ఉదయ్ కిరణ్, రంగనాథ్ లాగా నేనూ ఆత్మహత్య చేసుకుంటానన్న నటి.!?

ఒకప్పుడు…చేతి నిండా సినిమాలు… సినిమా సినిమాకు అవార్డులు…ఎంతో అనుభవం… మరెంతో ఓపిక…ఇప్పుడు…ఇంటినిండా పేదరికం… చేతిలో సినిమాలు లేవు… ఓపిక కూడా లేదు..పావలా శ్యామలగా అందరికీ తెలిసిన ఆమె ఇప్పుడు అదే పావలా కోసం ఇబ్బందిపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆదుకునే చెయ్యి కోసం ఆబగా ఎదురుచూస్తోంది. తనను తాను బతికున్న శవంతో పోల్చుకుంటూ, చస్తూ బతకలేక, బతుకుతూ రోజూ చస్తున్న అంటూ తన బాధను జిందగీతో పంచుకున్న పావలా శ్యామలా మనోగతం ఇది…34 సంవత్సరాల నాటకాల్లో అపార అనుభవం… 10 ఏళ్లు బుల్లితెర, వెండితెర ఆర్టిస్టుగా అనుభవం. 250 సార్లు ఉత్తమ నటి అవార్డు.. 40 నాటకాలకు ఉత్తమ దర్శకత్వం అవార్డు… 100 సినిమాల్లో బలమైన క్యారెక్టర్లు ఇవన్నీ ఆమె రికార్డులు. కళనే జీవితంగా చేసుకుని బతికిన పావలా శ్యామలకు ఇప్పుడు ఇంటి కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక పూట తింటే ఇంకోపూట పస్తులుండాల్సిన పరిస్థితి. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు. కష్టాల్లో ఉన్న మనిషిని సాటి మనిషిగా ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆకలితో అవకాశాల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లు తెప్పించే పావలా శ్యామల అంతరంగం ఆమె మాటల్లోనే..

maxresdefault (1)

చెప్పుకుంటే పరువుపోతోంది.. చెప్పుకోకపోతే ప్రాణమే పోయేటట్టుంది. ఇన్ని సినిమాల్లో ఆర్టిస్టుగా చేసి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణాలు వెతుక్కునే సమయం కూడా లేదు నాకు. ఒకవేళ వెతుక్కునే సమయం ఉన్నా.. వెతికేంత ఓపిక, సత్తువ నా శరీరంలో లేవు. పెదాల మీద తేనె రాసుకుని బయటికి తీపిగా మాట్లాడుతున్నారు. అనారోగ్యంతో మంచాన పడితే ఎలా ఉంది? ఏం జరిగింది? అని అడిగే మనుషులు కూడా ఎవరూ లేరు నాకు. నా దగ్గర డబ్బులు లేవనే కదా! ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే నేను రాజకీయ నాయకుణ్ణో, సినిమా సెలబ్రిటీనో పెళ్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! సభ్య సమాజంలో ఒక స్త్రీగా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదు. మూడేళ్ల క్రితం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు మూడు లక్షలు ఖర్చవుతాయన్నారు. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దిక్కుతోచడం లేదు. అంతా అయోమంగా అనిపించింది. ఆ విషయం తెలుసుకున్న పవన్ కల్యాన్ లక్ష రూపాయలు, అమెరికా నుంచి అభిమానులు లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. ఇంకా లక్ష రూపాయలు అప్పు చేశాను. ఆ లక్ష రూపాయలకు కట్టాల్సిన వడ్డీ ఇప్పుడు అసలుతో కలిసి రెండు లక్షలు అయింది. రెండు నెలలు ఇంటి అద్దె కట్టాలి. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఇరుకు అద్దెగదుల్లో అవార్డులు పెట్టుకునే చోటు లేక నా ఆస్తి, నా గౌరవం అనుకునే అవార్డులన్నీ పాత ఇనుపసామానోళ్లకు అమ్మేశాను…

shhamalaT

ఆయనలా ఆత్మహత్య చేసుకుంటా..
ఆత్మహత్య చేసుకుందామంటే చేతులు రావడం లేదు. మనిషిగా నేనేప్పుడో చనిపోయాను. ప్రస్తుతం నేను బతికున్న శవాన్ని. నన్ను నమ్ముకుని నా కూతురు బతుకుతున్నది. కేవలం ఆమె కోసమే బతుకుతున్నా. ఆమె ఆరోగ్యం బాగాలేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు మూడో అంతస్థు నుంచి కిందపడింది. తలలో రక్తం గడ్డ కట్టడంతో మంచం పట్టింది. వైద్యం కోసం తిరగని ఆసుపత్రి లేదు… కలవని డాక్టర్ లేడు. అప్పు సప్పు చేసి అమెరికాలో ఖరీదైన వైద్యం చేయించినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. జాలిపడితే ఆర్యోగం బాగవ్వదు కదా. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటున్నాం. మందులు తెచ్చుకుందామన్నా రూపాయి లేదు. ఎవరైనా తెలిసిన వాళ్లు ఐదో పదో ఇస్తే ఆ పూటకు కడుపు నిండుతున్నది. కేబుల్ బిల్ కట్టలేదని స్టార్ కనెక్షన్ కూడా కట్ చేశారు. రంగనాథ్ గారు డబ్బులున్నా ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. నేను బతుకుదామంటే డబ్బులు లేవు. ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బే ముఖ్యం. ఆ డబ్బు నా దగ్గర లేదు. అందుకే నాక్కూడా రంగనాథ్ గారిలా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నది.

ఇదే నా చివరి ఇంటర్వ్యూ!
సినిమా కుటుంబంలో ఎంతో ప్రేమాభిమానాలుంటాయి. దేనికీ కొదవుండదు. కానీ ఇప్పుడు ఎవరూ లేరు. డబ్బు లేని మనిషి కోసం ఎవరూ రారు. కష్టాల్లో ఉంటే అసలు కన్నెత్తి కూడా చూడరు. కళ కోసం, కళను ప్రేమించి నాటకరంగంలో అడుగుపెట్టినందుకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నాటకాలేస్తావా? అంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఒక నాటకం వేస్తే వచ్చే వంద, యాభై రూపాయలతో సర్దుకునేదాన్ని. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతంతో నాకు తొలి అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశాలే కాదు… అన్నం కూడా లేక తల్లడిల్లుతున్నాం. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలో వెళ్లడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. ఆ మధ్య ఏదో అభిమాన సంఘం వారు సన్మానం చేస్తామని వచ్చారు. సన్మానం అవసరమా? అని సున్నితంగా తిరస్కరించా. వారి అభిమానాన్ని కాదనాలని కాదు… అక్కడి వరకు వెళ్లడానికి టాక్సీ డబ్బులు లేక. పేరు ప్రతిష్టలు, గౌరవం సంపాదించాను కానీ డబ్బు సంపాదించుకోలేకపోయాను. నాకు వచ్చిన కష్టాలు.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆత్మహత్మ చేసుకుంటే పిరికిది అంటారు. నలుగురు నాలుగు విధాల మాట్లాడుకుంటారు. అందుకే బతుకుతున్నా బాబూ… చచ్చేవరకూ బతకాలి. చచ్చినా బతికుండేలా బతకాలి అనే మాట గుర్తొస్తుంది చనిపోదామనుకున్నప్పుడల్లా అంటూ కన్నీరు పెట్టుకుంది. మీడియాతో తన బాధను పంచుకోవడానికి ఒప్పుకోవడం లేదు శ్యామల. వద్దండీ… నా గురించి రాసినా ఎవరూ స్పందించరు. ఎవరూ పట్టించుకోరు అంటూ సున్నితంగా తిరస్కరించింది. ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి అని జిందగీ అడిగితే… ఇస్తానేమో కానీ… ఇదే నా చివరి ఇంటర్వ్యూ కావొచ్చు.

బతికుండగా అయ్యో అనరు..
సినిమావాళ్లు మరణ వార్త వినగానే అయ్యో పాపం అంటున్నారు. బతికున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఉదయ్‌కిరణ్, రంగనాథ్‌లా తనకు కూడా ఆత్మహత్మ చేసుకోవాలని ఉంది అంటూ కంటతడి పెట్టుకుంది శ్యామల. మా అసోసియేషన్ సభ్యురాలు కాకపోవడం వల్లే ఆదుకోవడం లేదా? మా సభ్యురాలు కాకపోవచ్చు. మానవత్వం ఉన్న మనిషి కదా! ఆదుకోవడానికి ఏం అవుతుంది? పావలా శ్యామల ఇప్పుడు పావలా కూడా లేని శ్యామల అయింది అంటోంది శ్యామలా. వరదల్లో సర్వం కోల్పోయినవారికి, అగ్ని ప్రమాదంలో ఉన్నదంతా కాలిపోయిన వారికి మనం సాయం చేస్తాం. కాలం అనే కఠిన కోరలకు బలై శ్యామల కూడా ఇప్పుడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

చివరి కోరిక
నా చివరి కోరిక ఏదైనా ఉందంటే అది కేసీఆర్‌ను కలవడమే. పెన్షన్ కూడా వస్తలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేంత ఓపిక నాకు లేదు. వెళ్దామన్నా ఆటోఛార్జీలు లేవు. కేసీఆర్ నాలాంటి వాళ్లకు తప్పక సహాయం చేస్తారనే  నమ్మకం ఉంది. ఒక్కసారి కలవాలని ఉంది.

Source: Namaste Telangana Paper:

Comments

comments

Share this post

scroll to top