పోస్టల్ స్టాంప్స్… ఒకప్పుడు వీటి వినియోగం బాగా ఉండేది. ఇంటర్నెట్, ఈ-మెయిల్స్, ఇన్స్టాంట్ మెసెంజర్స్ రాకతో ఇప్పుడు వీటి వినియోగం బాగా తక్కువైంది. అయినా కొన్ని కార్యకలాపాల కోసం వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా మనకు లభించే స్టాంప్స్‌లో ధర ఎక్కువైనవి, తక్కువైనవి ఇలా వివిధ రకాలైనవి ఉంటాయి. ఆయా అవసరాలకు అనుగుణంగా మనం వాటిని వాడుతాం. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన స్టాంపులను విడుదల చేస్తుంది. ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చెందినవో, ఏదైనా ఒక సంఘటనను, ప్రదేశాన్ని, వస్తువును ఉద్దేశించో ప్రభుత్వం స్టాంపులను ముద్రిస్తుంది. అయితే కేవలం ఆయా రకాలకు చెందిన ప్రత్యేక స్టాంపులనే కాదు, ఇప్పుడు దేశంలోని ప్రజలు తమ ఫొటోలను లేదా తమకిష్టమైన వారి ఫొటోలను స్టాంపుల్లో ముద్రించుకునే అవకాశం కల్పిస్తోంది పోస్టల్ శాఖ. అవును, మీరు విన్నది నిజమే.
దేశంలోని కొన్ని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ప్రజలు ఇప్పుడు తమ తమ ఫొటోలకు చెందిన స్టాంపులను ముద్రించుకునే అవకాశం కల్పిస్తోంది పోస్టల్ శాఖ. www.epostoffice.gov.in సైట్ ద్వారా కూడా వినియోగదారులు ఈ సౌకర్యాన్నిపొందవచ్చు. వినియోగదారులు తమ ఫొటోలే కాదు, తమకు ఇష్టమున్న వ్యక్తులు, ప్రదేశాలు, జంతువులు, వస్తువులు, కంపెనీలైతే లోగోలు ఇలా దేనికి సంబంధించిన ఫొటోనైనా స్టాంప్ రూపంలో పొందేందుకు వీలుంది. అయితే ఈ స్టాంపులను వ్యక్తిగతంగా లేదా కంపెనీ తరఫున ఎలా అయిన ఆర్డర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అయితే రూ.300 చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో వినియోగదారులు తమ ఫొటోలను సాఫ్ట్ లేదా హార్డ్ కాపీ రూపంలో పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. అదే కంపెనీ తరఫున అయితే ధర ఇంకా ఎక్కువే అవుతుంది. వ్యక్తిగతంగా స్టాంపులను ఆర్డర్ చేసే వారికి రూ.300లకు 1 స్టాంపు షీట్ ఇస్తారు. అందులో 12 స్టాంపులు ఉంటాయి.
వినియోగదారులు తాము ఆర్డర్ చేసిన స్టాంపులను తమకిష్టమున్న పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. అందుకోసం కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే ఒకసారి ఆ స్టాంపులు పోస్ట్ ఆఫీస్‌కి గనక వస్తే వాటిని వారం రోజల లోపు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అవి వెనక్కి పంపబడతాయి. కావాలంటే వినియోగదారులు తమ స్టాంపులను పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. కాకపోతే అందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 100 స్టాంపులు ఆపైన ఆర్డర్ చేసిన వారికి 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్‌ను పోస్టల్ శాఖ కల్పిస్తోంది. చివరిగా ఒక్క విషయం. స్టాంపులను ఆర్డర్ చేసే సమయంలో పోస్ట్ ఆఫీస్ క్లర్క్‌కు వినియోగదారులు తమకు చెందిన గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్‌ను ఏదో ఒకటి జిరాక్స్ రూపంలో అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆ పోస్ట్ ఆఫీస్‌లో లభించే డిక్లరేషన్ ఫాంను కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే! ఇంకెందుకాలస్యం. వెంటనే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి మీ ఫొటోతో కూడిన స్టాంపు కోసం ఆర్డర్ ఇచ్చేసెయ్యండి!