కోట్లు దాటిన వ్యాపారం – ఆన్‌లైన్లో ఆహారం

ఎక్క‌డికైనా వెళితే ఏమేం హోట‌ళ్లు ఉన్నాయో వెదికే బాధ త‌ప్పింది జ‌నాలకు. ఆక‌లి వేస్తే చాలు..ఏమైనా ఏదైనా తినేయొచ్చు క్ష‌ణాల్లో. ఈ కామ‌ర్స్ పుణ్య‌మా అని ఆన్‌లైన్‌లో టిఫిన్లు, భోజ‌నాలు, ఇత‌ర తిను పదార్థాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ల‌భిస్తున్నాయి. బిర్యానీ అంటేనే ప్ర‌పంచంలోనే పేరొందిన హైద‌రాబాద్ ప్యార‌డైజ్ ఆదాయం నెల‌కు వంద కోట్ల‌కు పైమాటే. అటు రెస్టారెంట్ల‌తో పాటు ఆన్ లైన్ లో ఆర్డ‌ర్ చేస్తే చాలు ప్రపంచంలో ఎక్క‌డికైనా పంపించే ఏర్పాటు చేసింది యాజ‌మాన్యం. డెలివ‌రీ సిస్టం మారి పోయింది. ర‌వాణా స‌దుపాయాలు పెరిగాయి. టెక్నాల‌జీ ఆహార‌ప‌దార్థాల‌కు ఉప‌యోగ ప‌డుతోంది. ముందుగా చెప్పాల్సి వ‌స్తే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి చెప్పుకోవాలి. రోజూ ల‌క్ష‌కు పైగా భ‌క్తులు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకుంటారు. కానీ టీటీడీ ఎక్క‌డా క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా పాలు, కాఫీలు, టిఫిన్లు, రుచిక‌ర‌మైన భోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. తెలంగాణ‌లో అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కేవ‌లం 5 రూపాయ‌ల‌కే భోజ‌నాన్ని అందిస్తోంది. ఇది కూడా సేవా భావంతో చేస్తున్న‌దే కావ‌డంతో అన‌తి కాలంలోనే స‌క్సెస్ అయ్యింది. న‌గ‌రాల‌కే కాకుండా ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించింది అక్ష‌య‌పాత్ర‌.

ఐటీ ప‌రంగా హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున కంపెనీలు ఉండ‌డం ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు ప‌నిచేస్తుండ‌డంతో వీరికి వండుకుని తినేంత తీరిక దొర‌క‌డం లేదు. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటోంది. రుచిక‌ర‌మైన ..క‌స్ట‌మ‌ర్ల అభిరుచులకు అనుగుణంగా వంట‌కాల‌ను త‌యారు చేస్తున్నారు నిర్వాహ‌కులు. హైద‌రాబాద్‌లో..చుట్టు ప‌క్క‌ల‌..జాతీయ ర‌హ‌దారుల ప‌క్క‌న రెస్టారెంట్లు, హోట‌ల్స్ వెలిశాయి. అంత దూరంలో రాలేని వారిని దృష్టి లో పెట్టుకున్న ఆయా హోట‌ళ్ల నిర్వాహ‌కులు ఆన్ లైన్ సిస్టంను తీసుకు వ‌చ్చారు. ఎవ‌రికి వారే స్వంతంగా త‌మ పేరుతో యాప్ క్రియేట్ చేశారు. ఆర్డ‌ర్లు ఇస్తే చాలు క్ష‌ణాల్లో వారిచ్చిన ఆర్డ‌ర్ ప్ర‌కారం ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా సిబ్బందిని నియ‌మించుకున్నారు. వేలాది మంది దీనిపైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు. టిఫిన్లు, భోజ‌నాలు, ఇత‌ర ప‌దార్థాలు అంద‌జేస్తున్నారు. ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 15 ల‌క్ష‌ల‌కు పైగా బుకింగ్ లు ల‌భిస్తున్నాయంటే ఈ ఫుడ్స్ డిస్ట్రిబ్యూష‌న్ వ్యాపారం ఎంత‌గా విస్త‌రించిందో అర్థం చేసుకోవ‌చ్చు. వ‌చ్చే ఆర్డ‌ర్ల‌లో బిర్యానీ కోసమే ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ ఆర్డ‌ర్ల వ్యాపారం ఎక్కువ‌గా బెంగ‌ళూరులో వుంటే..ఇపుడు రెండో స్థానంలో హైద‌రాబాద్ చేరుకుంది.

ఉరుకులు ..ప‌రుగుల న‌గ‌ర జీవితంలో త‌మ‌కు న‌చ్చే ఆహారాన్ని తామే త‌యారు చేసుకునే వెస‌లుబాటు జ‌నానికి ఉండ‌డం లేదు. ఏ కొద్ది మందికో త‌ప్ప‌. రోడ్డు ప‌క్క‌న టిఫిన్, హోట‌ళ్ల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం, రాత్రి ఆల‌స్య‌మైందంటే క‌ర్రీ పాయింట్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. భార్యాభ‌ర్త‌లు ఉద్యోగులైతే వారి తిప్ప‌లు వ‌ర్ణ‌ణాతీతం. స‌రిగ్గా ఇలాంటి వారికి కోరుకున్న రుచుల‌తో పాటు ..కోరుకున్న ప్లేస్ కు స‌మ‌యానికి అందించే ఆహారం వుంటే ఎంత బావుంటుంది క‌దూ. దీనిని గుర్తించిన నిర్వాహ‌కులు ఆన్ లైన్ లో ఆహార స‌ర‌ఫ‌రా సంస్థ‌లు, యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. క్లిక్ చేస్తే చాలు ప‌ది నిమిషాల్లో బుకింగ్ చేసుకున్న చోటికి ఆహారం స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయిలో ఉన్న హోట‌ళ్ల‌న్నీ ఆన్ లైన్‌ను ఆశ్ర‌యించాయి. ల‌క్ష‌ల్లో యాప్‌లు, ఆర్డ‌ర్లు వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, పుడ్ పాండా, త‌దిత‌ర సంస్థ‌ల‌కు హైద‌రాబాద్ అందివ‌చ్చిన ఆదాయంగా మారింది.

ఉద‌యం లేచిన వెంట‌నే కావాల్సిన టిఫిన్స్ తెప్పించుకోవ‌చ్చు. ఆఫీసుల‌కు వెళ్లేవాళ్లు. అనారోగ్య స‌మ‌యంలో వంట చేసే ప‌రిస్థితులు లేన‌పుడు ఈ యాప్ సేవ‌ల‌పైనే ఆధార ప‌డుతున్నారు. పొద్దున్నే బుకింగ్ లు ఎక్కువ‌గా ఉంటున్నాయి. రుచి, సేవ‌లు, నాణ్య‌త‌పై ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం తీసుకుంటున్నాయి. అంతేకాక రేటింగ్‌లు ఇవ్వ‌మ‌ని అడుగుతున్నాయి. వాటి ఆధారంగా త‌మ ప‌నితీరును మెరుగు ప‌ర్చుకునేందుకు వీల‌వుతుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం భోజ‌నాల‌తో పాటు రాత్రి భోజ‌నాల కోసం ఆర్డ‌ర్లు అత్య‌ధికంగా ఉంటున్నాయి. రాత్రిళ్లు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డం, మిడ్ నైట్ బిర్యానీ కోసం అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల వ‌ర‌కు ఆర్డ‌ర్లు రావ‌డం దీనికున్న డిమాండ్ ను తెలియ చేస్తుంది. మొబైల్స్ ద్వారానే 90 శాతం మంది ఆర్డ‌ర్స్ ఇస్తున్నారని స‌ర్వేలో తేలింది.

బిర్యానీ, చికెన్‌ 65, కబాబ్, పలావ్ కావాల‌ని అడుగుతున్నారు. హైదరాబాదీలతో పాటు తెలుగేతర ప్రజలూ ఎక్కువగా ఈ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసేటపుడు శాకాహారానితో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్‌ ఉంటోందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. యాప్‌ ఆధారిత ఆహార సరఫరా వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైంది. ప్రతి 3 నెలలకోసారి కనీసం సగటున 15శాతం చొప్పున పెరుగుతోంది. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్‌పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్‌అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

Comments

comments

Share this post

scroll to top