మన దేశంలో నేడు రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. పంట వేద్దామంటే పెట్టుబడికి డబ్బులుండవు. బ్యాంకుల దగ్గరికి రుణం కోసం వెళ్తే అక్కడి అధికారులు వారిని పట్టించుకోరు. ఎలాగోలా బయట తెలిసిన వారి వద్ద అప్పుకు కొంత మొత్తం తీసుకువచ్చి పంట కోసం సిద్ధమవుదామంటే సరైన ఎరువులు, విత్తనాలు దొరకవు. అన్నీ కల్తీవి, నకిలీవే వారికి దొరుకుతాయి. తీరా విత్తనాలు నాటాక నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వర్షాలు సరిగ్గా పడవు. మళ్లీ అప్పో సొప్పో చేసి బోరు వేసి ఎలాగో పంటను పండిస్తే చివరాఖరికి వచ్చే సరికి ఆ పంటకు సరైన గిట్టు బాటు ధర ఉండదు. ఇలా నేడు మన దేశంలోని రైతులు వ్యవసాయంలో ఆయా సందర్భాల్లో ఎదుర్కొంటున్న కష్టాలు, పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. వర్ణనాతీతం. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రకు చెందిన ఉల్లి రైతులు కూడా అలాంటి వర్ణనాతీతమైన సమస్యలతోనే సతమతమవుతున్నారు.
ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి పంట బాగా పండింది. దీంతో రైతులు ఎంతో సంతోషించారు. ఈ సారైనా పంటను అమ్మి వచ్చిన లాభంతో తమ అప్పులు తీర్చుకుని సంతోషంగా ఉందామనుకున్నారు. దేవీదాస్ పర్భని అనే ఓ 48 ఏళ్ల రైతు కూడా ఇలాగే కలలు కన్నాడు. పంట బాగా పండడంతో ఇక తనకు అంతా సంతోషమే కలుగుతుందని భావించాడు. కానీ అంతలోనే తన సంతోషం కాస్తా ఆవిరైపోయింది. ఇప్పుడక్కడ ఉల్లికి కనీసం గిట్టుబాటు ధర కాదు కదా, అసలు రైతులు తాము పెట్టిన పెట్టుబడిని కూడా సంపాదించుకోలేనంత తక్కువకు ఉల్లి ధర పడి పోయింది. ప్రస్తుతం అక్కడ కేజీ ఉల్లిపాయలను స్థానిక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) కేవలం రూ.1.60 లకు రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది.
అంత తక్కువ ధర ఉండడంతో పైన చెప్పిన దేవీదాస్ పర్భనికి దాదాపు 1 టన్ను ఉల్లిపాయలు అమ్మగా కేవలం 1 రూపాయి మాత్రమే వచ్చింది. అదేమిటి? అంత తక్కువ ఎలా వస్తుంది, అని కంగారు పడకండి. అది నిజమే. దేవీదాస్ తన 2 ఎకరాల చేనులో రూ.80వేలు ఖర్చు పెట్టి మొత్తం ఉల్లిపాయల పంటే వేశాడు. దీంతో పంట బాగా వచ్చింది. మొత్తం 952 కిలోల పంట చేతికి అందింది. దాన్నంతా 18 సంచుల్లోకి ఎత్తి ట్రక్కు ద్వారా పూణెలో ఉన్న ఏపీఎంసీకి తరలించాడు. అయితే ఉల్లి ధర కేజీకి రూ.1.60 ఉండడంతో అతని వద్ద ఉన్న 952 కిలోల ఉల్లిపాయలకు మొత్తం రూ.1,523.20 వచ్చింది. దళారి రూ.91.35 లను కమిషన్‌గా తీసుకోగా, కూలీలకు రూ.77.55 ఖర్చయ్యాయి. ఇతర ఖర్చులకు గాను మరో రూ.33.30 లను చెల్లించాడు. మరో రూ.1,320లను ట్రక్ డ్రైవర్‌కు ఇచ్చాడు. అన్నీ పోను దేవీదాస్కు రూ.1 మాత్రమే మిగిలింది. దీంతో అతనికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది.
అయితే అంత తక్కువ మొత్తంలో డబ్బు కేవలం దేవీదాస్కు మాత్రమే కాదు, అక్కడ ఉల్లి వేసిన రైతులందరికీ అలాగే వచ్చింది. ఇక ఇప్పుడు వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఆదుకుంటారో వేచి చూడాలి. నిజంగా అలాంటి పరిస్థితి మాత్రం ఇక ముందు ఏ రైతన్నకూ రాకూడదనే ఆశిద్దాం.