డ‌బ్బులు గుల్ల చేస్తున్న ఆన్‌లైన్ ర‌మ్మీ సైట్లు, యాప్‌లు..! పోగొట్టుకోవ‌డ‌మే గానీ, గెలుచుకున్న వారు లేరు..!

ఒక‌ప్పుడు ఇంటి ప‌రిస‌రాలు, పొరుగిళ్లు, పొలం గ‌ట్లు, చెట్ల కింద‌, చెరువుల వ‌ద్ద‌, ఇంకా ఇత‌ర ప్ర‌దేశాల్లో ఆడేవారు. అదేనండీ.. పేకాట‌. ఆ ఆట‌లో ప‌డి మునిగి తేలేవారు. ఈ క్ర‌మంలో చాలా మంది డ‌బ్బులు పోగొట్టుకునేవారు. అంతేకానీ ఎవరూ ఇప్ప‌టికీ ఆ ఆట‌లో గెలిచిన దాఖ‌లాలు, కోట్లు కాదు క‌దా క‌నీసం ల‌క్ష‌లు, వేలు సంపాదించిన ఉదంతాలు కూడా లేవు. అయితే టెక్నాల‌జీ మారింది. అర‌చేతిలో ప్రపంచాన్ని చూపే ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం చేతిలోకి వ‌చ్చేసింది. ఒకే ఒక్క ట‌చ్‌తో ప్ర‌పంచాన్ని చుట్టి రాగ‌ల స్మార్ట్‌ఫోన్లు అంద‌రి చేతుల్లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇంకేముందీ.. పేకాట రాయుళ్లు కూడా ట్రెండ్ మార్చారు. దీంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లోనే ఎంచ‌క్కా ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతున్నారు. డ‌బ్బులు గుల్ల చేసుకుంటున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో ఆన్‌లైన్ ర‌మ్మీ అని చాలా వెబ్ సైట్లు వ‌చ్చాయి క‌దా. ఆయా సైట్ల‌కు చెందిన యాప్‌లు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ల‌లో ల‌భిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడుతున్నారు. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే.. ఆన్‌లైన్‌లో ఎవ‌రితో ప‌డితే వారితో ఈ ఆట ఆడ‌వ‌చ్చు. వారు తెలియాల్సిన ప‌నిలేదు. ఇక తెలిసిన వారుంటే అంద‌రూ క‌ల‌సి ఓ గ్రూప్‌లా ఏర్ప‌డి మ‌రీ వాటిల్లో పేకాట ఆడుతున్నారు.

ఇలా ఆడ‌డం వ‌ల్ల పోలీసులు ప‌ట్టుకుంటార‌నే బెంగ ఉండ‌దు. పైగా ఆయా సైట్లు అన్నీ లీగ‌ల్ అని ప్ర‌చారం చేసుకుంటున్నాయి. దీంతో చాలా మంది పేకాట‌రాయుళ్లు ఇప్పుడు పేక‌ల‌తో ఆట ఆడ‌డం మానేసి, ఆన్‌లైన్‌లో ర‌మ్మీ ఆడుతున్నారు. రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా, 24 గంట‌లూ ఈ యాప్‌ల‌లో, సైట్ల‌లో మునిగి తేలుతూ ఆట ఆడ‌డ‌మే కాదు, వేల రూపాయ‌ల డ‌బ్బును పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడిది మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా చోట్ల‌కు పాకింది. చాలా మంది ఇలాంటి సైట్లు, యాప్‌ల బారిన ప‌డి డ‌బ్బులు పోగొట్టుకోవ‌డ‌మే కానీ, గెలుచుకున్న దాఖ‌లాలు లేవు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వాలు స్పందిస్తాయో, లేదో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top