రూ.35.50 ల‌క్ష‌ల‌ను ఇస్తామ‌ని సీఎం చెప్పారు. హామీ మరిచారు. ఈ యువ‌తి పైలట్ కావాల‌నే క‌ల క‌ల‌గానే మిగ‌ల‌నుంది.!?

మ‌న రాజకీయ నాయ‌కుల హామీలు అంటే నీటి మూట‌లేనా..? తామ‌రాకు మీద నీటి బొట్ల‌లా వాటికి సుస్థిర‌త అనేది ఉండ‌దా..? అవి నిల‌బ‌డ‌లేవా..? అంటే.. అవుననే ఎవ‌రైనా చెబుతారు. ఎందుకంటే వారు అధికారంలోకి రాక ముందు ఇచ్చే హామీలు, అధికారంలోకి వ‌చ్చాక నిల‌బెట్టుకోరు క‌దా. ఇక అవి కాకుండా ఆర్థిక స‌హాయం అవ‌స‌రం ఉన్న వారి స‌మ‌స్యలు తీరుస్తామ‌ని కూడా నాయకులు అప్పుడ‌ప్పుడు జ‌నాల‌కు మాటిస్తుంటారు. మ‌రి ఆ మాట‌లు నెరవేర్చిన నాయ‌కులు అయితే మ‌న క‌ళ్ల‌కు క‌న‌బ‌డ‌రు. ఈ యువ‌తి దీనావ‌స్థ తెలిస్తే ఎవ‌రైనా అదే మాట అంటారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఆ యువ‌తి పేరు స‌యెదా స‌ల్వా ఫాతిమా. ఉంటున్న‌ది హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో. తండ్రి పేరు స‌య్య‌ద్ అష్ఫ‌క్ అహ్మ‌ద్‌. దిన‌స‌రి కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని పేద కుటుంబం వారిది. అయిన‌ప్ప‌టికీ అష్ఫ‌క్ ఫాతిమాను చ‌క్క‌గా చ‌దివించాడు. అయితే ఫాతిమాకు చిన్న‌ప్ప‌టి నుంచి పైల‌ట్ అవ్వాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. దీంతో చాలా క‌ష్ట‌ప‌డి చ‌దివేది. తండ్రి క‌ష్టాన్ని ఆమె వృథా చేయ‌లేదు. ఈ క్ర‌మంలో చాలా క‌ఠోర‌మైన శ్ర‌మ‌, శిక్ష‌ణ‌తో 2013లో క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్‌ను పొందింది. దాని గ‌డువు 2018 వ‌ర‌కు ఉంది. అయితే ఆ లోపున ఆమె ఓ ట్రెయినింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు అవ‌స‌రం ప‌డ్డాయి.

దిన‌స‌రి కూలీ అయిన అష్ఫ‌క్‌కు ఆ స్థోమ‌త లేదు. దీంతో గ‌త 14 నెల‌ల కింద‌ట ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకోగా, సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పిలిపించి ఫాతిమాకు స‌హాయం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అందుకు గాను రూ.35.50 ల‌క్ష‌ల‌ను అందిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ అయితే అన్నారు గానీ, ఇప్ప‌టికి 14 నెల‌లు గ‌డుస్తున్నా ఆ నిధులు ఇంకా విడుద‌ల కాలేదు. దీంతో ఫాతిమా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ ఆమె, ఆమె తండ్రి ఎన్నోసార్లు తిరిగారు. అయినా ఫ‌లితం లేదు. ఈ క్ర‌మంలో మ‌రో వైపు ఆమె లైసెన్స్ గ‌డువు 2018 వ‌ర‌కు మాత్ర‌మే ఉండ‌గా, ఇప్ప‌టికే ఆమె ట్రెయినింగ్ దాదాపుగా పూర్త‌యి ఉండాలి. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడైనా ఆమె ట్రెయినింగ్‌లో చేరితే ఆమె కోరుకున్న‌ట్టుగా పైల‌ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే ఆ క‌ల నెర‌వేర‌కుండా పోతుంద‌ని ఆమె ఆవేద‌న వ్యక్తం చేస్తోంది. మ‌రి… ఇప్ప‌టికైనా ఈ విష‌యం ఉన్న‌తాధికారుల‌కు, సీఎంకు తెలుస్తుందా, వారు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటారా..?, పేద కుటుంబం నుంచి వ‌చ్చిన ఓ ముస్లిం యువ‌తి త‌న క‌ల‌ను సాకారం చేసుకుని పైల‌ట్ అవుతుందా..? అంటే అందుకు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Comments

comments

Share this post

scroll to top