ఆధార్… ఒకప్పుడేమే గానీ ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది. గ్యాస్ సబ్సిడీకే కాదు, మొబైల్ నంబర్లకు, పాన్ కార్డులకు, ఇతర అనేక సేవలకు ఇప్పుడు ఆధార్‌ను అడుగుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి ఆధార్ ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఆధార్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటేనే జనాలకు ఇబ్బంది కలుగుతోంది. తమ సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉంది, అందులో వివరాలు ఎలా అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకున్నాక కొత్త కార్డు ఎప్పుడు వస్తుంది.. వంటి అనేక సందేహాలు వారిలో నెలకొన్నాయి. అయితే ఇకపై ఇలా ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న హెడ్ పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని సబ్ పోస్టాఫీసుల్లోనూ ఆధార్ కేంద్రాలు రానున్నాయి. వీటిల్లో ప్రజలు తమ ఆధార్ కార్డుకు గాను సంబంధించిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇందుకు గాను ఇప్పటికే పోస్టాఫీసు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.
పోస్టాఫీసుల్లో లభ్యం కానున్న ఆధార్ సేవల ద్వారా ప్రజలు తమ ఆధార్ వివరాలను 15 నిమిషాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. 24 గంటల్లో అప్డేట్ అయిన వివరాలతో కూడిన ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 15 రోజుల్లో ఫిజికల్ కార్డును పొందవచ్చు. ఈ క్రమంలో ఆధార్ వివరాల అప్డేట్కు రూ.25, బయోమెట్రిక్ అప్డేట్కు రూ.25, కొత్తగా జనరేట్ చేసుకునేందుకు రూ.50 ఫీజు అవుతుంది. దాన్ని చెల్లిస్తే ప్రజలు తమ ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.