ప‌ల్లెల్లో పంచాయ‌తీలు షురూ -స‌మ‌స్య‌లు బారెడు..ప‌రిష్కారం మూరెడు.!!

నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌లు క‌లిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నిక‌ల ఫీవ‌ర్ చుట్టేసింది. నిన్న‌టి దాకా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పాల్గొన్న జ‌నం ఇపుడు గ్రామ పంచాయ‌తీల్లో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఓ వైపు స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి. అటు అధికార యంత్రాంగం కానీ ఇటు ఎన్నికై విజ‌యోత్స‌వ స‌భ‌ల్లో మునిగి తేలుతున్న ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. దామాషా ప్రాతిప‌దిక‌న కేటాయింపులు , రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ ఇపుడు ప్ర‌ధానంగా మారింది. మా కోటా మా వాటా తేల్చండంటూ బీసీలు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఇప్ప‌టికే మెజారిటీ స్థానాలు కైవ‌సం చేసుకుని సింగిల్ మార్జిన్‌తో కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి ప‌ల్లెల్లో పాగా వేయ‌డం చాలా సుల‌భం.

 

ఈ సారి అంతా పంచాయ‌తీ మీదే దృష్టి పెట్టాయి అన్ని పార్టీలు. నిధులు నేరుగా రావ‌డం, ఊర్ల‌లో రాజ‌కీయం , అధికారం చెలాయించ‌లంటే స‌ర్పంచ్ ప‌ద‌వి కీల‌కం. ఇందు కోసం ఒక్కో ఊరులో అన్ని పార్టీల నుండి 20 నుండి 50 మందికి పైగా పోటీకి దిగుతున్నారు. ఇప్ప‌టి నుండే తాయిలాలు, దావ‌త్‌లు షురూ చేశారు. ఓ వైపు గులాబీ బాస్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ ప‌ర్య‌ట‌న‌ల్లో ఉంటే..కొడుకు అమెరికా టూర్‌లో ఉన్నారు. మ‌రో మాజీ మంత్రి హ‌రీష్ రావు మై హోం రామేశ్వ‌ర్ రావు ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన చిన్న‌జీయ‌ర్ స్వామి ప్ర‌వ‌చ‌నాలకు హాజ‌ర‌వుతున్నారు. మొత్తం మీద రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌జ‌లు త‌మ‌కు ఏమేం అందుతాయోన‌ని నిరీక్షిస్తున్నారు.

మొన్న ఓట్ల‌లో కొంత వెనకేసుకున్న నేత‌లు ఇపుడు మ‌రో సారి రాబ‌ట్టుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. కులాల వారీగా చీలిపోయిన తెలంగాణ‌లో ఇపుడు కుల సంఘాల నేత‌ల‌కు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త ల‌భిస్తోంది. ఎమ్మెల్యేల‌కు గులాబీ బాస్ టార్గెట్ పెట్టారు. ఏం చేస్తారో తెలియ‌దు..అన్నీ మ‌న‌కే రావాలంటూ చెప్ప‌డంతో దీనిపై దృష్టి పెట్టారు. తెలంగాణ‌లో మొత్తం 12 వేల 751 పంచాయ‌తీలు ఉండ‌గా నాన్ షెడ్యూల్ ఏరియా పంచాయ‌తీలు 10 వేల 293 ఉన్నాయి. ఎస్సీల‌కు 2 వేల 113, ఎస్టీల‌కు 688 , బీసీల‌కు 2 వేల 345 , రిజ‌ర్వ్ కాని పంచాయ‌తీలు 5 వేల 147 ఉన్నాయి. ఎస్టీల‌కు 6.68 శాతం, ఎస్సీల‌కు 20.53 శాతం రిజ‌ర్వేష‌న్లు ఖ‌రార‌య్యాయి. మొత్తం మీద చూస్తే మ‌హిళ‌ల ప్రాధాన్యం మ‌రింత పెరగనుంది.

వీరికి ఏకంగా 50 శాతం సీట్లు కేటాయించ‌నున్నారు. ఇవ‌న్నీ కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌నే కేటాయింపులు జ‌రప‌బోతున్నారు. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు మేర‌కే తెలంగాణ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. షెడ్యూల్ ఏరియా పంచాయ‌తీలు 1, 281 ఉండ‌గా 100 శాతం ఎస్టీలు ఉన్న పంచాయ‌తీలు 1, 117 ఉన్నాయి. త్వ‌ర‌లో గెజిట్ వెలువ‌డ‌నుంది. 3 వేల 146 గ్రామాల్లో ఎస్టీలే స‌ర్పంచ్‌లుగా ఎన్నిక కాబోతున్నారు. దీంతో వీరి ప్రాధాన్యం మ‌రింత ఉండ‌బోతోంది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్ శాఖ క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్ రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు ప్ర‌క్రియ గురించి వెల్ల‌డించారు. ఎస్టీల జ‌నాభా అధికంగా ఉండ‌డంతో వారికి కేటాయింపులు జ‌రిపారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని 10 వేల 293 పంచాయ‌తీల్లో ఎస్ సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ వ‌ర్గాల వారు పోటీ ప‌డ‌నున్నారు.

కేట‌గిరీల వారీగా చూస్తే..ఎస్టీల‌కు 688, ఎస్సీల‌కు 2 113, బీసీల‌కు 2, 345 , జ‌న‌ర‌ల్‌కు 12751 గ్రామ పంచాయ‌తీలు ద‌క్క‌నున్నాయి. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు , ఆర్డీఓలు గ్రామం యూనిట్ గా, మండ‌లం యూనిట్‌గా ప్ర‌క‌టించ‌నున్నాయి. ప్ర‌భుత్వం గెజిట్ రూపంలో వీట‌న్నింటిని పేర్కొంటూ ఎన్నిక‌ల సంఘానికి పంపిస్తుంది. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 10 లోపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌న్న తీర్పుకు లోబ‌డి ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. పార్టీల గుర్తులు లేక పోయినా ..ఎక్కువ శాతం ఈసారి గులాబీ ద‌ళాలకే పంచాయ‌తీలు ద‌క్క‌బోతున్నాయి.

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వారే ఎమ్మెల్యేలుగా గెలుపొంద‌డం మ‌రో ప్ల‌స్ పాయింట్ కానుంది. ఎవ‌రెవ‌రు పోటీ చేయాల‌న్న దానిపై టీఆర్ ఎస్ ఇప్ప‌టికే ఎంపిక జాబితా పూర్తి చేయ‌డంలో నిమ‌గ్నం కాగా..విప‌క్షాలు ఇంకా ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. ఇక ప‌ల్లెలు సైతం అధికార పార్టీకి అండ‌గా ఉంటాయా లేక విరుద్ధంగా తీర్పు ఇస్తారా అన్న‌ది వేచి చూడాలి. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 72 ఏళ్ల‌యినా, తెలంగాణ ఏర్ప‌డి 5 ఏళ్లు అవుతున్నా ఇంకా కొలువుల కోసం కొట్లాడ‌టం, ఉపాధి కోసం వ‌ల‌స పోవ‌డం మాత్రం ఆగ‌లేదు.

వ్య‌వ‌సాయం రియ‌ల్ ఎస్టేట్ దందాల చేతుల్లోకి మారిపోయింది. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌క రైతులు దీనావ‌స్థ‌లో ఉన్నారు. రైతు బంధు ద్వారా డ‌బ్బులు వ‌చ్చినా అవి ఎక్కువ శాతం తీసుకున్న రుణాల‌కే స‌రిపోవ‌డంతో ల‌బోదిబోమంటున్నారు. పారిశుధ్యం ప‌డ‌కేసింది. రోడ్లు లేవు. బ‌డుల్లో సార్లు లేరు. నిధులు లేక గ్రామ పంచాయ‌తీలు కునారిల్లి పోయాయి. నిధులు ఇస్తే మ‌ళ్లీ పుంజుకునేందుకు రెడీ అవుతున్నాయి. తాగేందుకు నీళ్లు దొర‌క‌డం లేదు కానీ మ‌ద్యం మాత్రం 24 గంట‌లు అందుబాటులో ఉంటోంది. యువ‌తీ యువ‌కులు ఈసారి ప‌ల్లెల్లో పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్త త‌రమైనా కొలువుతీరితే త‌మ ఆశ‌లు ఫ‌లిస్తాయ‌ని ప్ర‌జ‌లు వేచి చూస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top