ట్రాఫిక్ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వాహనదారులూ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికిల్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గతంలో ఉన్న చట్టానికే మార్పులు చేసి ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 25, 2017వ తేదీ నుంచి ఈ చట్టం ప్రకారం మారిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఇకపై ఎలాంటి వాహనం నడిపే డ్రైవర్ అయినా (ఆఖరుకు టూ వీలర్ అయినా సరే) వారికి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫైన్ పడదు. అందుకు గాను కొన్ని పాయింట్లను ఫైన్‌గా వేస్తారు. అలా ఎన్ని సార్లు నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడినా ఫైన్‌కు బదులు పాయింట్లనే వేస్తారు. ఈ క్రమంలో ఆ పాయింట్లు 12 గనక దాటితే అప్పుడు ఏకంగా ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక లెర్నింగ్ లైసెన్స్ అయితే పూర్తిగా రద్దు అవుతుంది. అలాంటప్పుడు వారు మళ్లీ లైసెన్స్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఏయే ఉల్లంఘనకు ఎన్ని పాయింట్లు వేస్తారంటే…
ఉల్లంఘన పాయింట్లు
ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే 1
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2
హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపితే 1
రాంగ్ రూట్లో వాహనం నడిపితే 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3
ప్రమాదకరంగా వాహనం నడపడం/సెల్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్ 2
మద్యం తాగి బైక్ నడిపితే, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే 3
మద్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4
మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగినడిపితే 5
ఇబ్బంది కలిగేలా నడిపితే/శబ్ద, వాయు కాలుష్యానికి కారణమైనా/అనుమతిలేని చోట పార్క్ చేసినా 2
బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2
అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2
ర్యాష్ డ్రైవింగ్/ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపరిచేలా నడిపితే 2
నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే 5
వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీ తదితర నేరాలకు పాల్పడితే 5
చూశారుగా..! ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని వాహనాలు నడపాల్సిందే. లేదంటే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే అలా ఏడాది పాటు లైసెన్స్ రద్దు అయి మళ్లీ వాహనాలను నడుపుతూ కూడా అలాగే పాయింట్లు దాటితే అప్పుడు ఏకంగా 3 ఏళ్ల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే తరహా పాయింట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మరి ఇది ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. అది సరే… డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. అప్పుడు ఉల్లంఘనలకు పాల్పడితే పాయింట్లు వేసి అవి దాటాక లైసెన్స్ రద్దు చేస్తారు. కరెక్టే.. మరి అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే వారికి ఎలా పాయింట్లు వేస్తారు..? దీనిపై కూడా ఆలోచిస్తే బెటర్. అప్పుడు చాలా ప్రమాదాలు కాకుండా చూడవచ్చు..!