చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా ఎలా బయటపడవచ్చో తెలుసుకోండి..!

ఒత్తిడి, ఆందోళన, పౌష్టికాహార లోపం, దీర్ఘకాలిక వ్యాధులు… ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. ఇది అంత ప్రమాదకరమేమీ కాకపోయినా, కొన్ని సందర్భాల్లో దీని వల్ల ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు షాంపూలు, కండిషనర్లు వంటి వాటిని మనం ఎక్కువగా వాడుతుంటాం. అయినా అవి కేవలం కొంత వరకు మాత్రమే ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలో పలు సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఆ పదార్థాలేమిటో, వాటి ద్వారా సమస్యను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

నిమ్మరసం, కొబ్బరినూనె…

lemon

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న చుండ్రు సమస్యను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని వేడిచేయాలి. దానికి అంతే పరిమాణంలో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. జుట్టు అంతటా విస్తరించేలా, కుదుళ్లకు తగిలేలా సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉండి అనంతరం తలస్నానం చేస్తే సరిపోతుంది. తరచూ ఈ పద్ధతిని పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తులవచ్చు.

బేకింగ్ సోడా…

baking soda

ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని తడిగా ఉన్న జుట్టు, కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. ఒక రెండు నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీన్ని కొన్ని వారాల పాటు పాటిస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

పెరుగు…

curd
కొద్దిగా పెరుగును తీసుకుని దాన్ని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ పెరుగు పులుస్తుంది. దీన్ని జుట్టుకు బాగా పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. అనంతరం కడిగేయాలి. పెరుగులో ఉండే యాసిడ్ గుణాలు చుండ్రుపై పోరాడతాయి. దీంతో ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

మెంతులు…

fenugreek
వెంట్రుకల సంరక్షణ కోసం ఉపయోగపడే మెంతులు చుండ్రును కూడా తగ్గిస్తాయి. కొన్ని మెంతులను తీసుకుని వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ మెంతులను పేస్ట్‌లా మిక్సీ పట్టి అనంతరం ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా జుట్టుకు బాగా పట్టించాలి. కొంత సేపు ఆగాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

గోరింటాకు…

henna
జుట్టుకు మంచి పోషణను అందించే కండిషనర్‌గా గోరింటాకును మన దగ్గర ఎక్కువగా వాడుతున్నారు. కొద్దిగా గోరింటాకు పొడి, టీ లిక్కర్, పెరుగులను ఒక చిన్న పాత్రలో తీసుకుని ఆ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దాన్ని 8 నుంచి 10 గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టుకు పట్టించి, 1 గంట సేపు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్…

apple cider vinegar
చుండ్రును తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. నాలుగు వంతుల నీటిలో ఒక వంతు యాపిల్ సైడర్ వెనిగర్‌ను బాగా కలిపి పక్కకు పెట్టాలి. కొంత సేపు ఆగాక తలను కడుక్కుని ఆ తడి జుట్టుకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. 15 నిమిషాల పాటు ఈ మిశ్రమంతో సున్నితంగా మసాజ్ చేయాలి. అనంతరం నీటితో కడిగేయాలి.

టీ ట్రీ ఆయిల్…

tea-tree-oil
కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని జుట్టుకు పట్టించాలి. 5 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. అనంతరం నీటితో కడగాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గడమే కాదు, జుట్టు చక్కని సువాసన కూడా వస్తుంది.

ముల్తానీ మిట్టి ప్యాక్…

multani mitti
కొద్దిగా ముల్తానీ మిట్టీని తీసుకుని దానికి నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు కారణంగా వచ్చే దురద సమస్య తగ్గుతుంది. జుట్టుకు పోషణ చేకూరుతుంది.

వేపాకు రసం…

neem
వేపాకులో బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వెంట్రుకలను సంరక్షించడంలో బాగా పనిచేస్తాయి. కొద్దిగా వేపాకు తీసుకుని దాన్ని మెత్తగా నూరి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది చుండ్రు సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఆరెంజ్ పీల్ ప్యాక్…

orange peel
నారింజ పండు తొక్క, కొద్దిగా నిమ్మరసం తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట ఆగాక షాంపూతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఆరెంజ్‌లో ఉండే సిట్రిక్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. జుట్టుకు పోషణనిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top