స్కూళ్లలో కనీస సదుపాయాలు కల్పించే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు విలాసవంతమైన సౌకర్యాలు కట్.. ఉత్తరాఖండ్ హై కోర్టు సంచలన తీర్పు..!

మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అయినా సౌకర్యాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తరగతి గదులు, టాయిలెట్లు సరిగ్గా ఉండవు. మధ్యాహ్న భోజనం సరిగ్గా అందదు. అందినా నాసి రకంగా ఉంటుంది. ఇక క్రీడా మైదానం, లైబ్రరీ, కంప్యూటర్ క్లాసులు వంటి సదుపాయాలు అయితే మచ్చుకు కూడా కనపడవు. ఉపాధ్యాయులైతే చూద్దామంటే కనిపించరు. వచ్చినా నిర్లక్ష్యంగా ఉంటారనే పేరుంది. కానీ వారికి వ్యక్తిగతంగా అందే సదుపాయాలు మాత్రం విలాసవంతంగా ఉంటాయి. అయితే ఇకపై ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం అలా విలాసవంతమైన సదుపాయాలను కట్ చేయనున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సదుపాయాలపై, వాటి దీన స్థితిపై 2014లో డెహ్రాడూన్‌కు చెందిన దీపక్ రానా అనే వ్యక్తి స్థానిక హైకోర్టులో ఓ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశాడు. ఆ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు లేవని, పిల్లలు చాలా కష్టతరంగా స్కూళ్లకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని అతను తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 19, 2016న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. వెంటనే 6 నెలల్లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని, ముఖ్యంగా కనీస సదుపాయాలైన తాగునీరు, టాయిలెట్లు, రక్షణ చర్యలు, క్రీడామైదానం, లైట్లు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, బ్లాక్ బోర్డులు, బెంచిలు వంటి సౌకర్యాలను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది.

అయితే కోర్టు ఆదేశించి 6 నెలలు దాటినా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అధికారులు, పాలకుల నుంచి స్పందన లేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరోసారి హైకోర్టు తీర్పునిచ్చింది. అదేమిటంటే… ప్రభుత్వ పాఠశాలల్లో పైన చెప్పిన విధంగా కనీస సదుపాయాలను కల్పించే వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఇచ్చే విలాసవంతమైన సౌకర్యాలను కట్ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా కార్లు, ఏసీలు, ఫర్నిచర్, బంగళాలు వంటి సదుపాయాలను ఆపేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇక ప్రభుత్వం, అధికారులు కోర్టు ఆదేశాలను పాటించనున్నారు. అవును మరి, మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషిగా చెప్పారు, మాట వినడం లేదని ఇప్పుడు కొట్టినట్టుగా ఆ సౌకర్యాలను కట్ చేశారు. లేదంటే మాట వింటారా..! ఇకనైనా విద్యార్థుల బాగు కోసం అధికారులు, ప్రభుత్వం కొద్దిగా నడుం వంచితే బాగుంటుంది. అది ఉత్తరాఖండ్‌లోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే..!

Comments

comments

Share this post

scroll to top