హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లోని థియేట‌ర్లు, మ‌ల్టీ ప్లెక్స్‌ల‌లో ఇక‌పై తాగునీరు ఫ్రీగా అందివ్వాల్సిందే..!

మ‌న దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న థియేట‌ర్ లేదా మల్టీప్లెక్స్ అయినా వాటిలోకి బ‌య‌టి ఫుడ్‌ను అనుమ‌తించ‌ర‌ని అంద‌రికీ తెలిసిందే. ఫుడ్ మాత్ర‌మే కాదు, క‌నీసం వాట‌ర్ బాటిల్స్ ను కూడా అనుమ‌తించ‌రు. క‌చ్చితంగా స‌ద‌రు థియేట‌ర్స్ లోప‌లే వాటిని కొనుగోలు చేయాలి. లేదంటే లేదు. అయితే ఇక‌పై థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు అలా చేస్తే కుద‌ర‌దు. అదీ హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఉన్న ఏ థియేట‌ర్ లేదా మల్టీప్లెక్స్ అయినా ప్రేక్షకులు బ‌య‌టి నుంచి నీరు లేదా తిను బండారాలు తెచ్చుకుంటే అనుమ‌తించాల్సిందే. లేదంటే జ‌రిమానా ప‌డుతుంది. అలా అని చెప్పి వినియోగదారుల ఫోరం తాజాగా తీర్పునిచ్చింది.

అత‌ని పేరు విజ‌య్ గోపాల్‌. 2016 జూన్ 25న హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్ ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్‌కు సినిమా చూసేందుకు అత‌ని ఫ్రెండ్‌తో క‌ల‌సి వెళ్లాడు. అయితే అంత‌కు ముందే అత‌ను బ‌య‌ట ఓ వాట‌ర్ బాటిల్ కొనుగోలు చేశాడు. దాన్ని చేతిలో ప‌ట్టుకుని థియేట‌ర్ లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. బ‌య‌టి నుంచి ఫుడ్ కాదు క‌దా, క‌నీసం వాట‌ర్ బాటిల్స్ ను కూడా అనుమ‌తించేది లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో అప్ప‌టికి విజ‌య్ శాంతించాడు. అయిన‌ప్ప‌టికీ అత‌ను ఆ విష‌యాన్ని వ‌ద‌ల్లేదు. స‌ద‌రు థియేట‌ర్ యాజ‌మాన్యంపై వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

దీంతో వినియోగ‌దారుల ఫోరం ఆ ఫిర్యాదును విచారించింది. ఈ క్రమంలో థియేట‌ర్ ప్ర‌తినిధులు వ‌చ్చి త‌మ వాద‌న‌ను ఫోరం ముందు వినిపించారు. బ‌య‌టి నుంచి తెచ్చే ఫుడ్ లేదా వాట‌ర్ బాటిల్స్ ఏవైనా వాటిని అనుమ‌తించేది లేద‌ని, సెక్యూరిటీ స‌మ‌స్య వ‌స్తుంద‌ని అన్నారు. వాటిలో పేలుడు ప‌దార్థాలు తెచ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే బ‌య‌టి ఫుడ్‌ను, వాట‌ర్ బాటిల్స్‌ను అనుమ‌తించ‌డం లేద‌ని చెప్పారు. దీనికి ఫోరం సంతృప్తి చెంద‌లేదు. బ‌య‌ట ఎలాగూ సెక్యూరిటీ చెక్ చేస్తారు క‌దా, ఒక వేళ ఏవైనా పేలుడు ప‌దార్థాలు ఉంటే అప్పుడే తెలుస్తుంది క‌దా అని ఫోరం అడగ్గా అందుకు వారు బ‌దులివ్వ‌లేదు. దీంతో ఫోరం విజ‌య్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. బాధితునికి న‌ష్ట ప‌రిహారం కింద రూ.5వేలు, ఇత‌ర ఖ‌ర్చుల కింద రూ.1వేయి మొత్తం రూ.6వేల‌ను చెల్లించాల‌ని తీర్పు చెప్పింది.

అయితే అది అంత‌టితో ఆగ‌లేదు. స‌ద‌రు థియేట‌ర్‌లో వాట‌ర్ బాటిల్స్‌ను ఎంఆర్‌పీ ధ‌ర రూ.20 క‌న్నా ఎక్కువ‌కు, అంటే రూ.50కు అమ్ముతున్నార‌ని కూడా ఫోరంకు తెలిసింది. దీంతో ఫోరం మొద‌టి సారి క‌నుక థియేట‌ర్ ప్ర‌తినిధులను మంద‌లించింది. ఇక‌పై అలా చేస్తే భారీ జ‌రిమానా వేస్తామ‌ని ఫోరం స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే ఫోరం ఓ వినూత్న‌మైన మ‌రో తీర్పు కూడా ఇచ్చింది. ఇక‌పై హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఉన్న థియేట‌ర్స్‌, మ‌ల్టీప్లెక్సులు ఏవైనా వాటిలోకి ప్రేక్ష‌కులు తెచ్చుకునే ఫుడ్‌, వాట‌ర్ బాటిల్స్‌ను అనుమ‌తించాల‌ని చెప్పింది. అంతేకాదు, ప్రేక్ష‌కులకు చ‌ల్ల‌ని తాగునీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని, లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా ఫోరం తీర్పునిచ్చింది. దీంతో అవాక్క‌వ‌డం స‌ద‌రు థియేటర్ ప్ర‌తినిధుల వంతైంది. అవును మ‌రి, ఫ్యామిలీతో స‌ర‌దాగా కాసేపు సినిమా చూద్దామ‌ని వ‌స్తే, సినిమా టిక్కెట్ ధ‌ర‌కు పోటీగా ఫుడ్‌, వాట‌ర్ బాటిల్స్ రేట్ల‌ను పెట్టి అమ్ముతారు క‌దా, ఆ మాత్రం వారికి జ‌ర‌గాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top