పేదవాళ్ల అక్షయపాత్ర ఈ ఓపెన్ ప్రిడ్జ్…ఆకలైన వారు వచ్చి ఇందులోని ఆహారాన్ని ఫ్రీగా తినొచ్చు

ఆహారం… భగవంతుడు మనకు ప్రసాదించిన వరాల్లో ఒకటి. పెద్దలు కూడా ఆహారాన్ని వృథా చేయరాదని చెబుతారు. అయితే నేడు పట్టణాలు, నగరాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా భోజనం పెట్టడం సర్వ సాధారణమై పోయింది. ఇక వివాహాది శుభకార్యాలకు లెక్కే లేదు. ఈ క్రమంలో ఆయా ప్రదేశాల్లో ఆహారం ఎక్కువగా వృథా అవుతుంటోంది. దీంతోపాటు మన ఇండ్లలోనూ అప్పుడప్పుడు ఆహారం ఎక్కువగా మిగిలిపోతుంటుంది. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో బాధపడుతున్న అన్నార్థులకు అందించేలా ఓ యువతి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. పబ్లిక్ ఫ్రిజ్ పేరిట కేరళకు చెందిన ఆ యువతి ఆకలిగొన్న పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది.
ఆమె పేరు మీను పౌలిన్. ఈమె గతంలో బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వహించేది. అయితే ఆమె ఆ ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కేరళలోని కొచ్చిలో పాపడవడ పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అయితే ఈ వ్యాపారంలో ఆమె విజయం సాధించడంతో అక్కడే ఉన్న ఎంజీ రోడ్‌లో మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది.
public-fridge
కాగా పాపడవడ వద్ద ఉన్న మీనుకు ఒక రోజు ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే ప్రతి రోజూ తమ తమ రెస్టారెంట్లలో ఎంతో ఆహారం వృథాగా మిగిలిపోతుండడాన్ని గమనించింది. దీంతో అలా మిగిలిపోయిన ఆహారాన్ని పరిశుభ్రంగా నిల్వ చేసి పేదలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఓ ఫ్రిడ్జ్‌ను పాపడవడ రెస్టారెంట్ బయట ఉంచింది. దాంట్లో ఆ ఆహారం పెట్టేది. అయితే ఆ ఆహారాన్ని స్థానికంగా పేదలు ఎప్పుడంటే అప్పుడు తీసుకునేలా 24 గంటల పాటు నిరంతరాయంగా ఆ ఫ్రిజ్‌ను ఓపెన్‌గానే ఉంచేది.
నన్మ మరం (గివింగ్ ట్రీ) పేరిట మీను ఏర్పాటు చేసిన ఈ ఫ్రిజ్‌కు స్థానిక నివాసితుల నుంచి కూడా మద్దతు లభించింది. దీంతో వారు తమ తమ ఇండ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా ఈ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నారు. దీని వల్ల మరింత ఎక్కువ ఆహారం పేదలకు అందుతోంది. కాగా ఈ ఫ్రిజ్ నిర్వహణకయ్యే ఖర్చును పూర్తిగా మీనుయే భరిస్తుండడం విశేషం. నిజంగా పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి పబ్లిక్ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది కదా!

Comments

comments

Share this post

scroll to top