ఇప్పటి నుంచి 3 నెలల పాటు మీరు కొనే వస్తువులపై రెండు రేట్లు ఉంటాయి. ఎందుకో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే జీఎస్‌టీ బిల్లును అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు వస్తువులు, సేవల ధరలు పెరగనుండగా, కొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇంకా చాలా మాల్స్, దుకాణదారులు, చిరు వ్యాపారుల కంపెనీలకు చెందిన పాత స్టాక్ మాత్రమే ఉంది. కొత్త స్టాక్ ఇంకా రాలేదు. దీంతో ఆయా వస్తువుల ధరల విషయంలో ఇంకా జనాలకు మార్పు కనిపించడం లేదు. అయితే కొత్త స్టాక్ వస్తే జీఎస్‌టీ వల్ల ఏ వస్తువుల రేట్లు పెరిగాయో, ఏవి తగ్గాయో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కొత్త రూల్ పెట్టింది. అదేమిటంటే…

జీఎస్‌టీ బిల్లు వల్ల ఏ వస్తువుల రేట్లు పెరిగాయో, ఏవి తగ్గాయో తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తయారీదారులు, దిగుమతిదారులు, డిస్ట్రిబ్యూటర్లకు కొత్త నియమం పెట్టింది. దాని ప్రకారం ఏ వస్తువు ధరైనా జీఎస్‌టీ బిల్లు వల్ల పెరిగితే ఆ వస్తువు ధరను దానిపై ఉన్న ఎంఆర్‌పీ ధర పక్కనే స్టిక్కర్ వేసి దానిపై ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాత ధర, పెరిగిన వినియోగదారులకు సులభంగా తెలుస్తుంది. ఇక ఇలా పెరిగిన ధర గురించి సదరు తయారీదారు/దిగుమతిదారు/డిస్ట్రిబ్యూటర్ పత్రికలు, మీడియా చానల్స్‌లో ప్రకటనలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక జీఎస్‌టీ బిల్లు వల్ల ఏ వస్తువు ధర అయినా తగ్గితే దాని ధరను కూడా ఆ వస్తువుపై ఎంఆర్‌పీ ధర పక్కనే స్టిక్కర్ వేసి దానిపై ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దీంతో తగ్గిన ధర, పాత ధర వినియోగదారులకు తెలుస్తుంది. అయితే ధర తగ్గిన వస్తువుల గురించి తయారీదారులు, దిగుమతిదారులు, డిస్ట్రిబ్యూటర్లు పేపర్లు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా ఇలా చేయకపోతే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు గాను 3 నెలల పాటు అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు వారికి ఆయన గడువు ఇచ్చారు. అంటే ఇకపై మీరు కొనే వస్తువులపై ఎంఆర్‌పీ ధర పక్కనే పెరిగిన లేదా తగ్గిన ధర ఉంటుందన్న మాట. ఒక వేళ లేకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి..!

Comments

comments

Share this post

scroll to top