ప్రాణాపాయ స్థితిలో ఉన్న 9 మందిని ధైర్య సాహ‌సాల‌తో ర‌క్షించారు మ‌న సైనికులు..!

మన దేశాన్ని, అందులో ఉండే ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తున్న ఓ ప‌టిష్ఠ‌మైన వ్య‌వ‌స్థ అది..! అదేనండీ ఆర్మీ..! సైనికులంటే అంతే మ‌రి..! దేశాన్ని, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం కోసం వారు ఎంత‌టి సాహ‌సం చేసేందుకైనా వెనుకాడరు. ఎంత క్లిష్ట ప‌రిస్థితులు ఉన్నా వారు ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తారు. అందుకు త‌మ ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెడ‌తారు. జమ్మూ కాశ్మీర్‌లో తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మ‌న ఆర్మీ సిబ్బంది సాహ‌సాన్ని మ‌రోసారి దేశానికి చాటి చెప్పింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితిలో చిక్కుకున్న ఓ ఆంబులెన్సును, అందులో ఉన్న పేషెంట్ల‌ను సైనికులు సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానానికి త‌ర‌లించారు.

army-rescued

అది జ‌మ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా న‌స్టాచుంగ్ పాస్‌. అక్క‌డే ఇండియ‌న్ ఆర్మీలో నార్త‌ర్న్ క‌మాండ్ విభాగానికి చెందిన సైనికులు విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆ ప్ర‌దేశం స‌ముద్ర మ‌ట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి తోడు అక్క‌డ 24 గంట‌లూ తీవ్ర‌మైన మంచు కురుస్తూ ఉంటుంది. అయితే అదే మంచులో తంగ్‌ధ‌ర్ నుంచి మ‌క్సూర్ కు వెళ్తున్న ఓ ఆంబులెన్స్ చిక్కుకుంది. అందులో స్థానిక గ్రామాలకు చెందిన 9 మంది ఉన్నారు. వారిలో ఇద్ద‌రు పేషెంట్లు. స‌ర్జ‌రీ అయి చికిత్స కోసం వెళ్తున్న ఓ 15 ఏళ్ల బాలుడు, నిండు గ‌ర్భంతో పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న 24 ఏళ్ల గ‌ర్భిణీ మ‌హిళ ఉన్నారు. ఈ క్రమంలో వారు ప్ర‌యాణిస్తున్న ఆంబులెన్స్ ఆ మంచు తుపానులో చిక్కుకుంది.

దీంతో ఆ ఆంబులెన్స్‌కు ఎటు వెళ్ల‌డానికి దారి కూడా లేక‌పోయింది. వెన‌క్కి వెళ్దామ‌న్నా, వేరే దారికి మ‌ర‌లుదామ‌నుకున్నా పెద్ద ఎత్తున మంచు పెళ్ల‌లు ప‌డుతున్నాయి. దీంతో వారు చేసేది లేక ఆ ఆంబులెన్స్‌లోనే ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. అయితే అప్పుడే నార్త‌ర్న్ క‌మాండ్ విభాగానికి చెందిన ఆర్మీ సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. 10వేల అడుగుల ఎత్తులో తీవ్ర మంచు తుపానులో ఉన్న ఆ ఆంబులెన్సుకు వారు దారి క్లియ‌ర్ చేశారు. దీంతో అందులో ఉన్న పేషెంట్లు సుర‌క్షితంగా హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు. వారికి చికిత్స జ‌రిగి ప్రాణాపాయ స్థితి త‌ప్పింది. అలా మ‌న సైనికులు 9 మంది ప్రాణాల‌ను ర‌క్షించారు. ఈ విష‌యంలో మ‌నం మ‌న సైనికుల‌కు ఏం ఇచ్చినా వారి రుణం తీర్చలేనిది..! అందుకు వారికి హ్యాట్సాఫ్ చేయాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top