ప‌తంగుల్లో చైనా మాంజా వాడితే అంతే..! 5 ఏళ్ల జైలు శిక్ష, జ‌రిమానా..!

సంక్రాతి పండుగ వ‌స్తుందంటే చాలు మ‌న దేశంలో ఎక్క‌డ చూసినా సంద‌డి మొల‌వుతుంది. అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌జ‌ల్లోనూ ఆనందాలు నెల‌కొంటాయి. ఇక రైతుల‌కైతే పంట చేతికి అందుతుంది కాబ‌ట్టి వారు ఆ స‌మ‌యంలో ఎంత సంతోషంగా ఉంటారో మాటల్లో చెప్పలేం. అయితే ఎక్క‌డ చూసినా సంక్రాంతి పండ‌క్కి ఉండే సంద‌డి ఒకెత్తు. ప‌తంగుల హ‌ల్‌చ‌ల్ మ‌రో ఎత్తు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రూ ప‌తంగుల‌ను ఎగుర వేస్తూ హ్యాపీగా గ‌డుపుతారు. అయితే పతంగుల‌ను ఎగుర వేయ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ వాటి వల్ల జ‌రుగుతున్న న‌ష్టాల‌ను మ‌నం గ‌మ‌నించ‌డం లేదు. ప్ర‌ధానంగా ప‌తంగుల్లో వాడే మాంజా దారం. అదీ చైనాలో తయారైన మాంజాను వాడుతుండడంతో అటు ప‌ర్యావ‌ర‌ణానికే కాదు, చిన్న పిల్ల‌ల‌కు, ప‌క్షుల‌కు కూడా తీవ్ర‌మైన గాయాల‌వుతున్నాయి.

నైలాన్ దారానికి గాజు పొడి కోటింగ్ వేసి చైనా మాంజాను త‌యారు చేస్తున్నారు. దీంతో ఆ మాంజాను వాడిన‌ప్పుడు చిన్న‌పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌లకూ గాయాల‌వుతున్నాయి. అలా మాంజాల‌తో ప‌తంగును ఎగుర‌వేసిన‌ప్పుడు ఆ దారాల‌కు చిక్కుకుని ప‌క్షులు మృతి చెందుతున్నాయి. పర్యావ‌ర‌ణానికి కూడా ఈ మాంజాల‌తో ముప్పు ఉంద‌ని ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో చైనా మాంజాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం కూడా విధించింది. స‌హ‌జ సిద్ద‌మైన దారంతో త‌యారు చేసిన మాంజాల‌నే వాడాల‌ని సూచిస్తోంది.

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించినా శిక్షార్హులని ప్ర‌భుత్వం తెలియ‌జేస్తోంది. ఈ చట్టంలోని సెక్షన్ H- 5, 15 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయలు ఆపైన జరిమానా విధిస్తారు. ప్రజల్లో చైనా మాంజా వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వానికి చెందిన ప‌లు శాఖ‌ల అధికారులు కూడా స‌మాయాత్తం అవుతున్నారు. ఎవరైనా చైనా మాంజా వినియోగించినట్లు, అమ్ముతున్నట్లు తెలిస్తే అటవీశాఖ టోల్‌ ఫ్రీ నెం. 18004255364కు సమాచారం అందించ‌వ‌చ్చు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. సంప్రదాయబద్ధంగా తయారు చేసే కాటన్‌ మాంజాను వినియోగిస్తే ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు..!

Comments

comments

Share this post

scroll to top