భార్యను ఇండియాలో వదిలి విదేశాలకు వెళ్లే భర్తలకు పెద్ద షాక్..! ప్రభుత్వం కొత్త రూల్ ఇదే..!

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం.. కోట్ల ఆస్తి సంపాదించాం.. అని చెప్పి చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు మన దేశంలో యువతులను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సదరు యువకుడు ఎలాంటి వాడు అని ఆలోచించకుండా, వెనుక ముందు చూడకుండా లక్షలు కట్నంగా ఇచ్చి తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ సదరు ఎన్‌ఆర్‌ఐ అల్లుడు.. తమ అమ్మాయిని గర్భవతిని చేసి, లేదా మరేదైనా కారణాల వల్ల ఆమెను వదిలేసి విదేశాలకు చెక్కేశాడనుకోండి, అలాంటి సమయాల్లో ఉంటుంది అవస్థ. నేటి తరుణంలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇలాంటి యువతులకు సపోర్ట్‌గా ఓ కొత్త చట్టం తేనుంది. అదేమిటంటే…

ఇకపై ఎన్‌ఆర్‌ఐలు ఎవరైనా సరే.. ఇండియాలో అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారితో కొంత కాలం గడిపి అనంతరం వారిని వదిలించుకుని విదేశాలకు వెళ్లి ఇక వారు తిరిగి రాకపోతే అలాంటి వారికి ఇండియాలో ఉండే ఆస్తులను ప్రభుత్వం అటాచ్‌ చేస్తుంది. మొదట మూడు సార్లు అలాంటి ఎన్‌ఆర్‌ఐలకు కేంద్రం నోటీసులు పంపుతుంది. వాటికి స్పందించకపోతే సదరు ఎన్‌ఆర్‌ఐని తప్పించుకుని తిరుగుతున్నాడని భావించి అతనిపై కేసు నమోదు చేస్తారు. అంతే కాదు, అతనికి ఇండియాలో ఉన్న ఆస్తులను అటాచ్‌ చేసి స్వాధీనం చేసుకుంటారు.

పైన చెప్పిన చట్టాన్ని త్వరలో అమలులోకి తేనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తేనున్నారు. ఇది అమలులోకి వస్తే అప్పుడు ఎన్‌ఆర్‌ఐల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు ఊరట కలగనుంది. దేశంలో ఇప్పటికే మహిళలను వదిలేసిన అలాంటి ఎన్‌ఆర్‌ఐల కేసులు 3328 వరకు ఉన్నాయట. ఈ క్రమంలో ఈ చట్టం అమలులోకి వస్తే అప్పుడు అలాంటి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా ఈ చట్టం వల్ల ఎన్‌ఆర్‌ఐ సంబంధాల్లో కొంత వరకు మోసాలు తగ్గుతాయనే భావిస్తున్నారు..!

Comments

comments

Share this post

scroll to top