ఇప్పుడు మీరు ఇంట్లో నుంచే మీ మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్‌కు లింక్ చేయ‌వ‌చ్చు. అదెలాగో తెలుసా..?

మనం వాడుతున్న మొబైల్ నంబ‌ర్ల‌ను మ‌న ఆధార్ కార్డుల‌తో లింక్ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో మ‌న‌కు చెబుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మొద‌ట ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఉన్న ఈ గ‌డువును మార్చి వ‌ర‌కు పెంచారు. దీంతో ఇప్పుడు మార్చి 31 వ‌ర‌కు ఇందుకు గ‌డువు ఉంది. అప్ప‌టి వ‌రకు దేశంలోని మొబైల్ వినియోగ‌దారులు త‌మ త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను త‌మ ఆధార్ నంబ‌ర్ల‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే క‌నెక్ష‌న్ క‌ట్ చేస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం స్టోర్స్‌కు మాత్ర‌మే వెళ్లి మొబైల్ నంబ‌ర్‌, ఆధార్ లింక్ చేయాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు స్టోర్‌కు వెళ్ల‌కుండానే ఇంట్లో నుంచే మీ మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్‌కు అనుసంధానించ‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకునేందుకు ఇప్పుడు స్టోర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే ఆ ప‌ని చేసుకోవ‌చ్చు. ఆ ప్ర‌క్రియ‌ను చాలా స‌ర‌ళ‌త‌రం చేశారు. దాని ప్ర‌కారం… ఐవీఆర్ ప‌ద్ధ‌తి ద్వారా మీ మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్‌కు అనుసంధానించ‌వ‌చ్చు. అదెలాగంటే…

1. మీరు లింక్ చేయాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546 అనే నంబ‌ర్‌కు కాల్ చేయాలి. అప్పుడు మీకు భాష ఆప్ష‌న్ల‌ను అడుగుతుంది. మీకు కావ‌ల్సిన భాష‌ను ఎంచుకున్నాక‌ భారత పౌరుడా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. దీంతో మీరు సంబంధిత‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి.

2. ఎంట‌ర్ చేసిన ఆధార్ నంబర్‌ను క‌న్‌ఫాం చేయ‌డానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. దీంతో మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

3. అనంత‌రం యూఐడీఏఐ (ఆధార్‌) డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు సమ్మతమేనా అని ఇక్కడ అడుగుతుంది. అందుకు స‌మ్మ‌త‌మే అని తెలిపే కీని ప్రెస్ చేయాలి.

4. ఆ తరవాత మీ మొబైల్ నంబర్ ను ఐవీఆర్ఎస్ వాయిస్ చ‌దివి వినిపిస్తుంది. నంబ‌ర్ క‌రెక్ట్ అనుకుంటే 1 కీ ప్రెస్ చేసి క‌న్‌ఫాం చేయాలి.

5. చివరిగా ఆధార్-మొబైల్ నంబర్ రీ-వెరిఫికేషన్‌ను పూర్తిచేయడానికి 1ని ప్రెస్ చేయాలి.

6. ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేసి మళ్లీ పైన పేర్కొన్న విధానం ద్వారానే దానికి కూడా ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఈ సమయంలో మీ రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

మీ మొబైల్ నంబర్‌‌కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ లోపలే ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కాగా ఈ ప‌ద్ధ‌తి ద్వారా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ క‌స్ట‌మ‌ర్లు త‌మ మొబైల్ నంబ‌ర్ల‌ను ఆధార్‌కు లింక్ చేసుకోవ‌చ్చు. కానీ ఇత‌ర టెలికాం సంస్థ‌ల‌కు చెందిన నెట్‌వ‌ర్క్‌ల‌ను వాడేవారికి ఐవీఆర్ఎస్ ఆప్ష‌న్ అందుబాటులో లేదు. త్వ‌ర‌లో వ‌స్తుందేమో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top