ఒక‌ప్ప‌టి నోకియా 3310… మ‌ళ్లీ విడుద‌లైందోచ్‌..!

ఎన్ని సార్లు నేల‌పై కింద ప‌డినా, నేల‌కేసి కొట్టినా దాదాపుగా ప‌గ‌ల‌ని బిల్డ్ క్వాలిటీ… ప్యానెల్స్‌ను మ‌ళ్లీ అతికించుకుంటే చాలు ప‌నిచేసే నాణ్యత‌… ఎంత‌టి గాఢ నిద్ర‌లో ఉన్నా, ట్రాఫిక్‌లో ఉన్నా పెద్ద‌దైన బేస్ వాయిస్‌తో వ‌చ్చే రింగ్ టోన్స్‌… ఫోన్ బుక్ మెమోరీ, ఎఫ్ఎం రేడియో… వీట‌న్నింటికీ మించి అంద‌ర్నీ అల‌రించే స్నేక్ గేమ్‌..! ఇప్పుడు తెలిసిందా… మేం దేని గురించి చెబుతున్నామో..! అదేనండీ… ఒక‌ప్ప‌టి నోకియా కంపెనీకి చెందిన 3310 ఫోన్ గురించే. అవును, దాని గురించి ఇప్పుడెందుకు..? ఇప్పుడ‌ది మార్కెట్‌లోకి రావ‌డం లేదు క‌దా..? అంటారా..! అయితే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే..! ఎందుకంటే నూత‌న ఫీచ‌ర్లు, డిజైన్‌తో ఇప్పుడు ఆ ఫోన్ మ‌ళ్లీ మార్కెట్‌లోకి విడుద‌లైంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

nokia-3310

స్పెయిన్ దేశం తెలుసు క‌దా. అక్క‌డి బార్సిలోనా సిటీలో తాజాగా మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2017 అనే ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభ‌మైంది. అందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెక్, ఎల‌క్ట్రానిక్‌, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ‌లు పాల్గొంటుండ‌గా, ఆ ప్ర‌ద‌ర్శ‌నలోనే నోకియా త‌న 3310 కొత్త ఫోన్‌ను విడుద‌ల చేసింది. దాని ధ‌ర రూ.3500. అచ్చం పాత 3310 ఫోన్‌ను పోలిన‌ట్టుగానే డిజైన్‌ను కొంత మార్పులు చేసి వార్మ్ రెడ్‌, ఎల్లో, డార్క్ బ్లూ, గ్రే క‌ల‌ర్స్‌లో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. ఇక ఈ కొత్త 3310 ఫోన్‌లో 2.4 ఇంచ్ పోల‌రైజ్డ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 240 X 320 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, 2జీ, సింగిల్‌/డ‌్యుయ‌ల్ సిమ్, నోకియా సిరీస్ 30+ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, ఓపెరా మినీ బ్రౌజ‌ర్‌, ఎంపీ3 రింగ్‌టోన్స్‌, బ్లూటూత్ 3.0, ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ 2.0 వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

nokia-3310-1

ఈ ఫోన్‌లో 1200 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాట‌రీ ఉంది. దీంతో ఫోన్‌కు 31 రోజుల స్టాండ్ బై టైం వ‌స్తుంది. అదే కాల్స్ మాట్లాడితే ఆ టైం 22 గంట‌ల వ‌ర‌కు వ‌స్తుంది. ఇక మ్యూజిక్ ప్లే చేసుకుంటే ఈ ఫోన్ బ్యాట‌రీ 51 గంట‌ల వ‌ర‌కు వ‌స్తుంది. మ‌రి ఈ ఫోన్ మ‌న మార్కెట్‌లోకి ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..? జూన్‌లో..! జూన్ మొద‌టి వారం నుంచి నోకియా 3310 కొత్త ఫోన్ విక్ర‌యాలు ప్రారంభం కానున్నాయి. మరింకెందుకాల‌స్యం… మీకూ ఆ ఫోన్ కావాలంటే… ఆ తేదీ నాడు కొనుగోలు చేయండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top