ఫేస్బుక్ లో మన డేటా లీక్ అయ్యింది అంటున్నారు.? అసలేమైంది.? మన అకౌంట్ సేఫ్ గా ఉందా.? వివరాలు ఇవే.!

నిత్యం ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర్నుంచీ రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు మ‌నం 24 గంట‌లూ ఫేస్‌బుక్ ప్ర‌పంచంలోనే విహ‌రిస్తున్నాం. అనేక విష‌యాల‌ను అందులో షేర్ చేసుకుంటున్నాం. తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకుంటున్నాం. ఇక అందులో చాటింగ్‌, వాయిస్‌, వీడియో కాల్స్‌కు అయితే కొదువే లేదు. అంత‌లా ఫేస్‌బుక్ మ‌న నిత్య జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తోంది. అయితే మేం ఇప్పుడు చెప్ప‌బోయేది తెలిస్తే మాత్రం మీరు ఇక‌పై ఫేస్ బుక్‌ను వాడేందుకు జంకుతారు. దాంట్లో పోస్ట్ పెట్టేముందు ఆలోచిస్తారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ముందు నాటి మాట ఇది. అప్ప‌ట్లో కేంబ్రిడ్జ్‌లో సైకాలజీలో ప్రొఫెసర్ అయిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ కోగన్ అనే వ్య‌క్తి ఆధునిక యుగంలో డిజిట‌ల్ ప్ర‌పంచం వ‌ల్ల మ‌నుషుల వ్యక్తిత్వాలు ఎలా మారుతున్నాయి అని తెలుసుకునేందుకు దిసీజ్ యువర్ డిజిటల్ లైఫ్ అనే ఓ యాప్‌ను త‌యారుచేశాడు. దీన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేసి అనేక ల‌క్ష‌ల మంది ఫేస్‌బుక్ యూజ‌ర్ల డేటాను వారి అనుమ‌తి లేకుండానే దొంగిలించాడు. ఇక త‌రువాత ఇత‌నికి క్రిస్టొఫర్‌ వైలీ అనే ఓ డేటా అన‌లిటిక్స్ నిపుణుడు క‌లిశాడు. వీరు డొనాల్డ్ ట్రంప్ కు స‌న్నిహితుడైన స్టీవ్‌ బానన్ అనే అతనికి తాము చేస్తున్న ఎక్స్‌ప‌రిమెంట్‌ను వివ‌రించారు. దీంతో బాన‌న్ స‌ద‌రు డేటా స‌హాయంతో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల గురించి తెలుసుకోవ‌చ్చ‌ని అది త‌మ విజ‌యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించి ఆ దిశ‌గా ముగ్గురూ క‌లిసి కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే మ‌రో సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఫేస్‌బుక్ కు క‌నెక్ట్ అయి అందులో ఉండే యూజ‌ర్ల స‌మాచారాన్ని వారి అనుమ‌తి లేకుండానే దొంగిలించారు. ఇది అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు పరోక్షంగా ఉప‌యోగ‌ప‌డింది. అయితే ఇది ఒక‌ప్పుడు జ‌రిగిన విష‌యం. కానీ ఈ విష‌యం ఇప్పుడు లీకైంది. దీంతో ఫేస్‌బుక్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఫేస్‌బుక్‌లో యూజ‌ర్ల అనుమ‌తి లేకుండానే వారి డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా దొంగిలించింద‌ని, నిజానికి ఆ డేటాను ఫేస్‌బుక్ సంస్థే స్వ‌యంగా కేంబ్రిడ్జ్ అన‌లిటికాకు అమ్మింద‌ని ఆరోపిస్తున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కేవలం మూడురోజుల్లో తన నికర సంపదలో దాదాపు 500 కోట్ల డాలర్ల మేర నష్టపోయినట్లు తెలిసింది. కాగా ఇదే విష‌యంపై బ్రిటన్‌తో పాటు ఐరోపా సమాఖ్య దేశాల రాజకీయవేత్తలు.. ఈ డేటా లీక్‌ పై జుకర్‌బర్గ్‌ వ్యక్తిగతంగా తమ దేశాలకు వచ్చి వివరణలు ఇవ్వాలని, విచారణను ఎదుర్కొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఫేస్‌బుక్ ఓ ద‌శ‌లో దీన్ని కొట్టి పారేసింది.

కేంబ్రిడ్జ్‌ అనలిటికా చేసిన ప‌ని కుంభ కోణం కింద‌కు రాద‌ని, అది కేవ‌లం డేటా బ్రీచ్ (ఉల్లంఘ‌న‌) మాత్ర‌మేన‌ని ఫేస్‌బుక్ తెలిపింది. దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ చేప‌ట్టామ‌ని, ఆ సంస్థకు డేటా చోరీపై స‌మాచారం ఇచ్చామ‌ని ఫేస్‌బుక్ వెల్ల‌డించింది. అయితే ఇలా ఫేస్‌బుక్ యూజ‌ర్ల డేటా చోరీ అవ‌డంపై మాత్రం యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు జుక‌ర్ బ‌ర్గ్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. యూజ‌ర్ల అనుమ‌తి లేకుండా వారి డేటాను వేరే ఎవ‌రో దొంగిలిస్తుంటే చేతులు ముడుచుకుని ఫేస్‌బుక్ ఎందుకు కూర్చుంద‌ని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విష‌యంలో ఫేస్‌బుక్ చేసింది ముమ్మాటికీ త‌ప్పేన‌ని, అస‌లు ఆ సంస్థే యూజర్లే డేటాను వారి అనుమ‌తి లేకుండా ఇత‌రుల‌కు అమ్మింద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇక ఈ వివాదం ఎప్ప‌టికి స‌ద్దుమ‌ణుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఫేస్‌బుక్ వాడ‌కం కొంత త‌గ్గిస్తే మంచిది. ఆ సంస్థ ఎలాగూ మ‌న విలువైన స‌మాచారాన్ని దొంగిలిస్తుంది క‌దా. క‌నుక మ‌న‌కు చెందిన ముఖ్య‌మైన వివ‌రాల‌ను అందులో పెట్ట‌క‌పోవ‌డ‌మే ఉత్తమం. దీనిపై మీరేమంటారు..?

 

 

 

Comments

comments

Share this post

scroll to top