వన్ ప్లస్.. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ. అయినప్పటికీ ప్రపంచ దేశాల యూజర్లను తన ఫోన్లతో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేస్తూ తక్కువ ధరలకే వాటిని అందిస్తూ వస్తోంది. సాధారణంగా వన్ ప్లస్ ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇతర కంపెనీలకు చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్లలోనూ ఉంటాయి. కానీ వాటి ధర రూ.50వేల పైచిలుకు ఉంటుంది. అయితే వన్ ప్లస్‌లో అవే ఫీచర్లు ఉన్నప్పటికీ ఆ కంపెనీ ఫోన్ల ధరలు రూ. 40వేలకు లోపే ఉంటాయి. దీని వల్లే ఆ కంపెనీ ఫోన్ల పట్ల వినియోగదారుల్లో బాగా ఆసక్తి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వన్ ప్లస్ తాజాగా వన్ ప్లస్ 6 పేరిట ఓ నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మరి ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు లభిస్తున్నాయో, ఈ ఫోన్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా..!
వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో 6.28 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6, 8 జీబీ పవర్ ఫుల్ ర్యామ్‌లను ఇందులో అమర్చారు. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. గతంలో వచ్చిన వన్ ప్లస్ ఫోన్ల కన్నా ఈ ఫోన్ ఎంతో వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే ఇందులో 64, 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తున్నారు. ఇక ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పవర్ఫుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లో ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 5.1 వెర్షన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ పి అప్డేట్ ను కూడా ఈ ఫోన్‌కు అందివ్వనున్నారు. ఇక ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ముందు భాగంలో ఉన్న కెమెరాతోనూ డివైస్‌ను ఫేస్ ద్వారా కేవలం 0.4 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో ప్రత్యేకంగా కుడి భాగంలో అలర్ట్ స్లైడర్‌ను ఏర్పాటు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ వెనుక భాగంలో గ్లాస్ బ్యాక్ ను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 ను కల్పించారు. ఈ ఫోన్లో 3300 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఇది 5వి, 4ఏ డ్యాష్ చార్జ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. కేవలం 30 నిమిషాల పాటు ఫోన్‌ను చార్జింగ్ పెడితే వచ్చే బ్యాటరీ పవర్‌తో ఫోన్ ఏకంగా రోజు మొత్తం పనిచేస్తుంది. అలాగే ఫోన్‌పై నీరు పడినా లోపలికి పోని విధంగా వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్లో 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు ఉన్నాయి.
వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మిర్రర్ బ్లాక్ రంగులో రూ.34,999 ధరకు లభిస్తుండగా ఇదే ఫోన్‌కు చెందిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మిర్రర్ బ్లాక్, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో రూ.39,999 ధరకు లభిస్తోంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ సైట్లో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రత్యేకంగా లభ్యం కానున్నాయి. ఫోన్ లాంచింగ్ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి వన ప్లస్ 6 ఫోన్‌ను కొంటే రూ.2వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఫోన్‌ను కొనేందుకు సదుపాయం అందిస్తున్నారు. సర్విఫై నుంచి ఈ ఫోన్‌కు 12 నెలల వాలిడిటీ ఉన్న ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. వన్ ప్లస్ 6 ఫోన్‌పై ఐడియా రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను, 370 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. ఈ ఫోన్లను కొన్నవారికి అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన రూ.250 గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. దీంతోపాటు అమెజాన్ కిండిల్‌పై రూ.500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. క్లియర్ ట్రిప్ సైట్ లో ఫ్లైట్, హోటల్ బుకింగ్స్‌పై రూ.25వేల వరకు విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు.
వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన అవెంజర్స్ ఎడిషన్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫీచర్లు లభిస్తున్నాయి. ఇక దీని ధర రూ.44,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ మాత్రం మే 29వ తేదీ నుంచి ప్రత్యేకంగా అమెజాన్లోనే లభిస్తుంది.
వన్ ప్లస్ 6 ఫీచర్లు…
6.28 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 2280 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్.