ఒడిశాలోని భవానిపట్నలో ఇటీవల జరిగిన ఓ హృదయ విదారక సంఘటన గురించి దాదాపుగా అందరికీ తెలుసు. దనమాఝీ అనే వ్యక్తి భార్య వ్యాధితో బాధపడుతూ మృతి చెందడంతో ఆమె శవాన్ని తరలించేందుకు ప్రభుత్వ హాస్పిటల్ వర్గాలు ఆంబులెన్స్‌ను పంపలేదు సరికదా బాధితుడి రోదనను కనీసం పట్టించుకోనుకూడా లేదు. దీంతో మాఝీ భార్య శవాన్ని దుప్పట్లో చుట్టి హాస్పిటల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి కాలినడకనే బయల్దేరాడు. అలా అతను సుమారు 12 కిలోమీటర్ల దూరం వెళ్లగానే ఈ విషయం మీడియాకు తెలిసింది. మాఝీ తన భార్య శవాన్ని భుజాన వేసుకుని వెళ్తుండడాన్ని చూసి మీడియా ఛానళ్లన్నీ ఆ వార్తను ప్రత్యక్ష ప్రసారం చేయగా, ఓ రిపోర్టర్ చొరవతో అప్పటి కప్పుడు ఆంబులెన్స్ వచ్చి మాఝీ భార్య శవాన్ని అతని గ్రామానికి తీసుకెళ్లారు. దేశంలోని మనుషుల్లో మానవత్వం మంట గలుస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. పలువురు చిత్రకారులైతే ఏకంగా ఈ సంఘటనకు చెందిన బొమ్మను గీసి దేశ దుస్థితిని కళ్లకు కట్టినట్టు చాటారు.
ఇదిలా ఉండగా మాఝీ ఓవైపు తన భార్య పోయిన దుఃఖంలో సాయం చేసే వారు లేక ఆమె శవాన్ని దుప్పట్లో చుట్టి భుజాన వేసుకుని తీసుకెళ్తుంటే స్థానిక కలెక్టర్ అతన్ని సూటిపోటి మాటలతో ప్రశ్నించాడట. మాఝీ తానే తన భార్యను చంపాడని, అనంతరం భుజాన వేసుకుని తీసుకెళ్తున్నాడని, అతనే హంతకుడని… ఇలా తట్టుకోలేని మాటలతో ప్రశ్నలు వేస్తూ మాఝీని మరింత క్షోభ పెట్టాడట. అలా ఉందీ మన ప్రభుత్వ అధికారుల పని తీరు. నిజంగా నేనే చంపేటట్టయితే ఆమెను చికిత్స కోసం హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్తానని, చంపి ఉంటే శవాన్ని పారేస్తాను కానీ, భుజాన వేసుకుని ఎందుకు తీసుకెళ్తానని మాఝీ దుఃఖపూరితమైన స్వరంతో కలెక్టర్‌కు సమాధానం చెప్పాడని తెలిసింది. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారుల తీరే అలా ఉంటే ఇక నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా..!
నాయకులుగా, ప్రభుత్వ అధికారులుగా కాకపోయినా ఆపదలో ఉన్న తోటి మనుషులను ఆదుకోవాల్సింది పోయి సూటి పోటి మాటలతో, వేదన కలిగించే ప్రశ్నలు వేసే వారిని ఏమనాలి..? అలాంటి వారి కంటే విదేశీయులే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మాఝీ సంఘటన గురించి తెలుసుకున్న బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఇండియాలో ఉన్న తమ ఎంబస్సీ ద్వారా మాఝీకి సహాయం చేస్తామని ప్రకటించాడట. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప మానవతా వాదులో. కేవలం ఓ వార్తా పత్రికలో సంఘటన గురించి తెలుసుకున్న ఓ విదేశీయుడికి ఉన్న మానవతా స్ప్రహ తోటి భారత పౌరులకు లేకపోవడం శోచనీయం. ఇంకా ఈ సంఘటనకు సంబంధించి కొస మెరుపు ఏంటంటే స్థానికంగా ఉన్న పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాఝీ గ్రామం నుంచి హాస్పిటల్ ఉన్న భవాని పట్న వరకు 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారట. ఇది ఎంత విడ్డూరమైన, హాస్యాస్పదమైన విషయం అంటే, వద్దు చెప్పడానికే సిగ్గుగా ఉంది. అయ్యా, నాయకుల్లారా..! మీరు సరిగ్గా ఉండి అధికారులచే సరిగ్గా పనిచేయిస్తే ఇలాంటి ఘటనలు జరగవు కదా. మీరు సరిగ్గా లేక, తీరా ఇలాంటి ఘటనలు జరిగాక, మళ్లీ మీరే పాదయాత్రలు చేస్తే ఇక దాన్ని ఏమనుకోవాలి..! గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టవుతుంది. అంతే కదా..!