పక్షవాతం.. దీన్నే పరాలసిస్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరంలో ఒక పక్కన లేదా పూర్తిగా అన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. దీంతో పక్షవాతం వచ్చింది అంటాం. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి శరీరం బిగుసుకుపోతుంది. మూతి వంకర్లు తిరుగుతుంది. కాళ్లు, చేతులు మెలితిరిగి పోతుంటాయి. కొన్ని సార్లు గుండె కూడా పనిచేయదు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. దీంతో డాక్టర్లు వారికి చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తారు.
పక్షవాతం వచ్చిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలిస్తే అక్కడ వైద్యులు మొదట సిటీ స్కాన్ చేస్తారు. తరువాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. సాధారణంగా పక్షవాతం అనేది రక్త నాళాల్లో వచ్చే పూడిక వల్లే వస్తూ ఉంటుంది. ఇలా జరిగిందేమో చూస్తారు. ఇలాగే జరిగితే ఈ పూడిక కరిగిపోయేందుకు టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే ఇంజెక్షన్ చేస్తారు. దీన్ని పక్షవాతం వచ్చిన 3 గంటల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే పక్షవాతం వచ్చిన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు చేరిస్తే అక్కడ 3 గంటల లోపు ఈ ఇంజెక్షన్ చేస్తారు కనుక ప్రాణాపాయం తప్పుతుంది.
అయితే పైన చెప్పిన టీపీఏ ఇంజెక్షన్‌ను పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల తరువాత కూడా ఇవ్వవచ్చు. కానీ ఒక వేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే ఇంజెక్షన్ ఇచ్చినా మరణాన్ని మాత్రం ఆపలేరు. ప్రపంచంలో పక్షవాతం బారిన పడే ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతున్నారు. ఇలాంటి మరణాలు పక్షవాతం వచ్చిన మొదటి 48 నుంచి 72 గంటల్లో సంభవిస్తాయి. కనుక ఈ సమయం వరకు పేషెంట్‌ను ఐసీయూలో ఉంచి డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యవసర చికిత్స చేస్తారు.
ఇక పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో కొంత భాగం దెబ్బతింటుంది. కనుక ఇలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు మెదడుకు ఆక్సిజన్‌ను కూడా సరఫరా చేస్తారు. మెదడుకు రక్త సరఫరా తగ్గితే అందులోకి నీరు వచ్చి చేరి ఫలితంగా మెదడు కొంచెం పెద్దగా అవుతుంది. దీన్ని తగ్గించడానికి పైన చెప్పిన టీపీఏ ఇస్తారు. దీంతోపాటు అవసరమైతే మరిన్ని అత్యవసర చికిత్సలు చేస్తారు. పక్షవాతం లక్షణాలు కనబడిన 3 గంటలలోపు టీపీఏ ఇంజెక్షన్ వేసి చికిత్స మొదలు పెడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రోగిని బాగా ఆలస్యంగా హాస్పిటల్‌కు తీసుకెళ్తే రక్త నాళాల్లో పూడిక వచ్చిందా, రాలేదా అన్నది ఓ వైపు సిటీ స్కాన్‌లో చూస్తూనే మరో వైపు రోగిని యాంజియోగ్రామ్‌కు తీసుకువెళ్లి దానిలో తీగగొట్టం ద్వారా నేరుగా పూడిక వచ్చినచోట, రక్తం గడ్డకట్టిన ప్రాంతంలోనే మందును వదులులుతారు. దాంతో రక్తం గడ్డ చాలా వరకూ త్వరగా కరిగిపోతుంది. ఒకవేళ ఇది విఫలమైతే ఎంఈఆర్‌సీఐ లేదా పెనంబ్రా వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్తసరఫరా ఆరంభమవుతుంది. దీన్ని పక్షవాతం వచ్చిన 6-8 గంటల వరకూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సమస్య తలెత్తితే మెదడులో ఒత్తిడి పెరగకుండా చూసేందుకు, ఆ చిట్లిన రక్తనాళాన్ని మూసివేసి తిరిగి రక్తసరఫరా పునరుద్ధరించేందుకు చాలా సందర్భాల్లో అత్యవసరంగా సర్జరీ అవసరమవుతుంది. ఇవన్నీ పక్షవాతం వచ్చిన వారికి ఎమర్జెన్సీలో వైద్యులు అందించే చికిత్సల వివరాలు..!