ఈ రోజుల్లో హీరోయిన్స్ అంటే ఒకటో, రెండో.. మహా అయితే ఓ పది సినిమాలు చేయడమే కష్టం. కానీ నయన్ మాత్రం వీటికి అతీతం. దాదాపు 15 సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీ గడపతొక్కిన ఈ భామ నేటికీ యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. లేడీ సూపర్‌స్టార్‌గా తన గ్లామర్ డోస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం ఏర్పర్చుకున్న ఈ భామ అతిత్వరలో పెళ్లి పీటలెక్కనుందని సమాచారం.
అంతకుముందు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించిన నయన్.. సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ చివరకు ప్రభుదేవాతో కట్ చేసుకుంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఆమె ప్రేమలో పడిందని చాలాకాలంగా ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు వీరిద్దరి దృష్టికి వచ్చినప్పటికీ ఎప్పుడూ ఖండించిన దాఖలాలు లేవు. పైగా విఘ్నేశ్ పుట్టిన రోజున నయన్ ఏకంగా ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు అవకాశమున్నప్పుడల్లా తమ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మా ప్రేమ నిజమేనని చెప్పకనే చెప్పింది నయన్-విఘ్నేశ్ జంట.
ఇదిలా ఉండగా నయన్-విఘ్నేశ్ కొచ్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ఆ మధ్య కాలంలో వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. వారికింకా పెళ్లి కాలేదని, అతిత్వరలో వారిద్దరూ వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించనున్నారట. వివాహ అనంతరం చెన్నైలో కాపురం పెట్టనున్నారని మరో సమాచారం.