బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొనే ముందు ఈ 5 అంశాలను గ‌మ‌నించాలి..!

బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. మ‌హిళ‌లే కాదు, కొంద‌రు పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలంటే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే బంగారం అంటే ఎంత ఇష్టం ఉన్నా దాన్ని కొనేట‌ప్పుడు మాత్రం మ‌నం క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. లేదంటే పేరుకు పెద్ద పెద్ద షోరూంలైనా కొంద‌రు బంగారు వ్యాపారులు వినియోగ‌దారుల‌కు ఆభ‌ర‌ణాల‌ను అమ్మే స‌మ‌యంలో మోసం చేస్తుంటారు. న‌కిలీ న‌గ‌లు, క్వాలిటీ లేనివి, గుర్తింపు లేనివి అమ్మాల‌ని చూస్తారు. వాటి గురించి మ‌నం క‌చ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఆ త‌రువాత మోస‌పోయామ‌ని గ్ర‌హించినా ఫ‌లితం ఉండ‌దు. క‌నుక ముందే జాగ్ర‌త్త వ‌హిస్తే మంచిది. ఈ క్రమంలో బంగారం కొనేట‌ప్పుడు మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

purity-of-gold

బీఐఎస్ (BIS) స్టాండ‌ర్డ్ మార్క్‌…
బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ అనేది ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌కు అనుగుణంగా బంగారం నాణ్య‌త‌ను బ‌ట్టి ఆభ‌ర‌ణాల‌కు సర్టిఫికెట్ ఇస్తుంది. ప్ర‌తి బంగారు ఆభ‌ర‌ణంపై బీఐఎస్ చిహ్నం క‌చ్చితంగా ఉంటుంది. క‌నుక మ‌నం బంగారం కొనేట‌ప్పుడు ఆ ఆభ‌ర‌ణాల‌పై ఈ చిహ్నం ఉందా, లేదా అన్న‌ది గ‌మ‌నించాలి. చిత్రంలో చూపిన విధంగా బీఐఎస్ మార్క్ ఉంటుంది. దాన్ని గ‌మ‌నించ‌డం ద్వారా ఆభ‌ర‌ణం అస‌లుదా, న‌కిలీదా అన్న‌ది గుర్తించ‌వ‌చ్చు.

ప్యూరిటీ గ్రేడ్‌…
చాలా మంది 99 శాతం ప్యూర్ బంగారం కొన్నామ‌ని అనుకుంటారు. కానీ నిజానికి ప్యూర్ గోల్డ్ అనేది ఎవ‌రికీ స‌రిగ్గా తెలియ‌దు. 24 క్యారెట్లు లేదా 999 సింబ‌ల్ ఉంటే దాన్ని ప్యూర్ గోల్డ్‌గా భావించాలి. దీని రేటు ఎక్కువ‌గా ఉంటుంది. అయితే మ‌న‌కు ఈ బంగారం దాదాపుగా అమ్మ‌రు. ఎందుకంటే ప్యూర్ గోల్డ్ అంత దృఢంగా ఉండ‌దు. అందులో రాగి వంటి లోహాల‌ను క‌లిపితేనే అప్పుడు బంగారం దృఢంగా ఉండి ఆభ‌ర‌ణాలు చేసినా చాలా ఎక్కువ కాలం మ‌న్నుతాయి. అయితే 23 లేదా 22 క్యారెట్లు అంటే 958 లేదా 916 సింబ‌ల్ ఉన్న బంగారం మ‌నం వాడ‌దగిన‌ది. క‌నుక ఈ సింబ‌ల్స్ బంగారు ఆభ‌ర‌ణాల‌పై ఉంటేనే దాన్ని ప్యూర్‌గా భావించి కొనుగోలు చేయాలి. ఈ క్ర‌మంలో సింబ‌ల్ త‌గ్గిన‌కొద్దీ బంగారం ప్యూరిటీ కూడా త‌గ్గుతుంది. అంటే 22 క్యారెట్ల బంగారానికి ఉన్న ప్యూరిటీ 8 క్యారెట్ల దానికి ఉండ‌దు. ఇది 21, 18, 17, 14, 10, 9, 8 అని త‌గ్గుతూ ఉంటుంది. వాటికి అనుగుణంగా 875, 750, 708, 585, 417, 375, 333 అనే సింబ‌ల్స్ కూడా మార‌తుంటాయి. ఈ సింబ‌ల్స్‌ను చూస్తే గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

హాల్‌మార్క్‌…
బంగారం నాణ్య‌త‌ను తెలిపేందుకు బీఐఎస్ స‌ర్టిఫికెట్ ఇస్తుంద‌ని తెలుసుకున్నాం క‌దా. హాల్‌మార్క్ సింబ‌ల్ కూడా అటువంటిదే. కాక‌పోతే దీనికి బీఐఎస్ ఆథ‌రైజేష‌న్ ఇస్తుంది. అంటే హాల్‌మార్క్ సింబ‌ల్ ఉన్నా ఆ బంగారాన్ని నాణ్య‌మైందిగా గుర్తించి కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంట్లో చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా ప‌లు ర‌కాల సింబ‌ల్స్ ఉంటాయి. వీటిలో ఏది ఉన్నా స‌రే హాల్‌మార్క్ జ్యువెల్ల‌రీ అని బంగారాన్ని భావించాలి.

త‌యారీ సంవ‌త్స‌రం…
సాధార‌ణంగా మ‌నం మార్కెట్‌లో కొనే ఆయా వ‌స్తువులకు త‌యారీ తేదీ ఉన్న‌ట్టుగానే బంగారు ఆభర‌ణాల త‌యారీ తేదీ కూడా దానిపై ముద్రించ‌బ‌డి ఉంటుంది. దాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే స‌ద‌రు న‌గ ఏ సంవ‌త్స‌రంలో త‌యారైందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అదెలాగంటే… ఉదాహ‌ర‌ణ‌కు ఆభ‌ర‌ణంపై A అనే ఆంగ్ల అక్ష‌రం ఉంద‌నుకోండి అది 2000వ సంవ‌త్సరంలో త‌యారైన‌ట్టు అర్థం. అదే J అనే లెట‌ర్ ఉంటే 2008 అని, N అని ఉంటే 2011 అని, P అని ఉంటే 2012లో ఆ న‌గ‌ను త‌యారు చేశార‌ని తెలుసుకోవాలి. ఈ ఆంగ్ల అక్ష‌రాలను కూడా బీఐఎస్ నిర్ణ‌యిస్తుంది.

వ్యాపారుల చిహ్నం…
ఇక చివ‌రిగా బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొనేట‌ప్పుడు వాటిపై గ‌మ‌నించాల్సిన మ‌రొక అంశం ఏమిటంటే… స‌ద‌రు ఆభ‌రణాన్ని ఎవ‌రు త‌యారు చేశారో వారి వ్యాపార చిహ్నం ఆ న‌గ‌పై ఉంటుంది. దాన్ని కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే తెలుస్తుంది. ఇలా ఈ 5 అంశాల‌ను ప‌రిశీలించ‌డం వ‌ల్ల మ‌నం స్వ‌చ్ఛ‌మైన, నాణ్య‌మైన బంగారాన్ని కొనేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top