అక్క‌డ ఫ్రీ వైఫై ఇంట‌ర్నెట్ పొందాలంటే… కుండీలో చెత్త వేస్తే చాలు..!

నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో పారిశుధ్యం కూడా ఒక‌టి. చిన్న చిన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాలే కాదు, పేరు గాంచిన న‌గ‌రాల్లోనూ ఇప్పుడు ఈ స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా ఇండ్లు, హోట‌ల్స్‌, కార్యాల‌యాలు త‌దిత‌ర ప్ర‌దేశాల నుంచి పెద్ద మొత్తంలో వెలువ‌డుతున్న చెత్తను సేక‌రించ‌డం దాన్ని రీసైకిల్ చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది కూడా నిర్ల‌క్ష్యం వ‌హిస్తుండ‌డంతో చెత్త ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పేరుకుపోతుంది. అలాంటి చెత్త‌ను చూసిన‌ప్ప‌టికీ కొంద‌రు ఏం చేస్తున్నారంటే ఆ చెత్త మీదే ఇంకా చెత్త ప‌డేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారిలో మార్పు తేవడం కోసం, చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. అదేమిటంటే…

trash-free-wifi

ముంబై నగరానికి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్‌లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఓ పాస్‌వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్‌లో అమర్చిన వైఫై రూటర్‌కు యూజర్లు కనెక్ట్ అవచ్చు. ఈ క్రమంలో అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. 50 మీటర్ల దూరంలోనూ ఆ వైఫై ద్వారా ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

ఈ మధ్యే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వైఫై ట్రాష్ బిన్‌లకు మంచి స్పందనే వస్తుందని సదరు స్టార్టప్ చెబుతోంది. ఈ క్రమంలో ముంబై వ్యాప్తంగా ఇలాంటి వైఫై ట్రాష్ బిన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అయితే కేవ‌లం ముంబైలోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనూ ఇలాంటి ట్రాష్ బిన్‌ల‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది క‌దా. దాంతో చెత్త కుండీలోనే వేస్తారు… ఎలాగూ వైఫై ఇంట‌ర్నెట్ ఉచితంగా వ‌స్తుంద‌న్న ఆశ‌తో. అయితే కేవ‌లం 15 నిమిషాలు కాకుండా 30 నిమిషాలు ఇస్తే ఇంకా బాగుంటుంది..!

Comments

comments

Share this post

scroll to top