పాపం జనాలు… నగదు విత్ డ్రా కోసం భారీ క్యూలైన్లలో గంటల తరబడి, ఇంకా చెప్పాలంటే తెల్లవార్లూ వేచి ఉన్నా నోట్లు లభిస్తాయో లేదో… వస్తే ఎన్ని వస్తాయో కూడా తెలియని అయోమయ స్థితిలో… నిత్యం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి జనాల ముఖం చూసైనా కొందరు బ్యాంక్ అధికారులకు దయ కలగడం లేదు సరి కదా… అలాంటి వారు ఎల్లప్పుడూ బడాబాబులు, నల్ల కుబేరుల సేవలోనే తరిస్తున్నారు. లైన్లలో నిలబడ్డ జనాలు ఏమైనా కానీ… మాకు అనవసరం… మాకు లాభం కలిగితే చాలు… అంటూ సదరు బ్యాంక్ అధికారులు వ్యహరిస్తున్న తీరు చూస్తుంటే సగటు పౌరుడికి ఏం చేయాలో తెలియని స్థితి ఏర్పడింది. బ్యాంకు ముందు ఎంత పెద్ద లైనున్నా… వెనుక తలుపు గుండా రండి… నగదు మొత్తం పట్టుకుపోండి… మా కమిషన్ మాకు ఇవ్వండి… అంటూ కొందరు బ్యాంక్ అధికారులు నల్ల కుబేరులకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. అందుకు శేఖర్ రెడ్డి ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం.
టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు, చెన్నై వాసి అయిన శేఖర్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో గత కొద్ది రోజుల క్రితం ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున బంగారం, కొత్త, పాత నోట్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అందులో రూ.131 కోట్ల నగదు, 170 కిలోల బంగారం ఉంది. అయితే ఆ కరెన్సీలో రూ.2వేల నోట్లు రూ.34 కోట్ల వరకు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో శేఖర్ రెడ్డిని సంబంధిత అధికారుల అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అందులో అధికారులకు తెలిసిన విషయాలు వారిని షాక్‌కు గురి చేశాయి.
సాధారణంగా మింట్ లలో ప్రింట్ అయ్యే కరెన్సీ నోట్లు ముందుగా ఆర్బీఐకి ఆ తరువాత బ్యాంకులకు చెందిన స్కేప్‌లకు (ప్రత్యేక శాఖలకు) అటు నుంచి బ్యాంకులకు చేరతాయి. అయితే ఈ మధ్య కాలంలో నోట్ల రద్దు అనంతరం కరెన్సీకి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఏం చేసిందంటే ప్రింట్ అయిన నోట్లను నేరుగా బ్యాంక్ స్కేప్‌లకు, బ్యాంకులకు పంపే ఏర్పాటు చేసింది. ఇదే శేఖర్ రెడ్డి లాంటి నల్లబాబులకు వరంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అతను ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్‌లకు చెందిన స్కేప్ల అధికారులతోనే కుమ్మక్కై కమిషన్ బేసిస్‌లో నగదు మార్పిడి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండడంతో కక్కుర్తి పడిన బ్యాంక్ స్కేప్ అధికారులు సదరు కొత్త కరెన్సీని బ్యాంకులకు పంపకుండానే నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిన కరెన్సీని వచ్చినట్టు శేఖర్ రెడ్డికి పంపారట. పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో శేఖర్ రెడ్డికి 10 మంది దాకా బ్యాంక్ అధికారులు సహకారం అందించినట్టు తెలియరాగా, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు పోలీసుల విచారణలో తెలియనున్నాయి. నల్లధనం నిర్మూలన అవుతుందని ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రవేశపెట్టినా… ఇలాంటి అవినీతి బ్యాంక్ అధికారులు ఉంటే అప్పుడు నల్లధనం ఎలా నిరోధించబడుతుంది..? శేఖర్ రెడ్డి విషయం బయటకు తెలిసింది కాబట్టి అతన్ని పట్టుకున్నారు. మరి అలాంటి నల్లబాబులు ఇంకా ఎంత మంది ఉన్నారో..? ఇప్పటి వరకు అలా దొడ్డి దారిన ఎన్ని వందల కోట్లను మార్చుకున్నారో ఎవరికి తెలుసు..? ఏమో..! జనాలు మాత్రం కష్టాలు పడక తప్పదు..!