తేనెను తరచూ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. ఎన్నో వేల ఏళ్ల కింద నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉన్న బలవర్దకమైన ఆహారంగా తేనె మనందరికీ ఉపయోగపడుతోంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తేనె వల్ల ఏయే సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు…
మొటిమలను తొలగించడంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా తేనెను తీసుకుని నేరుగా మొటిమలపై రాయాలి. 10-15 నిమిషాలు ఆగాక శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి.
మచ్చలు…
తేనెలో ఉన్న బ్లీచింగ్ గుణాలు మచ్చలను దూరం చేస్తాయి. కొద్దిగా తేనెను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి కొంత సేపు ఆగాక కడగాలి. తరచూ ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి.
మాయిశ్చరైజర్…
చర్మానికి మృదుత్వాన్ని అందించే సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌గా తేనె పనిచేస్తుంది. ముఖంపై ఫేస్ ప్యాక్ రూపంలో తేనె తరచూ రాస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది. మృదువుగా కూడా మారుతుంది.
హెయిర్ కండిషనర్…
ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లను మిశ్రమంగా కలిపి కుదుళ్లకు తగిలేలా జుట్టుకు పట్టించాలి. 20 నుంచి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో వెంట్రుకలు మృదువుగా మారుతాయి.
యాంటీ ఏజింగ్…
వృద్ధాప్య ఛాయలను దూరం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. రోజుకో టేబుల్ స్పూన్ తేనెను అలాగే తీసుకుంటే నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి.
లిప్ స్క్రబ్…
ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం తీసుకుని బాగా మిశ్రమంగా కలపాలి. దీన్ని పెదాలకు రాయాలి. 5 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారుతాయి.
నెయిల్ కండిషనర్…
ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను తీసుకుని మిశ్రమంగా కలపాలి. దీన్ని గోర్లకు రాయాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీని వల్ల గోళ్లు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతాయి.
నల్లటి వలయాలు…
ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ బాదం ఆయిల్‌ను తీసుకుని బాగా కలపాలి. దీన్ని కళ్ల కింద మసాజ్ చేసినట్టు రాయాలి. 10-15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీని వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు తగ్గిపోతాయి.
దురద…
చర్మ సమస్యలను పరిష్కరించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు తేనెలో ఉన్నాయి. సమస్య ఉన్న ప్రదేశంపై కొద్దిగా తేనెను రాసి 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, గజ్జి వంటి సమస్యలు తగ్గిపోతాయి.