నీట్ ప‌రీక్ష చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల స‌మ‌స్య‌లు. ప్ర‌శ్న ప‌త్రాల్లో అనువాదాల త‌ప్పులొచ్చాయ‌ట‌.!?

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test). దీన్నే నీట్ (NEET) అంటారు. ఈ మ‌ధ్యే సీబీఎస్ఈ దీన్ని నిర్వ‌హించింది. ప‌రీక్ష సంద‌ర్భంగా విద్యార్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిన అధికారులు కూడా విమ‌ర్శ‌ల పాల‌య్యారు. అర్థం ప‌ర్థం లేని రూల్స్ పెట్టి విద్యార్థుల‌కు ప‌రీక్ష సంద‌ర్భంగా వారు చుక్క‌లు చూపించారు. అయితే ఇంతా చేసి నీట్‌లో ఇంగ్లిష్ కాకుండా ఇత‌ర భాష‌ల్లో ప‌రీక్ష రాసే వారు పాస‌వుతారా..? అంటే గ్యారంటీ లేద‌ట‌. అవును, మీరు వింటున్న‌ది నిజమే. అది ఎందుకంటే…

నీట్ ప‌రీక్షను ఇంగ్లిష్ లో రాసే వారు కూడా ప్రాంతీయ భాష‌ల్లో రాసేవారికి ఆ ప‌రీక్ష‌లో వ‌చ్చిన ప్ర‌శ్న‌లు అర్థం కాలేద‌ట‌. అంటే.. వారికి స‌మాధానాలు తెలియ‌వు, రావు అని కాదు. ఇంగ్లిష్ భాష నుంచి ప్రాంతీయ భాష‌ల్లోకి ఆ ప్ర‌శ్న‌ల‌ను అనువదించిన‌ప్పుడు ఆ అనువాదం స‌రిగ్గా జ‌ర‌గ‌లేద‌ట‌. ఇంగ్లిష్ ప్ర‌శ్న‌ల‌కు వాటిని అనువాదం చేశాక వ‌చ్చిన ప్రాంతీయ భాష‌ల ప్ర‌శ్న‌ల‌కు చాలా తేడా ఉంద‌ట‌. ఆ అనువాదంలో పొర‌పాట్లు చాలా ఉన్నాయ‌ట‌. వీటి గురించి ప్రాంతీయ భాషల్లో నీట్ ప‌రీక్ష రాసిన విద్యార్థులే చెబుతున్నారు.

ఆమె పేరు ఫ‌ర్హానా బ‌వాని. అహ్మ‌దాబాద్ వాసి. ఆమె తండ్రి ఓ ఆటో రిక్షా కార్మికుడు. ఆ ప‌ని చేస్తూనే అత‌ను ఫ‌ర్హానాను సీబీఎస్ఈ ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివించాడు. దీంతో బ‌వాని తండ్రి ప‌డ్డ శ్ర‌మ‌కు ఫ‌లితంగా అందులో 99 శాతం ఉత్తీర్ణ‌త సాధించి అత్యుత్త‌మంగా నిలిచింది. అయితే ఈమె ఇటీవ‌లే నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష‌ను కూడా రాసింది. త‌న మాతృభాష గుజ‌రాతీ కావ‌డంతో అదే భాష‌లో నీట్ రాసింది. అయితే నీట్ ఇంగ్లిష్ భాష ప్ర‌శ్నాప‌త్రానికి, గుజరాతీ భాష ప్ర‌శ్న ప‌త్రానికి చాలా తేడా ఉంద‌ట‌. ప్ర‌శ్న‌లు ఒక్క‌టే అయినా వాటి అనువాదంలో చాలా పొర‌పాట్లు జ‌రిగాయ‌ట‌. దీంతో ఆ ప్ర‌శ్న‌లు ఆమెకు స‌రిగ్గా అర్థం కాక ప‌రీక్ష స‌రిగ్గా రాయ‌లేదట‌. మీడియా ముందు ఆమె త‌న గోడును వెళ్లబోసుకుంది. మార్కులు త‌క్కువ వ‌స్తే త‌న‌కు ఎంబీబీఎస్ సీటు రాద‌ని, ఎప్ప‌టికైనా డాక్ట‌ర్ కావాల‌నేది త‌న క‌ల‌ని, నీట్ ప‌రీక్ష ప్ర‌శ్న పత్రంలో ఉన్న త‌ప్పుల కార‌ణంగా త‌న క‌ల సాకారం అయ్యే అవ‌కాశం లేద‌ని ఆమె ఆవేద‌న చెందుతోంది.

ఇది ఒక్క ఫ‌ర్హానా వేద‌న మాత్ర‌మే కాదు, దాదాపుగా ప్రాంతీయ భాష‌ల్లో ప‌రీక్ష రాసిన విద్యార్థులంద‌రిదీ ఇదే స‌మ‌స్య‌ట‌. ఓ సంస్థ చేసిన స‌ర్వే రిపోర్టు ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి. ఇక నీట్ నిర్వ‌హించిన ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top