త‌ల్లిదండ్రులూ… పిల్ల‌లు ఫోన్ల‌లో ఏం చేస్తున్నారో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి..!

నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ పీసీల‌కు పిల్ల‌లు ఎలా అల‌వాటు ప‌డిపోయారో మ‌నంద‌రికీ తెలిసిందే. గంట‌ల త‌ర‌బ‌డి వాటితో కాల‌క్షేపం చేస్తున్నారు. గేమ్స్‌, ఇంట‌ర్నెట్, సోష‌ల్ మీడియా.. ఇలా అనేక యాప్స్‌ను వాటిలో వాడుతున్నారు. అయితే ఆయా డివైస్‌ల‌ను ఇవ్వ‌క‌పోతే వారు ఊరుకోరు. ఇస్తే.. వారి ఆరోగ్యం ఏమైపోతుందో, వారు ఆయా డివైస్‌ల‌లో ఏమేం చేస్తారో, ఏమేం చూస్తారో అనే టెన్ష‌న్‌, భ‌యం, ఆందోళ‌న కూడా త‌ల్లిదండ్రుల్లో క‌లుగుతున్నాయి. అయితే ఇప్పుడా భ‌యం అవ‌స‌రం లేదు. ఎందుకంటే పిల్ల‌లు ఫోన్ల‌లో ఏమేం చేస్తున్నారో నిరంతరం ప‌రిశీలించేందుకు, అవ‌స‌రం అయితే వారు చూసే కంటెంట్‌ను బ్లాక్ చేసేందుకు కూడా వీలుంది. అందుకు ఏం చేయాలంటే…

eKAVACH Parental Control అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పిల్ల‌లు వాడే ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలి. అంతే.. దీంతో పిల్ల‌లు వాడుతున్న ఫోన్‌పై త‌ల్లిదండ్రులు ఎల్ల‌ప్పుడూ నిఘా పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ యాప్‌లో రెండు భాగాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈ యాప్‌ను త‌మ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకునేట‌ప్పుడు parent phone అనే ఆప్ష‌న్‌ను ముందుగా చెక్ చేయాలి. అదే పిల్ల‌ల ఫోన్ల‌లో ఈ యాప్ వేస్తుంటే గ‌న‌క అందులో ముందుగా child app అనే ఆప్ష‌న్‌ను చెక్ చేయాలి. దీంతో త‌ల్లిదండ్రుల‌కు పిల్ల‌ల ఫోన్ యాక్సెస్ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో వారు ఫోన్‌లో పిల్ల‌లు చేసే ప‌నుల‌పై నిరంత‌రం నిఘా పెట్ట‌వ‌చ్చు.

ఈ యాప్‌లో ఉన్న సేఫ్ బ్రౌజింగ్‌ను ఆన్ చేస్తే పిల్ల‌లు అశ్లీల‌, అసాంఘిక‌, హింస‌తో కూడిన సైట్ల‌ను చూడ‌లేరు. ఆయా సైట్ల‌ను ఓపెన్ చేస్తే వెంట‌నే బ్లాక్ అవుతాయి. ఆ స‌మాచారం తల్లిదండ్రుల‌కు చేరుతుంది. దీంతో త‌ల్లిదండ్రులు అల‌ర్ట్ అవ‌వ‌చ్చు. అదేవిధంగా పిల్ల‌లు వాడే ఇంట‌ర్నెట్‌కు ప‌రిమితులు విధించ‌వ‌చ్చు. ఫ‌లానా టైం పాటు మాత్ర‌మే ఇంట‌ర్నెట్‌ను వాడుకునేలా రిస్ట్రిక్ష‌న్స్‌ను ఇందులో పెట్ట‌వ‌చ్చు. దీంతో టైం దాటితే పిల్లల ఫోన్‌కు ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఆఫ్ అవుతుంది. పిల్లలు ఫోన్‌లో వాడే యాప్‌ల గురించి, వారు ద‌ర్శించే సైట్లు, వెదికే స‌మాచారం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు రియ‌ల్ టైంలో త‌ల్లిదండ్రుల ఫోన్ల‌కు అల‌ర్ట్స్ వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఈ యాప్ వెర్ష‌న్ 1.0 కాగా రానున్న అప్‌డేట్ల‌లో సోషల్ మీడియా మానిట‌రింగ్‌ను అందివ్వనున్నారు. దీంతో పిల్ల‌లు వాడే సోష‌ల్ సైట్ల‌పై కూడా త‌ల్లిదండ్రులు నిఘా పెట్ట‌వ‌చ్చు. దీంతోపాటు ప్రాంతాన్ని బ‌ట్టి పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే దిశగా, సైబ‌ర్ నేరాల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు గాను ఈ యాప్‌ను మ‌రింత తీర్చిదిద్ద‌నున్నారు. ఇది ఇండియాకు చెందిన యాప్ కావ‌డం విశేషం..!

Comments

comments

Share this post

scroll to top