మంట‌తో మీ ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోండిలా..!

పిక్‌నిక్‌లు, క్యాంప్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగా ఎవ‌రైనా అక్క‌డ ఎక్కువ సమ‌య‌మే గ‌డుపుతారు. అయితే అలాంటి ప్ర‌దేశాల్లో ఫోన్ చార్జింగ్ కోసం ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు ఉండ‌వు. ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌ను వెంట తీసుకెళ్లాలి. దీంతోపాటు అక్క‌డ వంట వండుకోవాలంటే మంట వెలిగించి ప్ర‌యాస ప‌డాల్సిందే. అయితే ఈ రెండు ఇబ్బందుల‌ను ఆ ప‌రిక‌రం తొల‌గిస్తుంది. దాని పేరే బ‌యోలైట్ క్యాంప్ స్ట‌వ్‌. దీంతో ఒకేసారి రెండు ప‌నులు చేసుకోవ‌చ్చు. ఓ వైపు మంట‌పై ఫాస్ట్‌గా ఆహారం వండుతూనే, మ‌రోవైపు ఫోన్‌ను చార్జింగ్ పెట్టుకోవచ్చు..! దీంతో ఎంతో ఇంధ‌నం ఆదా అవుతుంది కూడా.

biolite-camp-stove

అమెరికాలోని న్యూయార్క్‌లో నివ‌సించే జ‌నాథ‌న్, అలెక్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు 2006లో ఈ క్యాంప్ స్ట‌వ్ త‌యారీకి శ్రీ‌కారం చుట్టారు. అయితే నిధుల కొర‌త కార‌ణంగా వారు త‌యారు చేసిన ఆ ప‌రిక‌రం మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చే స‌రికి 8 ఏళ్లు ప‌ట్టింది. 2014లో దీన్ని పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లో త‌యారు చేసేందుకు కావ‌ల్సిన నిధుల‌ను వారు స‌మకూర్చుకోగ‌లిగారు. ఈ క్ర‌మంలో 2014 నుంచి అనేక మార్పులు, చేర్పులు చేసుకున్న స‌ద‌రు బ‌యోలైట్ క్యాంప్ స్ట‌వ్ ప్ర‌స్తుతం మ‌న‌కు నూత‌న హంగుల‌తో అందుబాటులో ఉంది. దీని ధ‌ర రూ.20,400. ఈ-కామ‌ర్స్ సైట్లు లేదా బ‌యోలైట్ ఎన‌ర్జీ వెబ్‌సైట్‌లో దీన్ని యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ స్ట‌వ్‌పై ఓ వైపు మంట పెట్టి అవసరం ఉన్న వంట వండుతూనే మరోవైపు దాని ద్వారా ఫోన్‌, ప‌వ‌ర్‌బ్యాంక్‌, యూఎస్‌బీ లైట్ వంటి డివైస్‌లకు ఎంచక్కా చార్జింగ్ పెట్టుకోవచ్చు. స్టవ్‌లో మంట పెట్టడం వల్ల ఉద్భవించే వేడిని విద్యుత్ శక్తిగా మార్చే ఓ పరికరం ఆ స్టవ్‌కు ఓ వైపు అమర్చబడి ఉంటుంది. దానికి యూఎస్‌బీ పోర్టులు కూడా ఉంటాయి. వాటికే ఫోన్ లేదా పవర్‌బ్యాంక్, యూఎస్‌బీ లైట్ వంటి గ్యాడ్జెట్లను చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ స్టవ్ కేవలం 4.5 నిమిషాల్లోనే 1 లీటర్ నీటిని మరిగించగలదు. అంతేకాదు దీనికి ఫోన్‌ను 20 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు, దాంతో 60 శాతం వరకు ఫోన్ బ్యాటరీకి కావల్సిన శక్తి లభిస్తుంది.

 

Comments

comments

Share this post

scroll to top