అప్పుడెప్పుడో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలసి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు… అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో… గవర్నర్ నరసింహన్ నియామకమయ్యారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా, ఆయన పదవీ కాలం ముగిసినా కేంద్ర ప్రభుత్వం దాన్ని పొడిగిస్తూనే ఇప్పటి వరకు వచ్చింది. అయితే త్వరలో గవర్నర్‌ను మార్చనున్నారా..? అంటే అందుకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌కు త్వరలో ఉద్వాసన పలికి ఆయన స్థానంలో రెండు రాష్ట్రాలకు ఓ కొత్త గవర్నర్‌ను ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.
కర్ణాటక విధాన పరిషత్ సభాపతి, బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకర మూర్తినే గవర్నర్‌గా నియమించనున్నట్టు తెలిసింది. అయితే ఈయనను కేవలం తెలంగాణకే గవర్నర్‌గా నియమిస్తారా..? లేదంటే రెండు రాష్ట్రాలకు కలిపి ఈయనే గవర్నర్‌గా ఉంటారా..? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే శంకర మూర్తితో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు చర్చించినట్టు తెలిసింది. గత వారం కిందటే ఈ చర్చలు జరిగాయని సమాచారం.
కాగా శంకర మూర్తిని కొత్త గవర్నర్‌గా ఎప్పుడు నియమించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ మరో రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్టు తెలిసింది. అయితే ఇంత సడెన్‌గా నరసింహన్‌ను తప్పించి ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ పనితీరును గవర్నర్ నరసింహన్ పదే పదే మెచ్చుకుంటుండడం, అటు తెలుగు తమ్ముళ్లకు, ఇటే బీజేపీ శ్రేణులకు మింగుడు పడడం లేదని, కొందరైతే ఆయన వ్యవహార శైలి నచ్చక ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.