ఇకపై మీ ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు..!

ఫేస్‌బుక్ ఎక్కువగా వాడుతున్నారా? ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతున్నారా? నిత్యం గంటల తరబడి అందులో విహరిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే కంటెంట్ మానెటైజేషన్. అంటే మీరు పోస్టుల్లో పెట్టే కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట!

కంటెంట్ మానెటైజేషన్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఉంది. గూగుల్ సహా అనేక ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్ కంపెనీలు బ్లాగ్స్, వెబ్‌సైట్స్ ఓనర్లకు రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయా కంపెనీలు ఇచ్చే యాడ్లను వెబ్‌సైట్ నిర్వాహకులు తమ సైట్‌లో పెట్టుకోవాలి. ఎవరైనా ఆ సైట్‌ను చూసినప్పుడు అందులో ఉండే యాడ్స్‌ను క్లిక్ చేస్తే సదరు అడ్వర్టయిజింగ్ కంపెనీ ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడికి కొంత మొత్తంలో డబ్బును చెల్లిస్తుంది. అలా వెబ్‌సైట్ పాపులర్ అవుతూ నిత్యం దాన్ని చూసే వారి సంఖ్య పెరుగుతూ అందుకు అనుగుణంగా క్లిక్స్ కూడా వస్తే వెబ్‌సైట్ ఓనర్లకు డబ్బులు బాగా వస్తాయి. ఈ క్రమంలో అలా జమయ్యే డబ్బులు 50, 100 డాలర్లు కాగానే ఆ అడ్వర్టయిజింగ్ కంపెనీ యూజర్‌కు చెక్ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ రూపంలో డబ్బును చెల్లిస్తుంది. ఇలా క్లిక్స్ ద్వారా ఆదాయం వచ్చే ఆన్‌లైన్ ఎర్నింగ్ విధానాన్ని పే పర్ క్లిక్ అంటారు.

facebook-post

కాగా ఫేస్‌బుక్ కూడా సరిగ్గా పే పర్ క్లిక్ విధానంలోనే తన యూజర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించనుందని తెలిసింది. అయితే ఇందుకోసం యూజర్లు తాము పెట్టే పోస్టుల్లో ఫేస్‌బుక్ అందించే యాడ్స్‌ను ఉంచాల్సి వస్తుంది. వాటిని ఎవరైనా వేరే యూజర్లు క్లిక్ చేస్తే ఆ అకౌంట్ హోల్డర్‌కు డబ్బులు వస్తాయన్నమాట. ఇప్పటికే దీనిపై ఆ సంస్థలో అంతర్గతంగా పలు ప్రయోగాలు జరుగుతున్నట్టు సమాచారం. అమెరికాలో కొంత మంది వెరిఫైడ్ యూజర్లకు ఫేస్‌బుక్ పలు సర్వేలు కూడా నిర్వహిస్తోందని తెలిసింది. ఈ క్రమంలో అతి త్వరలోనే ఫేస్‌బుక్ తన అడ్వర్టయిజింగ్ ద్వారా యూజర్లకు డబ్బు సంపాదించుకునే వెసులు బాటు కల్పించనుందని తెలుస్తోంది. అయితే కేవలం పే పర్ క్లిక్ మాత్రమే కాకుండా బ్రాండ్ స్పాన్సర్‌షిప్, మార్కెటింగ్, డొనేషన్ వంటి పలు విధానాలను కూడా ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తేనుందని తెలిసింది. ఇంకేం! ఫేస్‌బుక్ కంటెంట్ మానెటైజేషన్ వచ్చేదాకా ఆగండి! ఎంచక్కా పోస్టులు కొడుతూ డబ్బులు సంపాదించవచ్చు.

Comments

comments

Share this post

scroll to top