస్టెరీన్ (పీఎస్‌), పాలీఎథిలీన్ (పీఈ) వంటి ప్లాస్టిక్స్‌తోనే రోడ్లు వేయ‌వ‌చ్చ‌ట. అయితే ఎండాకాలంలో వాటి వ‌ల్ల ఉత్ప‌న్న‌మ‌య్యే స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి స‌ద‌రు ప్లాస్టిక్‌ల‌కు మ‌రిన్ని ర‌సాయ‌నాలు క‌ల‌పాల్సి ఉంటుంద‌ని, అప్పుడే అవి ఎంత‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌నైనా త‌ట్టుకుంటాయ‌ని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్లాస్టిక్‌ను ఇలా వినియోగించాల‌ని భావిస్తున్న కేర‌ళ ప్ర‌భుత్వ చొర‌వ‌ను మ‌నం అభినందించాల్సిందే.! మీరేమంటారు..!

Comments

comments

Share this post

scroll to top