ఒక సిలిండర్, ఒక సైకిల్ కలిస్తే… ఎయిర్ సైకిల్… ఒడిశా బాలిక చేసిన అద్భుతం..!

కిందా మీదా పడి రొప్పుతూ పెడల్స్ తొక్కుతూ ఎదురు గడ్డకైనా, మామూలుగానైనా సైకిల్ తొక్కాలంటే ఎవరికైనా శారీరక శ్రమ అవసరమే. అది పిల్లలైనా. పెద్దలైనా. మరి శారీరక శ్రమ లేకుండా సైకిల్ తొక్కలేమా అంటే… తొక్కలేమనే ఎవరైనా సమాధానం చెబుతారు. కానీ ఆ సైకిల్‌కు మాత్రం శారీరక శ్రమ అస్సలు అవసరం లేదు. దానిపై కూర్చుని బ్రేక్స్ వేస్తూ వెళ్తే చాలు, ఆటోమేటిక్‌గా ఆ సైకిలే ముందుకు కదులుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. మరి అలాంటి వినూత్న సైకిల్‌ను తయారు చేసింది ఎవరో తెలుసా..? ఇంకెవరు, ఏ పేరుమోసిన ఇంజినీరో, సైంటిస్టో అయి ఉంటాడు అని అనుకుంటున్నారా..? అయితే కానే కాదు. ఎందుకంటే ఆ సైకిల్‌ను తయారు చేసింది ఓ బాలిక మరి..! అవును, మీరు విన్నది నిజమే. ఓ బాలికే పైన చెప్పిన ఆ వింతైన సైకిల్‌ను తయారు చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..?

air-cycle-tejaswini

ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 14 ఏళ్ల తేజస్విని పేరుకు తగినట్టుగానే చదువుల్లో చాలా తేజాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె మెదడు చాలా పదునైంది. సైన్స్ ప్రయోగాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వారి స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ నిర్వహించాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే అందులో ప్రదర్శించేందుకు గాను ఏం చేయాలో మొదట ఆమెకు తెలియలేదు. అయితే అప్పుడే ఆమె మెదడులో ఓ ఆలోచన తట్టింది. అదే ఎయిర్ సైకిల్.

అంతకు కొద్ది రోజుల ముందే ఆమె తన తండ్రితో కలసి సైకిల్ రిపేర్ షాపుకు వెళ్లింది. అక్కడ మెకానిక్‌లు ఎయిర్‌గన్‌తో సైకిళ్లను రిపేర్ చేయడం చూసింది. అయితే మొదట దాని గురించి పట్టించుకోలేదు. కానీ సైన్స్ ఫెయిర్ ఏమో గానీ ఆ సమయంలో ఆమెకు ఎందుకో ఆ ఎయిర్‌గన్ గుర్తుకు వచ్చింది. అంతే ఆమె బుర్రలో ఓ పదునైన ఆలోచన చటుక్కున వచ్చేసింది. అంతే తన ఆలోచనను తండ్రితో కలసి ఆచరణలో పెట్టేసింది. తన సైకిల్ వెనుక భాగంలో ఓ గ్యాస్ సిలిండర్‌ను పెట్టి దానికి రెండు మార్గాలు ఏర్పాటు చేసింది. అందులో ఒక మార్గం గుండా నీరు ప్రవహిస్తుంది. మరో మార్గం గుండా సిలిండర్‌లోని గాలి బయటకు వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఆ మార్గానికి చిన్న పిడి (knob) లాంటి దాన్ని ఏర్పాటు చేసింది. దానికే ప్రెషర్‌ను కొలిచే మరో మీటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిలిండర్ వద్ద ఉన్న పిడిని తిప్పితే ఆ మార్గంలో గ్యాస్ పైప్ ద్వారా బయటికి వచ్చి పెడల్ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌ను తిప్పుతుంది. దీంతో ఎయిర్‌గన్ తిరిగి పెడల్‌ను కూడా తిప్పుతుంది. అప్పుడు సైకిల్‌కు కదలిక వస్తుంది. అంతే, ఇక బ్రేకులు వేస్తే తప్ప ఆ సైకిల్ ఆగదు. అలా వెళ్తూనే ఉంటుంది. అలా ఒక సిలిండర్ ద్వారా సైకిల్‌ను 60 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లవచ్చు.

తేజస్విని తన స్కూల్‌లో జరగనున్న సైన్స్ ఫెయిర్ కోసమే ఈ ఎయిర్ సైకిల్‌ను తయారు చేసినా ఇప్పుడా సైకిల్ దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంటోంది. సదరు సిలిండర్‌కు చిన్నపాటి మార్పులు చేస్తే దాన్ని ఎంచక్కా మోటర్‌సైకిల్, కారుకు కూడా ఫిట్ చేసుకోవచ్చట. దీంతో ప్రయాణికులకు చాలా వరకు పెట్రోలు, డీజిల్ ధరల భారం తగ్గుతుంది కూడా. కాగా తేజస్విని తన ప్రాజెక్ట్‌తో స్కూల్‌లో సైన్స్ ఫెయిర్‌లో మొదటి ప్రైజ్ కొట్టినా, ఆమె తయారు చేసిన ఆవిష్కరణను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట. ఏది ఏమైనా అంత చిన్న వయస్సులో ఆమె అలాంటి ప్రయోగం చేయడం నిజంగా అద్భుతం. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే వారు మన దేశానికి ఉపయోగపడే గొప్ప సైంటిస్టులు అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు కదా..!

Comments

comments

Share this post

scroll to top