పవన్‌ కల్యాణ్‌ కొత్తగా న్యూస్‌ చానల్‌ పెడుతున్నారట ? దాని పేరేంటో తెలుసా..?

ప్రపంచంలో ఏ దేశంలో అయినా కావచ్చు.. ఏ రాజకీయ పార్టీ అయినా అయి ఉండవచ్చు.. ఏ పార్టీకైనా అనుకూల, ప్రతికూల మీడియా చానల్స్‌ ఉంటాయి. రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే న్యూస్‌ చానల్స్‌ ఉండడం సహజమే. ఇక మన దేశానికి వస్తే ఆ ప్రభావం కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. ఫలానా చానల్‌ వారు ఫలానా పార్టీకో లేదంటే ఫలానా నాయకుడికో పూర్తిగా అనుకూలంగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇది బహిరంగ రహస్యమే. కొత్తేమీ కాదు. అయితే కొందరు నాయకులకు లేదా పార్టీలకు మాత్రం ఎలాంటి అనుకూల మీడియా ఉండదు. దీంతో వారు కొన్ని సందర్భాల్లో కొత్త చానల్‌ లేదా పత్రిక పెట్టాలనుకుంటారు. అయితే ఇప్పుడదే కోవలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పవన్‌ తనకంటూ సొంతంగా ఓ న్యూస్‌ చానల్‌ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని.. అందుకనే తన నేతృత్వంలో ఓ చానల్‌ పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

పవన్‌ కల్యాణ్‌ పై తాజాగా శ్రీరెడ్డి చేసిన దూషణల నేపథ్యంలో ఆయన తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యారని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలు టీవీ చానల్స్‌ కలిసి మూకుమ్మడిగా ఆమె చేత ఇలా చేయించారని, తనను టార్గెట్‌గా చేసుకుని ఓ పార్టీకి చెందిన వారు ఇలాంటి నీచపు పని చేయించారని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు న్యూస్‌ చానల్స్‌ అనుకూలంగా లేవని భావిస్తున్న ఆయన సొంతంగా ఓ న్యూస్‌ చానల్‌ పెడితే బాగుంటుందని అనుకుంటున్నారట. అందుకనే కొత్తగా జే టీవీ పేరిట ఓ న్యూస్‌ చానల్‌ను త్వరలో పవన్‌ ప్రారంభించవచ్చని తెలిసింది.

పవన్‌ కల్యాణ్‌ జేటీవీ పేరిట కొత్తగా న్యూస్‌ చానల్‌ ప్రారంభిస్తారో లేదో తెలియదు కానీ.. అప్పుడే సోషల్‌ మీడియాలో ఈ విషయం కాస్తా వైరల్‌ అయింది. కొందరు జేటీవీ లోగో ఇదే అంటూ పలు డిజైన్లను పెడుతున్నారు. పిడికిలి ఆకారంలో ఉండే ఆంగ్ల జె అక్షరానికి ఎరుపు రంగు వేసి, దాని పక్కనే టీవీ అని పెట్టి, వెనుక భాగంలో బూడిద రంగులో జనాలను పెట్టి, పైన జనం కోసం, కింద మీ కోసం.. మీ తోడుగా అనే క్యాప్షన్లతో కొందరు జేటీవీ లోగో ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఆగిపోయి ఉన్న ఓ న్యూస్‌ చానల్‌ను తీసుకుని దాన్ని బాగు చేసి, కొత్తగా పరికరాలను కొనుగోలు చేసి, రిపోర్టర్లను తీసుకుని జేటీవీని ప్రారంభిస్తారని కూడా టాక్‌ నడుస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ నిజానికి గతంలోనే.. అంటే.. జనసేన వచ్చిన కొత్తలోనే పార్టీ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, తనకు అనుకూలంగా వార్తలను ప్రసారం చేసేందుకు ఓ న్యూస్‌ చానల్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించినట్టు తెలిసింది. కానీ అప్పట్లో ఆయనకు ఉన్న పలు అనుకోని ఇబ్బందుల కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారట. కానీ తాజాగా జరుగుతున్న పలు పరిణామాలు ఆయన్ను కలిచి వేశాయట. కొన్ని మీడియా చానల్స్‌ పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న భావనలో ఉన్న పవన్‌ తనకంటూ సొంతంగా ఓ న్యూస్‌ చానల్‌ ఉంటే బాగుంటుందని ఆలోచించారట. దీంతో కొత్తగా త్వరలో జేటీవీ పేరిట ఓ న్యూస్‌ చానల్‌ ప్రారంభిస్తారరని సోషల్‌ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది.

గతంలో పవన్‌ కల్యాణ్‌ తమన్నాతో కలిసి ఓ సినిమా చేశారు గుర్తుంది కదా. అదేనండీ.. కెమెరామెన్‌ గంగతో రాంబాబు.. అందులో అవినీతి రాజకీయ నాయకులు, అక్రమాలు చేసే వారి పీచమణిచే నికార్సయిన జర్నలిస్టు పాత్రలో పవన్‌ మనకు కనిపిస్తారు. మరి ఇప్పుడు ఒక వేళ ఆయన టీవీ చానల్‌ పెడితే నిజంగా అలాగే వార్తలు ప్రసారం చేస్తారా ? అవినీతికి పాల్పడేవారి భరతం పడతారా ? సినిమాలోలాగే దూకుడుగా ఉంటారా ? నికార్సయిన జర్నలిస్టుగా నిజాలను నిగ్గు తేలుస్తారా ? అంటే.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి మరి. ఏది ఏమైనా.. పవన్‌ టీవీ చానల్‌ పెట్టే అవకాశం ఉందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. మరది నిజం అవుతుందో, కాదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top