నేటి తరుణంలో చాలా మంది స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. టాయిలెట్ లేని వారు కూడా స్మార్ట్ఫోన్లను వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఫోన్ లేకుండా ఒక రోజు కాదు కదా కనీసం ఒక గంట, ఒక నిమిషం పాటు కూడా ఎవరూ ఉండలేకపోతున్నారు. అంతగా స్మార్ట్ఫోన్లు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటిస్తే దాంతో స్మార్ట్ ఫోన్ల వాడకం మరింత సులభతరం అవుతుంది. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొన్ని రకాల గేమ్స్‌ను ఆడేటప్పుడు వాటిలో యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంతో మనకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అయితే అలా యాడ్స్ కనిపించకుండా ఉండాలంటే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టాలి. దీంతో గేమ్స్ ఆడేటప్పుడు యాడ్స్ కనిపించవు.
2. నిత్యం మనం అనేక ప్రదేశాలకు వెళ్తుంటాం. ఇల్లు, ఆఫీసు, ఫ్రెండ్ ఇల్లు, కాఫీ షాప్, హోటల్, బార్… ఇలా అనేక ప్రదేశాలకు వెళ్తాం. అయితే నేటి తరుణంలో మనకు అనేక చోట్ల వైఫై లభిస్తుంది. కానీ వాటి పాస్‌వర్డ్‌లను మనం గుర్తుంచుకోవడం కష్టం. అయితే అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే Wifi Password Show అనే ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వేసుకోండి. దీంతో మీరు మాటిమాటికీ కనెక్ట్ అయ్యే వైఫైల పాస్వర్డ్లు గుర్తుంచుకోవాల్సిన పని ఉండదు. అవే ఆయా కనెక్షన్ల వద్ద కనిపిస్తాయి.
3. ఇప్పుడు మేం చెప్పబోయే టిప్ ఐఫోన్ యూజర్లకు. ఐఫోన్‌ను వాడేవారు ఒక్కోసారి తమకు వచ్చే కాల్స్‌ను లిఫ్ట్ చేయకపోతే అప్పుడు అది రింగ్ అయి మిస్డ్ కాల్ అవుతుంది. అయితే ఆ కాల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు. అందుకు ఐఫోన్లో ఆటోమేటిక్‌గా టెక్ట్స్ రిప్లైను సెట్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్ విభాగంలో ఉండే రెస్పాండ్ విత్ టెక్ట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఏదైనా మెసేజ్ క్రియేట్ చేసి పెట్టాలి. సారీ, ఐ విల్ కాల్ యు లేటర్ అనో లేదంటే ఐయామ్ ఇన్ మీటింగ్ కాల్ యు లేటర్ అనో మీకు తగినట్టుగా మెసేజ్‌ను సెట్ చేసి పెట్టుకోవాలి. దీంతో ఎప్పుడైనా మిస్డ్ కాల్స్ వస్తే వాటికి ఆటోమేటిక్ గా టెక్ట్స్ రిప్లై వెళ్తుంది. అది కూడా మీరు సెట్ చేసుకున్న ప్రకారం.
4. ఈ టిప్ ఆండ్రాయిడ్ యూజర్లకు. ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్న యూజర్లు తమ ఫోన్‌ను ఇతరులకు ఇచ్చే సందర్భంలో అందులో ఉండే సెట్టింగ్స్ ఆప్షన్‌లోని ప్రొఫైల్స్‌లో గెస్ట్ మోడ్‌ను ఆన్ చేసి, లాక్ పెట్టుకుని ఇతరులకు ఇవ్వాలి. దీంతో వారు మీ ఫోన్‌ను పూర్తిగా ఆపరేట్ చేయలేరు. అలా మీ డేటా సురక్షితంగా ఉంటుంది.
5. ఐఫోన్‌ను వాడుతున్న యూజర్లు తమ ఫోన్ నంబర్ అవతలి వారికి తెలియకూడదు అనుకుంటే కాల్ డయల్ చేసేటప్పుడు ఫోన్ నంబర్‌కు ముందుగా *#31# కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు, యూజర్ ఫోన్ నంబర్ అవతలి వ్యక్తులకు కనిపించదు. అయితే ఏదైనా నిర్దిష్టమైన వ్యక్తులకు మాత్రమే మీ నంబర్ కనిపించకూడదు అనుకుంటే అప్పుడు డయల్ చేసేటప్పుడు ఫోన్ నంబర్‌కు ముందు #31# కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు. వారికి మాత్రమే మీ నంబర్ కనిపించదు.
6. ఐఫోన్‌ను వాడుతున్న యూజర్లు నిర్దిష్టమైన సమయానికి తాము వింటున్న మ్యూజిక్ ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవచ్చు. అందుకు గాను వారు టైమర్ విభాగంలోకి వెళ్లి మ్యూజిక్ లెంగ్త్‌ను సెట్ చేయాలి. దీంతో ఆ టైం లెంగ్త్ ముగిసే సరికి మ్యూజిక్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
7. ఐఫోన్ యూజర్లు కెమెరాతో వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఫొటోలు తీసుకోవచ్చు. అందుకు వారు ఏం చేయాలంటే వీడియో షూట్ అవుతున్న సమయంలో తెరపై కనిపించే షటర్ బటన్‌ను టచ్ చేస్తే చాలు, అప్పుడు ఫొటో స్నాప్ అవుతుంది.
8. నేటి తరుణంలో వస్తున్న అనేక ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ బీమ్ అనే యాప్ లభిస్తుంది. ఈ యాప్ ఉన్న రెండు ఫోన్లను పక్క పక్కనే పెట్టి ఈ యాప్‌ను ఆన్ చేస్తే చాలు, వాటిల్లో ఉండే కంటెంట్‌ను సులభంగా షేర్ చేసుకోవచ్చు.
9. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌కు మీ కంప్యూటర్ కు ఉన్న యూఎస్బీ కీ బోర్డు లేదా మౌస్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే యూఎస్బీ ఓటీజీ కేబుల్ ఉండాలి. దాన్ని ఒక వైపు ఫోన్‌కు కనెక్ట్ చేస్తే మరొక వైపు కీ బోర్డు లేదా మౌస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో అలా కనెక్ట్ చేశాక కీబోర్డు, మౌస్‌ను మీరు మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వాడుకోవచ్చు. దీంతో టైపింగ్, క్లికింగ్ వంటి పనులు సులభంగా అవుతాయి.
10. ఆండ్రాయిడ్ ఫోన్లను వాడే వారికి ఈ యాప్ పనికొస్తుంది. దీని పేరు Screen Lock — Time Password. ఈ యాప్‌ను ఫోన్లో వేసుకుంటే చాలు, ఫోన్లో ఉన్న టైంనే పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీ ఫోన్లో టైం 12.03 అవుతుందనుకుందాం. అప్పుడు 1203 నంబర్లను పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే టైం మారితే దాన్ని బట్టి నంబర్లను ఎంటర్ చేయాలి. ఇలా ఎప్పటికప్పుడు టైం మారుతుంది కనుక పాస్వర్డ్లు కూడా మారుతాయి. దీంతో ఇతరులకు మీ పాస్వర్డ్ అంత సులభంగా తెలియదు.