యువతీ యువకులు ప్రేమించుకోవడం.. పెద్దలకు అది తెలియడం.. వారు తమ పిల్లల ప్రేమను ఒప్పుకోకపోవడం.. దీంతో యువతీ యువకులు తమ పెద్దలను కాదని ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ఇదంతా మామూలే. మనం రోజూ చూస్తున్నదే. కానీ కొందరు మాత్రం అలా కాదు. పెద్దలు కాదన్నారని తమకు ఇక దిక్కు లేదని చెప్పి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండైన నూరేళ్ల జీవితానికి మధ్యలోనే ఫుల్స్టాప్ పెడుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట కూడా ఇలాగే చేసింది. పెద్దలు తమ ప్రేమను కాదన్నారని వారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్కి చెందిన చిరబోయిన గణేశ్(22), అదేగ్రామానికి చెందిన పూజిత(16)లు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పూజిత 10వ తరగతి చదువుతుండగా, గణేశ్ ఇంటర్ పూర్తిచేసి లారీ డ్రైవర్ అయిన తండ్రి ఐలయ్యకి సహాయంగా ఉంటున్నాడు. అయితే గతేడాది దసరా ముందు వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లోనూ తెలిసింది. అయితే వారి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాలు తమ పిల్లలను మందలించాయి. మరోసారి కలవకూడదని కుటుంబ సభ్యులు వారికి చెప్పారు. అలా కొంత కాలం సాగింది.
ఈ నెల 9వ తేదీన శుక్రవారం స్కూలుకు వెళ్తానని పూజిత, లారీ వద్దకు వెళ్తానని గణేశ్ బయటకు వెళ్లారు. పూజిత స్కూల్‌కు వెళ్లలేదని సాయంత్రం తెలియడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా ఆచూ కీ తెలియకపోవడంతో కూతురును కిడ్నాప్ చేశారని తండ్రి బొంత శంకరయ్య అదే రోజు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ జంట కోసం వెదకగా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని సాయిబాబాగుడి సమీపంలో గణేష్, పూజితలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్లగానే వారి రాకను గమనించి గణేష్, పూజితలు అక్కడే బైక్‌తోపాటు బ్యాగును వదిలివెళ్లారు. ఆ రోజు రాత్రంతా వెతికినా దొరకలేదు. దీంతో తమకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న గణేశ్, పూజితలు రామన్నపేట శివారులోని జేపీగార్డెన్స్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్ మీద శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ విషయం గమనించిన అమరావతి ఎక్స్‌ప్రెస్ గార్డ్ స్థానిక స్టేషన్‌మాస్టర్‌కు సమాచారమందించారు. దీంతో స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఆ జంట అలా చేసి ఉండాల్సింది కాదు కదా..!