అక్కడంతే… నీటిని వృథా చేస్తే రూ.2వేల ఫైన్ కట్టాల్సిందే..!

అంతేమరి! ఏ విషయమైనా మనదాకా వస్తేగానీ తెలియదన్నట్టు, ఒకప్పుడు నీటిని మనం బాగా వృథా చేశాం. భూగర్భ జల వనరులు అంతరించిపోయేందుకు శాయశక్తులా కృషి చేశాం. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అవును, దేశంలో ఏటా నీటి కోసం ఏర్పడుతున్న ఇబ్బందుల గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సాధారణ అవసరాల మాట దేవుడెరుగు, కనీసం తాగునీటికి కూడా గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ క్రమంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వాలు కూడా తంటాలు పడుతున్నాయి. అయితే చండీగఢ్‌లో మాత్రం అక్కడి మున్సిపల్ అధికారులు నీటిని ఆదా చేయడం విషయంలో ఒకడుగు ముందుకు వేశారనే చెప్పవచ్చు.

water-chandigarh

హర్యానాలో ఏటా 20 మిలియన్ గ్యాలన్ల నీరు లీకేజీల కారణంగా వృథాగా పోతుందట. ఇది ఆ రాష్ట్ర అధికారిక లెక్కల ప్రకారం తెలిసింది. ఈ వృథాగా పోయే నీటితో దాదాపు 48వేల ఇళ్లకు నీటి అవసరం కూడా తీరుతుందట. దీంతో ఎంతో విలువైన నీటిని అరికట్టేందుకు అక్కడి అధికారులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ నెల 15 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఇంటిలో ఉదయం 5.30 నుంచి 9 గంటల మధ్య ఎవరూ కార్లను కడగకూడదు. మొక్కలకు నీటిని పోయకూడదు. అంతేకాదు నీటిని లీకేజీల రూపంలో వృథా చేయకూడదు. ఒక వేళ ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారికి రూ.2వేల ఫైన్ పడుతుంది. అంతేకాదు ఇలా మాటి మాటికీ ఫైన్ పడితే సదరు ఇండ్లకు నల్లా కనెక్షన్‌ను తీసేస్తారట.

చండీగఢ్ మున్సిపల్ అధికారులు ఆ నగరంలో ఈ కార్యక్రమాన్ని గతేడాది విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కార్యక్రమం ఈ వేసవి సందర్భంగా ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది ఈ నిబంధనలను కొద్దిగా సడలించారట. అదేమిటంటే కార్లను వాష్ చేసే వారు ఉదయం 5.30 నుంచి 9 గంటల మధ్యలో పైప్‌కు బదులుగా బకెట్‌ను వాడుకోవచ్చు.

చండీగఢ్‌లో అమలతువున్న ఈ కార్యక్రమానికి నిజంగా మనం మద్దతు తెలపాల్సిందే. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ర్టాల్లోనూ ఆచరించేలా కేంద్రం ఆదేశాలను జారీ చేయాలి. అప్పుడు కానీ నీటి సమస్య కొంత వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top