చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. నేటి తరుణంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు సోషల్ మీడియాలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ, సందేశాలను పంపుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సోషల్ మీడియా వేదికగా కాలం గడుపుతున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ఫోన్లలో బ్యాటరీ అయిపోతేనో..? సోషల్ యాప్స్‌ను ఎలా వాడుతాం ? వాడలేం కదా. కానీ ఆ సోషల్ యాప్‌ను వాడవచ్చు. నిజానికి ఆ యాప్ ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఎంతలా అంటే.. ఫోన్లో కేవలం 5 శాతం బ్యాటరీ ఉంటేనే ఆ మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది. మరి ఆ యాప్ ఏమిటో తెలుసా..?
ఆ యాప్ పేరు డై విత్ మి (Die With Me). పేరుకు తగినట్టుగానే ఈ యాప్ ఫోన్లో కేవలం 5 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఆ సమయంలోనే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడే దీన్ని వాడుకోగలం. అయితే ఈ యాప్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. మన ఫ్రెండ్స్, ఇతరులతో చేసే చాటింగ్‌తోపాటు మనకు తెలియని వారితో కూడా చాటింగ్ చేయవచ్చు. అందుకు ప్రత్యేక చాట్ రూమ్స్ ఉంటాయి. ఒకప్పుడు యాహూ మెసెంజర్లో చాట్ రూమ్స్ ఉండేవి కదా. అలాగే ఇందులోనూ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఫోన్లో కేవలం 5 శాతం బ్యాటరీ పవర్ మాత్రమే ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అందులో చాటింగ్ చేయవచ్చు. అలా ఫోన్ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు ఈ యాప్‌ను వాడవచ్చు.
ఈ డై విత్ మి యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తోంది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలా మందికి ఫోన్‌ను వాడేటప్పుడు బ్యాటరీ అయిపోతుందనే భయం ఉంటుందని, అయితే అందుకు భిన్నంగా బ్యాటరీ అయిపోయే సమయంలోనే యాప్‌ను వాడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తోనే ఈ యాప్‌ను డెవలప్ చేసినట్టు దీని డెవలపర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా నిజంగా ఈ యాప్ భలే వింతగా ఉంది కదా..!