టెక్నాలజీ అంతకంతకూ పెరగడం, కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా పోవడంతో ఆయా దిగ్గజ కంపెనీలన్నీ ఇపుడు ఇండియాపై దృష్టి పెడుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా వినుతి కెక్కిన భారత్‌లోకి ఎంటర్ కావాలన్నది ప్రపంచ మార్కెట్‌ను వివిధ రంగాలను శాసిస్తున్న అన్ని కంపెనీలు ఆలోచన. ఎక్కడలేనంతటి మార్కెట్ ఇక్కడ ఉందనేది వారి నమ్మకం. చైనాలో ఎంటర్ కావాలంటే, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఆ దేశంలో ఎక్కడలేనన్ని నియమ నిబంధనలు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని నష్టాలు పొందడం కంటే అన్నింటికి అనుమతులు త్వరగా ఇచ్చే ..ఫ్రీ మార్కెట్ ఎకానమీకి బార్లా తెరిచిన భారత్‌లోనే తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి. జియో రిలయన్స్ పుణ్యమా అని దేశ వ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది ఎంతలా అంటే చెప్పలేనంతగా. ఆక్టోపస్‌లా విస్తరించింది. చాప కింద నీరులా చేరి పోయింది.
దీంతో దిగ్గజ టెలికాం కంపెనీలన్నీ డేటాను మరింత చేరువ చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. అయినా వారి ప్రణాళికలు , పాచికలు పారడం లేదు. ఇక్కడంతా రిలయన్స్ టెలికాం కంపెనీ గుత్తాధిపత్యం నడుస్తోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయా కంపెనీలన్నీ దీనితోనే టైఅప్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. టెలికాం రంగంలో ఏకంగా నెంబర్ వన్ పొజిషన్లోకి త్వరలో చేరుకోనుంది. జియో కస్టమర్లు 33 కోట్లకు చేరుకున్నారు. ఇండియాలో ఇదో అతి పెద్ద రికార్డుగా నమోదైంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండడంతో డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ ఆప్టికల్ ఫైబర్ ను మరింత పెంచుకుంటూ వెళుతోంది. ఇప్పటికే 4జి సర్వీసులు అందిస్తున్న రిలయన్స్ ..5జి సేవలు అందించేందుకు రెడీ అవుతోంది.
దీంతో వీడియోల వీక్షణం ఎక్కువగా ఉంటోంది. డిజిటల్ మీడియా విస్తరించడం..గణనీయంగా ఆదాయం సమకూరడం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ సర్వీసుల వాడకం ఊపందుకుంది. దీంతో వాల్డ్ డిస్నీకి చెందిన నెట్ ఫ్లిక్స్ సైతం దూకుడు పెంచింది. ఇండియాలో తన వినియోగదారులను పెంచుకునేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. ప్రత్యేకంగా ఓ చౌక ప్లాన్‌ను తీసుకు వచ్చింది. నెలకు కేవలం 199 రూపాయలు చెల్లిస్తే చాలు ..కావాల్సినన్ని వీడియోలు వీక్షించొచ్చు. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. ఈ ప్లాన్ కేవలం మొబైల్, ట్యాబ్లెట్ కస్టమర్లకు మాత్రమే. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్ 499 రూపాయలుగా ఉంది. నిన్నటి నుంచే అమలులోకి తీసుకు వచ్చింది ఈ కంపెనీ. ఈ ప్లాన్‌కు కొన్ని పరిమితులను కూడా విధించింది. దీని ద్వారా అమెజాన్, హాట్ స్టార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తం మీద డిజిటల్ పరంగా యుద్ధం మొదలైనట్టేనని భావించవచ్చు.