ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించారా..? అయితే మీ వీడియో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్తుంది, జాగ్ర‌త్త‌..!

న‌గ‌రాలు మొద‌లుకొని ఓ మోస్త‌రు పట్ట‌ణాల వ‌ర‌కు ఆయా ప్రాంతాల్లో నేడు ఎక్క‌డ చూసినా ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాభా పెరిగిపోతుండ‌డం, నిత్యం అధిక సంఖ్య‌లో వాహ‌నాలు రోడ్డుపైకి వ‌స్తుండ‌డం, ఇరుకైన గుంత‌లు ప‌డిన ర‌హ‌దారులు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల వాహ‌న‌దారులు గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో వేచి చూడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ర‌హ‌దారుల‌పై జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాలు కూడా పెరుగుతున్నాయి. వీటికి కూడా అనేక కార‌ణాలు ఉన్నాయి. అయితే ఇలా ప్ర‌మాదాలు పెర‌గ‌డ‌మేమో కానీ స‌గ‌టు పౌరుడికి వాహ‌నంతో ర‌హ‌దారి పైకి రావాలంటేనే భ‌యం క‌లుగుతోంది. ఎప్పుడు ఏం ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని కొంద‌రు జంకుతూనే వాహ‌నాల‌ను న‌డుపుతున్నారు. దీనికి తోడు అలాంటి వారికి మ‌రింత జంకు క‌లిగేలా కొంద‌రు వాహ‌న‌దారులు ఇష్టానుసారంగా, నిర్ల‌క్ష్యంగా, అతి వేగంగా వాహ‌నాల‌ను న‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ రూల్స్‌ను వారు మీరుతున్నారు. ఇలాంటి వారిని ప‌ట్టుకోవ‌డం ట్రాఫిక్ పోలీసుల‌కు కూడా క‌ష్టంగానే మారింది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎందుకంటే నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డిపే వారిని, ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని వారిని ప‌ట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ కొత్త ఆలోచ‌న చేసింది. అదే ‘ఐ వోర్న్ కెమెరాస్ (eye worn cameras)’. అంటే కంటికి ధ‌రించే కెమెరాల‌న్న‌మాట‌.

eye-worn-camera

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఈ eye worn cameras ను కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌స్తుతం ఇలాంటి కెమెరాల‌ను ఏడింటిని రాష్ట్ర‌ప్ర‌భుత్వం సైబ‌రాబాద్ పోలీస్ కమిష‌రేట్‌లో ప‌నిచేస్తున్న ప‌లువురు ట్రాఫిక్ పోలీస్ అధికారుల‌కు అంద‌జేసింది. ఈ కెమెరాల స్పెషాలిటీ ఏంటంటే చూసేందుకు అవి కూలింగ్ గ్లాస్‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ వాటికి అమ‌ర్చిన ప్ర‌త్యేక కెమెరాల ద్వారా ఏ దృశ్యాన్నైనా రికార్డ్ చేయ‌వ‌చ్చు. వాటిని ధ‌రించిన ట్రాఫిక్ పోలీసులు ర‌హ‌దారిపై నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా నిర్లక్ష్యంగా వెళ్లే వాహ‌న‌దారుల‌ను వీడియో తీసి దాని ఆధారంగా వారిని ప‌ట్టుకుంటార‌న్న‌మాట‌. అంతేకాదు అవినీతికి పాల్ప‌డే అధికారుల గుట్టు ర‌ట్టు చేసేందుకు కూడా ఈ కెమెరా క‌మ్ సన్ గ్లాసెస్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ eye worn cameras లో 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటుంది. దీంతో 21 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా వీడియోల‌ను చిత్రీక‌రించేందుకు వీలు క‌లుగుతుంది. అలా తీసిన వీడియోల‌ను ఏరోజు కారోజు స్థానికంగా ఉండే పోలీస్ స్టేష‌న్ కంప్యూట‌ర్ల‌లో స్టోర్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ కెమెరాలు 7 మాత్ర‌మే ఉండ‌గా, త్వ‌ర‌లో ఇలాంటివి 75 వ‌ర‌కు పోలీసుల‌కు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఇలాంటి గ్లాస్‌ల‌ను పోలీసులు వాడ‌డం ఇదే ప్ర‌థ‌మ‌మ‌ట‌. అయితే ఈ కెమెరాల‌తోపాటు శ‌రీరానికి ధ‌రించే కెమెరాల‌ను కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి తేనున్నారు. ఇంత‌టి అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీని వాడ‌బోతున్న మ‌న పోలీస్ యంత్రాంగం కొత్త ప్ర‌య‌త్నంతోనైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించే వారి ఆట ముగుస్తుందో లేదో చూడాలి మ‌రి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top