నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశంలో ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. సామాన్య ప్రజలంతా తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు నిత్యం గంటల తరబడి పోస్టాఫీసులు, బ్యాంకుల వద్ద క్యూలు కూడా కడుతున్నారు. నగదు తీయడం కోసం ఏటీఎంల వద్ద కూడా పెద్ద ఎత్తున లైన్లలో నిలుచుని పాట్లు పడుతున్నారు. అయినప్పటికీ తప్పదు కదా..! ఏం చేస్తాం..! కనీస అవసరాల కోసం డబ్బు తప్పనిసరిగా కావాల్సిందే. లైన్లలో నిలబడి వాటిని డ్రా చేయాల్సిందే. ఈ క్రమంలో జనాలు పడుతున్న ఇబ్బందులను కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఓ వైపు దేశంలోని ప్రజలంతా నగదు కోసం చాలా సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ గ్రామ వాసులకు మాత్రం నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పైగా వారు ఎలాంటి చీకూ చింతా లేకుండా హ్యాపీగా జీవిస్తున్నారు కూడా. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఆ గ్రామం ఏది..?
అది ఉత్తర గుజరాత్‌లోని అకోదర గ్రామం. అక్కడి ప్రజలపై నోట్ల రద్దు ప్రభావం పడలేదు. ఎందుకంటే వారు తమ గ్రామంలో నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలు మాత్రమే నిర్వహిస్తున్నారు కాబట్టి. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది మాత్రం నిజమే. గత సంవత్సర కాలం నుంచి అక్కడ నగదు లావాదేవీలు లేవు. కేవలం క్యాష్‌లెస్ లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. అదెలా సాధ్యమైందంటే…
ఒకప్పుడు అకోదరలో అందరూ నగదుతోనే కార్యకలాపాలు నిర్వహించేవారు. కానీ అక్కడి ప్రభుత్వ అధికారులు ఓ ప్రైవేటు బ్యాంక్‌తో కలిసి ఆ గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవల పట్ల అవగాహన కల్పించారు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, కార్డ్ స్వైపింగ్ వంటి పనులు ఎలా చేయాలో కూడా వారికి నేర్పించారు. మహిళలు, వృద్ధులకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మరీ ఆయా అంశాల్లో శిక్షణనిచ్చారు. కేవలం 3 నెలల్లోనే ఆ గ్రామ వాసులు సదరు బ్యాంక్ సౌకర్యాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. నేర్చుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఇప్పుడు కేవలం క్యాష్‌లెస్ లావాదేవీలు మాత్రమే నడుస్తున్నాయి.
అక్కడి ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు పాడి పరిశ్రమ. గ్రామంలో దాదాపుగా 95 శాతానికి పైగా ప్రజలు పశువుల పెంపకంపైనే ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు పశువుల నుంచి నిత్యం పాలను పిండి వాటిని స్థానికంగా ఉన్న కలెక్షన్ సెంటర్లో పోస్తారు. అక్కడి నుంచి పేమెంట్స్ వారికి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే చేరుతాయి. వాటిని వారు క్యాష్‌లెస్ లావాదేవీలతోనే ఖర్చు చేస్తారు. అయితే వారు కిరాణా సరుకులు కొనాలన్నా మొబైల్ బ్యాంకింగ్ నే వాడతారు. ఏవైనా సరుకులు కొంటే షాపు యజమానికి చిన్న ఎస్ఎంఎస్ రూపంలో కోడ్ టైప్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతలా అక్కడి ప్రజలు సదరు సౌకర్యాలను వాడుకుంటున్నారు. నిజంగా మన దేశంని గ్రామాలన్నీ ఇలా సాధికారత సాధిస్తే అప్పుడు భారత్ ఎందుకు వెలిగిపోదు..! కచ్చితంగా ముందడుగు వేస్తుంది..!