దోచుకున్నోడికి దోచుకున్నంత..! ఈ మాట అవినీతి పరులకు కరెక్ట్ గా సరిపోతుంది. అవును మరి. ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరు కూడా అలాగే అంటారు. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమవుతూనే ఉన్నా పెట్రోల్ బంకుల యజమానులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ మనల్ని దోపిడీ చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనం ఏదైనా కరెక్ట్ పరిమాణంలో కొట్టరు. అందుకు గతంలో వారు అనేక మార్గాలను అనుసరించే వారు. అయితే తాజాగా వెలుగు చూసిన సంఘటనలతో పెట్రోల్ బంకుల యజమానులు పాల్పడుతున్న మరో మోసం బయట పడింది.
ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవలే వాహనదారుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కొన్ని పెట్రోల్ బంకులపై దాడులు జరిపారు. దాంతో ఆ అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. సదరు బంక్‌ల యజమానులు వాహనదారులకు తక్కువ పెట్రోల్ పోస్తున్నట్టు తెలిసింది. వాహనదారులు ఎంత పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకున్నా 10 నుంచి 15 శాతం మేర తక్కువగా ఇంధనం పడేలా సదరు మెషిన్లలో ముందుగానే సెట్ చేసి పెట్టారట. అందుకోసం బంక్ యజమానులు ప్రత్యేక చిప్‌లను కూడా అమర్చినట్టు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో దాడులు చేసిన అధికారులు ఆ బంక్‌లను సీజ్ చేశారు. అయితే ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న చాలా బంకుల్లో చేస్తున్నారట. యూపీలో దాడులు చేశారు కాబట్టి బయట పడింది. కానీ బయట పడని ఇంకా ఎన్నో బంకులు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడండి. వాహనంలో ఇంధనం నింపుకుంటే ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. పెట్రోల్ బంకుల్లో మనకు కొట్టి ఇచ్చిన ఇంధనం పరిమాణం ఎంత ఉందో చెక్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. వాటి ద్వారా మనకు కూడా అలా ఇంధనం ఏమైనా తక్కువ కొడుతున్నారా, లేదా అన్నది తెలుస్తుంది..! ఎంతైనా మనం డబ్బులు పెట్టి కొంటున్న విలువైన ఇంధనం కదా, కనుక మనం అస్సలు మోసపోకూడదు..!